► రూ.10.80 లక్షలు మాయంపై బాధితుల ఫిర్యాదు
► పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోని పోలీసులు
► ఎట్టకేలకు డీవైఎస్పీ చొరవతో నమోదైన కేసు
అనంతపురం : వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా రూ.10.80 లక్షలు ఉన్న సూట్‌కేస్ అది. అయితే ఆ సూట్‌కేస్‌లోని డబ్బు మాయమైంది. వాటి స్థానంలో వాటర్ బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి బాధితుడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదుకు వారు ససేమిరా అన్నారు. పది రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు. చివరకు అనంతపురం డీవైఎస్పీ మల్లికార్జునవర్మ ఆదేశంతో కేసు నమోదు చేయక తప్పలేదు.
ఎలా జరిగిందంటే...
అనంతపురం రూరల్ మండలం పూలకుంటకు చెందిన ఓబిరెడ్డి హైదరాబాద్‌లో ఓ పరిశ్రమ స్థాపించి అక్కడే వ్యాపారం చేస్తున్నారు. అనంతపురంలో ఓ వ్యాపారి నుంచి రూ.11 లక్షలు రావాల్సి ఉండగా వాటి వసూలు కోసం గత నెల 29న ఇక్కడికి వచ్చారు. స్థానిక సప్తగిరి లాడ్జిలో 119 గది అద్దెకు తీసుకున్నారు. తమ అన్న వస్తున్నాడని తెలిసి ఓబిరెడ్డి సోదరుడు మల్లిరెడ్డి తదితరులు అదే రోజు లాడ్జికి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఓబిరెడ్డి అరవిందనగర్‌కు వెళ్లి తనకు రావాల్సిన రూ.11 లక్షలు వసూలు చేసుకుని తిరిగి లాడ్జికి చేరుకున్నారు. డబ్బు లెక్కపెట్టి అందులో తను రూ.10 వేలు, సోదరుడు మల్లిరెడ్డి రూ.10 వేలు తీసుకున్నారు. మిగిలిన రూ.10.80 లక్షలు సూట్‌కేసులో పెట్టి తాళం వేసి ఓబిరెడ్డి తన వద్ద ఉంచుకున్నారు.
అందరూ బయటకు వెళ్తే గదికి తాళం వేసి ఆ తాళం కూడా ఓబిరెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. రాత్రి 9 గంటలకు లాడ్జికి వచ్చిన ఆయన గదిలో ఉంచిన సూట్‌కేసు తీసుకుని కౌంటరులో బిల్లు మొత్తం చెల్లించి హైదరాబాద్‌కు ఓ ప్రైవేట్ బస్సులో బయలుదేరి వెళ్లారు. 30న ఉదయం బస్సు దిగి ఇంటికెళ్లి సూట్‌కేస్ తెరచి చూడగా అందులో డబ్బుకు బదులు వాటర్ బాటిళ్లు ప్రత్యక్షమయ్యాయి. వెంటనే ఆయన ఈ విషయాన్ని పూలకుంటలోని తన సోదరుడు మల్లిరెడ్డికి సమాచారం అందించారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్తే...
జరిగిన సంఘటనపై గత నెల 30న ఫిర్యాదు చేసేందుకు ఓబిరెడ్డి సోదరుడు మల్లిరెడ్డి అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే ఫిర్యాదు తీసుకుంటే కేసు నమోదు చేయాల్సి వస్తుందని ససేమిరా అన్నారు. ఆ రోజు నుంచి ఉదయం, సాయంత్రం ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగినా లాభం లేదు. చివరకు రెండ్రోజుల కిందట బాధితుడు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మను కలసి తమ గోడు వెల్లబోసుకున్నాడు. ఆయన ఆదేశాలతో పోలీసులకు కేసు నమోదు చేయక తప్పలేదు.
లాడ్జీలో పని చేసే వారి పనేనా?
రూ.10.80 లక్షలు మాయం వెనుక లాడ్జీలో పని చేసే వారి హస్తం ఉంద నే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గదికి తాళం వేసి బయటకు వెళ్లిన సమయంలో మారుతాళంతో గది తలుపు తీసి సూట్‌కేసులోని డబ్బు నొక్కేసి, వాటి స్థానంలో వాటర్ బాటిళ్లు ఉంచారని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు.
సూట్‌కేసు నమోదులో తాత్సారం
Published Fri, Jun 10 2016 3:01 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM
Advertisement