Sultan Bazaar
-
రూ.6 లక్షలు మాయం, వాళ్లే తీసుకున్నారంటూ హైడ్రామా
సాక్షి, సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన యజమాని డబ్బును పోలీసులు తీసుకున్నారని చెప్పడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ విషయం మీడియాకు తెలియడంతో ఓ నకిలీ పోలీసు రూ.6 లక్షలు కాజేసినట్లు వైరలైంది. అయితే సుల్తాన్‌బజార్ పోలీసులు మాత్రం ఇది ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నారు. కోదాడకు చెందిన అమర్నాథ్రెడ్డి సొమ్ము రూ.6 లక్షలు పోయినట్లు తప్పుడు సమాచారం పోలీసులకు అందింది. డబ్బు పోయిందని డ్రామానా? రూ.6 లక్షలు తన డ్రైవర్ తండ్రి హన్మంతు ద్వారా కూకట్పల్లి నుంచి కోదాడకు తీసుకువెళ్తున్నారు. హన్మంతుకు డబ్బుపై ఆశ కలగడంతో డబ్బులను కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీల్లో పోలీసులు తీసుకున్నారని చెప్పడంతో అమర్నాథ్రెడ్డి సుల్తాన్‌బజార్ పోలీసులను వాకబు చేశారు. పోలీసులు కోఠి ఆంధ్రాబ్యాంకు చౌరస్తా వద్ద ఎలాంటి డబ్బు పట్టుకోలేదని తేల్చి చెప్పారు. ఈ విషయమై సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతిని వివరణ కోరగా తమకు ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు రాలేదని డబ్బుపై ఆశతోనే హన్మంతు నకిలీ పోలీసులంటూ డ్రామా ఆడుంటారని అభిప్రాయపడ్డారు. -
Black Fungus: కోఠి ఆస్పత్రికి ఒక్కరోజే 284 మంది!
సాక్షి, సుల్తాన్‌బజార్: ‘బ్లాక్ ఫంగస్’ నోడల్ కేంద్రమైన హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి వస్తున్న బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 284 మంది బ్లాక్ ఫంగస్ అనుమానితులు ఆస్పత్రికి రాగా.. అందులో మొత్తం 39 మందిని ఇన్పేషెంట్లుగా అడ్మిట్ చేసుకున్నారు. మిగతావారిలోనూ చాలా మందికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నా.. కొందరు పాజిటివ్ రోగులు కావడం, మరికొందరికి కోవిడ్ వచ్చి తగ్గినా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ లేకపోవడంతో చేర్చుకోలేదని సమాచారం. చాలా తక్కువగా లక్షణాలు ఉన్నవారికి మందులు రాసి పంపించినట్టు తెలిసింది. తాజాగా అడ్మిట్ అయినవారితో కలిపి ప్రస్తుతం ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘బ్లాక్ ఫంగస్’ బాధితుల సంఖ్య 90కి చేరింది. వీరిలో ఏడుగురికి గురువారం శస్త్రచికిత్సలు నిర్వహించారు. బెడ్ల సంఖ్య పెంచుతూ.. ఈఎన్టీ ఆస్పత్రికి వస్తున్న బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. మొదట 50 బెడ్లను కేటాయించగా.. ప్రస్తుతం 200 వరకు బెడ్లను సిద్ధం చేస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా వార్డుల్లో, ఆవరణలో బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలు, రిపోర్టుల కోసం వెనక్కి.. గురువారం ఒక్కసారిగా 284 మంది ‘బ్లాక్ ఫంగస్’ అనుమానితులు ఈఎన్టీ ఆస్పత్రికి రావడంతో ఆవరణ అంతా కిక్కిరిసిపోయింది. వీరిలో కొందరు కోవిడ్ పాజిటివ్ వారు ఉండటం, మరికొందరికి కోవిడ్ తగ్గినా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ లేకపోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిప్పిపంపారు. మరికొందరిని పలు టెస్టుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాలని ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు సూచించినట్టు రోగులు తెలిపారు. ఉస్మానియాకు, ఇతర ల్యాబ్‌లకు టెస్టుల కోసం పరుగెత్తడం, ఇందుకు రోజంతా సమయం పట్టడంతో ఆస్పత్రిలో అడ్మిషన్ ఆలస్యం అవుతోందని రోగుల