సుల్తాన్‌బజార్ బంద్ సక్సెస్
‘మెట్రో’కు వ్యతిరేకంగా గళమెత్తిన వ్యాపారులు
హైదరాబాద్: పాత రూట్‌లోనే మెట్రో రైల్ నిర్మిస్తామన్న ఎల్‌అండ్‌టీ ఎండీ గాడ్గిల్ ప్రకటనపై సుల్తాన్‌బజార్ వ్యాపారులు గళమెత్తారు. సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో రైలు రూటు వేస్తే ప్రాణాలకు తెగించైనా అడ్డుకొంటామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో నిర్మాణం చేపట్టవద్దని... అదే జరిగితే పెద్దఎత్తున ఉద్యమిస్తామని సుల్తాన్‌బజార్ వ్యాపార సంఘం పేర్కొంది. గాడ్గిల్ ప్రకటనకు నిరసనగా శుక్రవారం సుల్తాన్‌బజార్‌లో వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ నిర్వహించారు. గాడ్గిల్‌కు వ్యతిరేకంగా నినదించారు.
సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్, ఇతర నాయకులు సురేంద్రమాల్ లూనియా, శశిభూషణ్‌ల ఆధ్వర్యంలో వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బంద్‌కు స్థానిక ఎమ్మెల్యే టి.రాజాసింగ్ లోధా మద్దతు తెలిపారు. సుల్తాన్‌బజార్‌లో మెట్రో నిర్మాణం చేపడితే ఎంతో మంది వ్యాపారులు ఉపాధి కోల్పోతారని, రూట్ మార్చకపోతే పనులను అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు.