చిన్ననోట్లు అందుబాటులో ఉంచాలి
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం
ఒంగోలు టౌన్ : పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. బ్యాంకుల్లో చిన్ననోట్లు అందుబాటులో ఉంచి ప్రజల అవసరాలు తీర్చడానికి బ్యాంకు అధికారులు తమ వంతు సహకారం అందించాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కరెన్సీ నోట్లు, మొబైల్ బ్యాంకింగ్ అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. సామాజిక భద్రత పింఛన్లు పొందుతూ లేవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులకు కొంత మొత్తం నగదు పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని విసృ్తతంగా వినియోగించుకోవాలని కోరారు.
ఉపాధి కూలీలు, పింఛన్‌దారులకు రిజిస్ట్రేషన్ చేపట్టాలి
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతన కూలీలు, సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులంతా మొబైల్ బ్యాంకింగ్ సేవలు పొందే విధంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత శాఖల్లో రిసోర్స్ పర్సన్ల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించి నగదు రహిత లావాదేవీలు జరిపే విధంగా చైతన్యవంతం చేయాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని 1.8 లక్షల మంది వేతన కూలీల బ్యాంకు ఖాతాలకు ఆధార్ సీడింగ్ చేపట్టాలన్నారు. ఆధార్ సీడింగ్ అనంతరం బ్యాంకు ఖాతాలు, బ్యాంకు బ్రాంచ్‌ల వివరాలను ఎల్‌డీఎంకు అందించి మొబైల్ రిజిస్ట్రేషన్ చేరుుంచేలా చూడాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారిని గుర్తించి జన్‌ధన్ ఖాతాలు తెరిపించి రూపే కార్డులు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. పోస్టాఫీసు ఖాతాలు కలిగిన వాటిని బ్యాంకు ఖాతాలకు మార్చాలని ఆదేశించారు.
రెండువేల మందిని రిజిస్ట్రేషన్ చేరుుంచాలి
మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు వీలుగా మండలానికి కనీసం రెండువేల మందితో మొబైల్ రిజిస్ట్రేషన్ చేరుుంచాలని కలెక్టర్ ఆదేశించారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారు ఫీల్డ్ అసిస్టెంట్, వీఏవో, బ్యాంకు మిత్రలతో మొబైల్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేపట్టాలన్నారు. ఏ బ్యాంకు ఖాతాదారుడు అరుున మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు కామన్ ఫారం రూపొందించాలని ఎల్‌డీఎంకు సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో ఏటీఎంల ద్వారా మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కలిగించాలని మెప్మా పీడీని ఆదేశించారు. మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అంశంలో ఖాతాదారులకు బ్యాంకులు సహకరించాలన్నారు. సమావేశంలో ఎల్‌డీఎం నరసింహారావు, జెడ్పీ సీఈవో బాపిరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్ మురళి, డ్వామా పీడీ పోలప్ప, మెప్మా పీడీ అన్నపూర్ణ, ఖజానా శాఖ డిప్యూటీ డెరైక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.