బంధువులు వాపోయారు. ఉదయం ముందుగా వస్తున్న రోగులకు పరీక్షలు చేస్తున్నామని, పెద్ద సంఖ్యలో వస్తుండటంతో అందరికీ పరీక్షలు చేయలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. దీంతో అడ్మిషన్ల కోసం వచ్చిన రోగులు ఆస్పత్రి ఆవరణలో వేచి ఉండటం కనిపించింది. ఆస్పత్రిని పరిశీలించిన సీఎంవో ఓఎస్డీ బ్లాక్ ఫంగస్ చికిత్సలకు సంబంధించి కోఠి ఈఎన్టీ ఆస్పత్రిని సీఎంవో ఓఎస్డీ గంగాధర్ గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న బెడ్లు, పేషెంట్ల సంఖ్య, చికిత్సలపై ఆరా తీశారు. అంతకుముందు ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారికి చికిత్సలో ఆక్సిజన్ అవసరం ఎక్కువగా ఉండదని ఆయన పేర్కొన్నారు. జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కలకలం సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం కూడా పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండల పరిధిలోని కందగట్లకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు.. కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఆయన కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన 25 ఏళ్ల యువకుడు, రంగాపూర్‌కు చెందిన మరో వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారినపడ్డారు. ఈ ఇద్దరికి కళ్లకు ఇన్ఫెక్షన్ సోకగా.. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో 25 ఏళ్ల యువకుడికి ఒక కన్ను తొలగించినట్టు బాధితుడి బంధువులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం అర్లి(టి)కి చెందిన 46 ఏళ్ల వ్యక్తి బ్లాక్ ఫంగస్‌తో ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
నా కూతురు నాకు కావాలి: విలపించిన తల్లి
సాక్షి, హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆయాలా వచ్చిన ఓ మహిళ ఆరు రోజుల ఆడ శిశువుకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని చెప్పి శిశువుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ శిశువును అపహరించినట్లు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించారు. ఈ విషయం గురించి సుల్తాన్ బజార్ సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. ‘శిశువును అపహరించిన మహిళ తొలుత బీదర్ వైపు వెళ్లినట్లు గుర్తించాము. అనంతరం ఆమె ప్రయాణించిన బస్సు డ్రైవర్, కండక్టర్లను విచారించగా ఆమె బీదర్ కొత్త కమాన్ దగ్గర దిగినట్లు చెప్పారు. అక్కడి నుంచి ఆమె ఆటోలో వెళ్ళి ఉండవచ్చని అనుమానిస్తున్నాము. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని విచారిస్తున్నాము. కాని ఈ మహిళకు పాత కేసుల్లో ఉన్న వారితో ఎలాంటి పోలికలు లేవ’ని తెలిపారు. అంతేకాక శిశువును అపహరించిన మహిళ పాప తల్లితో మాట్లాడినప్పుడు తెలుగులోనే మాట్లాడిందని, కండక్టర్‌తో మాట్లాడినప్పుడు మాత్రం కన్నడలో మాట్లాడిందని సీఐ శివశంకర్ చెప్పారు. శిశువును అపహరించిన మహిళను పట్టుకునేందుకు మొత్తం 11 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఏడు తెలంగాణకు చెందినవి కాగా, మరో నాలుగు బీదర్ పోలీసు బృందాలని తెలిపారు. నా కూతురు నాకు కావాలి: తల్లి విజయ ‘ఆ మహిళ నాతో తెలుగులోనే మాట్లాడింది. టీకా వేయించాలని నా కూతుర్ని తీసుకెళ్లింది. ఇప్పుడు నా కూతురు కనిపించకుండా పోయింది. నా కూతురు నాకు కావాలి, ఎక్కడ ఉన్నా నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి’ అంటూ బాలిక తల్లి విజయ కన్నీరుమున్నీరైంది. -
చారిత్రక కట్టడాలు కనుమరుగు!
♦ సుల్తాన్ బజార్లో మెట్రో పనులకు శ్రీకారం ♦ కాలగర్భంలో కలిసిపోనున్న చారిత్రకకట్టడాలు ♦ వాటిలో ముఖ్యమైనవి సుల్తాన్‌బజార్, బడీచౌడి మార్కెట్ ♦ ఆర్యసమాజ్, హరి మసీద్, జైన్మందిర్లు కూడా... హైదరాబాద్: రాష్ర్టంలోనే ప్రతిష్టాత్మక చారిత్రక సుల్తాన్‌బజార్ మార్కెట్ త్వరలో కనుమరుగుకానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మెట్రోైరెల్ ప్రాజెక్ట్ మార్గం ఈ మార్కెట్ మీదుగానే వెళుతుండడంతో ఈ ప్రాంతంలో వందేళ్లు పైబడిన అరుదైనచారిత్రక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. మెట్రో మార్గంపై స్థానిక వ్యాపారులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా..హెచ్ఎంఆర్ఎల్, జీహెచ్ఎంసీ, ఎల్అండ్టీ సంస్థలు తమదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆస్తుల కూల్చివేతను గణనీయంగా తగ్గించేందుకు ఈ మార్కెట్ ప్రాంతంలో ప్రధాన రహదారి పైనుంచి 65 అడుగుల విస్తీర్ణంలో మాత్రమే ఆస్తులను సేకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. కాగా గత మంగళవారం పుత్లిబౌలి చౌరస్తాలోని ఓ పెట్రోల్‌బంక్ కూల్చివేతతో సుల్తాన్ బజార్లో మెట్రో పనులకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. కాలగర్భంలోకి... సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో మార్గం వెళుతుండడంతో సుల్తాన్‌బజార్, బడీచౌడి ప్రాంతాల్లో సుమారు 60 నిర్మాణాలు నేలమట్టం కానున్నాయి. ఇందులో ప్రధానంగా 100 ఏళ్ల క్రితం నిర్మించిన చారిత్రక ఆర్యసమాజ్ మందిరం, హనుమాన్, గణపతి దేవాలయాలు, హరి మసీద్, సుల్తాన్‌బజార్ ప్రధాన మార్కెట్లో ఉన్న జైన్ మందిర్‌లతో పాటు ఆంధ్రాబ్యాంక్.. ఇతర ఆస్తులు కనుమరుగు కానున్నాయి. ముఖ్యంగా సుల్తాన్‌బజార్ చారిత్రక మార్కె ట్, బడీచౌడి మార్కెట్, ఆర్యసమాజ్, హరి మసీద్, జైన్ మందిర్లు కూల్చివేతకు గురవుతుండడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.కోఠిలో రద్దీ దృష్ట్యా ప్రజల సౌకర్యార్ధం నిర్మించిన సబ్‌వేలు సైతం కనుమరుగయ్యే అవకాశం ఉంది. మెట్రోకు వ్యతిరేకంగా ఉద్యమం... తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్.. మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులతో బహిరంగ సభ నిర్వహించి మెట్రో మార్గాన్ని సుల్తాన్‌బజార్ మీదుగా రానివ్వబోమని వ్యాపారులకు భరోసా ఇచ్చారు. దీంతో మెట్రో అధికారులు ఇటీవలి కాలం వరకు పనులు ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే నాలుగు రోజుల క్రితం అధికారులు పెట్రోల్ బంక్‌ను కూల్చివేయడంతో వ్యాపారుల్లో ఆందోళన మొదలైంది. పరిహారం రెట్టింపు... నాలుగేళ్ల్ల క్రితం సుల్తాన్‌బజార్‌లో మెట్రోకు వ్యతిరేకంగా వ్యాపారులు ఆందోళన చేపట్టిన రోజుల్లో గజానికి రూ.50 వేల చొప్పున చెల్లిస్తామని వ్యాపారులతో మెట్రో అధికారులు సంప్రదింపులు జరిపినా సఫలంకాలేదు. మెట్రో కారిడార్ 1, 2లో పనులు చివరి దశకు వచ్చిన నేపథ్యంలో సుల్తాన్‌బజార్ వ్యాపారులకు రెట్టింపు పరిహారం అంటే.. గజానికి లక్ష ఐదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని కొందరు భవన యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని ముందుకు సాగుతుండడం విశేషం. అయినా కొందరు వ్యాపారులు, హాకర్స్, 54 మంది భవన యజమానులు మెట్రో మార్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. -
సుల్తాన్‌బజార్ బంద్ సక్సెస్
‘మెట్రో’కు వ్యతిరేకంగా గళమెత్తిన వ్యాపారులు హైదరాబాద్: పాత రూట్లోనే మెట్రో రైల్ నిర్మిస్తామన్న ఎల్అండ్టీ ఎండీ గాడ్గిల్ ప్రకటనపై సుల్తాన్‌బజార్ వ్యాపారులు గళమెత్తారు. సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో రైలు రూటు వేస్తే ప్రాణాలకు తెగించైనా అడ్డుకొంటామని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సుల్తాన్‌బజార్ మీదుగా మెట్రో నిర్మాణం చేపట్టవద్దని... అదే జరిగితే పెద్దఎత్తున ఉద్యమిస్తామని సుల్తాన్‌బజార్ వ్యాపార సంఘం పేర్కొంది. గాడ్గిల్ ప్రకటనకు నిరసనగా శుక్రవారం సుల్తాన్‌బజార్‌లో వ్యాపార సంస్థలు మూసివేసి బంద్ నిర్వహించారు. గాడ్గిల్‌కు వ్యతిరేకంగా నినదించారు. సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్, ఇతర నాయకులు సురేంద్రమాల్ లూనియా, శశిభూషణ్ల ఆధ్వర్యంలో వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బంద్‌కు స్థానిక ఎమ్మెల్యే టి.రాజాసింగ్ లోధా మద్దతు తెలిపారు. సుల్తాన్‌బజార్‌లో మెట్రో నిర్మాణం చేపడితే ఎంతో మంది వ్యాపారులు ఉపాధి కోల్పోతారని, రూట్ మార్చకపోతే పనులను అడ్డుకొంటామని ఆయన హెచ్చరించారు. -
పాత మార్గమే!
అసెంబ్లీ ముందు, సుల్తాన్‌బజార్, చార్మినార్ మీదుగానే మెట్రో కారిడార్ సూత్రప్రాయంగా సీఎం అంగీకారం పాత నగరంలో త్వరలో పనులు షురూ నేడు సుల్తాన్‌బజార్ బంద్ సిటీబ్యూరో: మెట్రో అలైన్మెంట్ మార్పుపై ఎట్టకేలకు సందిగ్ధం తొలగింది. గతంలో సిద్ధం చేసిన పాత మార్గం (అలైన్మెంట్) ప్రకారమే పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఎల్ అండ్ టీ వర్గాలకు సూచన ప్రాయంగా తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్1), జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్2), నాగోల్-రహేజా ఐటీ పార్క్ (కారిడార్ 3) మార్గాల్లో మెట్రో పనులకు అవాంతరాలు తొలగినట్లయింది. ఈ విషయమై ప్రభుత్వం నుంచి తమకు లిఖితపూర్వక ఆదేశాలు అందలేదని ఎల్అండ్టీ వర్గాలు స్పష్టం చేశాయి. పాత అలైన్మెంట్ ప్రకారం అసెంబ్లీ ముందు నుంచే మెట్రో మార్గం వెళ్లనుంది. జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో చారిత్రక సుల్తాన్‌బజార్, చార్మినార్‌ల వద్ద నుంచే మెట్రో పట్టాలు పరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో 2017 జూలై నాటికి మూడు మార్గాల్లో మెట్రో పనులు పూర్తి చేస్తామని ఎల్అండ్టీ, హెచ్ఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. తొలివిడతగా 2016 మార్చి నెలలో మియాపూర్-పంజగుట్ట, నాగోలు-సికింద్రాబాద్ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపాయి. మొత్తం 72 కి.మీ. మార్గంలో ఇప్పటివరకు 52 కి.మీ. మేరకు మెట్రో పిల్లర్లకు పునాదులు పూర్తయ్యాయి. మొత్తం 2800 పిల్లర్లకు గాను ఇప్పటి వరకు 2000 పూర్తయ్యాయి. మరో 40 కి.మీ.లలో పట్టాల ఏర్పాటుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్లు ఏర్పాటు చేసినట్టు హెచ్ఎంఆర్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చిక్కుల కారణంగానే... ప్రభుత్వం పాత అలైన్మెంట్ వైపు మొగ్గు చూపడానికి ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక చిక్కులే ప్రధాన కారణమని తెలిసింది. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో అసెంబ్లీ వెనుక వైపు నుంచి మెట్రో మార్గాన్ని మార్చిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఇక జేబీఎస్-ఫలక్‌నుమా రూట్లో సుల్తాన్ బజార్ వైపు కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల వెనక నుంచి తిలక్ పార్క్, బాటా జంక్షన్ మార్గంలో పనులు చేపడితే అనేక భవంతులు నేలమట్టం చేయాల్సి ఉంటుంది. దీంతో భారీగా ఆస్తినష్టం సంభవించనుంది. మరోవైపు పాత నగరంలో అలైన్మెంట్ మార్పుతో 3.2 కి.మీ. మేరకు మెట్రో పిల్లర్లను మూసీ నది మధ్య నుంచి ఏర్పాటు చేయడం సాంకేతికంగా కష్టసాధ్యమని... ఈ మార్గంలో మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తే వాణిజ్య పరంగా తమకు గిట్టుబాటు కాదని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో పాత అలైన్‌మెంట్‌కే సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సరికొత్త సాంకేతికతతో... ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా రహదారికి ఇరువైపులా ఇనుప వారధి ఏర్పాటుతో మెట్రో పనులు చేపట్టేందుకు బ్యాలెన్స్ కాంటీలీవర్ పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు హెచ్ఎంఆర్ ఎమ్డీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. దీంతో వారధిపై మెట్రో పనులు జరుగుతున్న సమయంలోనే కింద నుంచి వాహనాల రాకపోకలకు వీలవుతుందన్నారు. ఈ విధానంలో గోద్రెజ్ వై జంక్షన్ (190 అడుగుల పొడవు), పంజగుట్ట జంక్షన్ (190 అడుగులు), ఖైరతాబాద్ జంక్షన్(190 అడుగులు), మొజంజాహీ మార్కెట్ (190 అడుగులు), పరేడ్‌గ్రౌండ్స్ (180 అడుగులు), ఒలిఫెంటాబ్రిడ్జి(83 మీటర్ల పొడవు), బోయిగూడ (64 మీటర్ల పొడవు)లలో వారధులు నిర్మించి వాటిపై మెట్రో పట్టాలు వేయనున్నట్టు తెలిపారు. నగరంలో 8 రైల్వే క్రాసింగ్‌ల వద్ద ద.మ.రైల్వే పట్టాల పైనుంచి అత్యంత ఎత్తులో మెట్రో పిల్లర్లు, వాటిపై పట్టాలు నిర్మించనున్నారు. ఆత్మహత్యలే శరణ్యం: బడీచౌడి ట్రేడర్స్ జేఏసీ జేబీఎస్-ఫలక్‌నుమా మార్గాన్ని సుల్తాన్‌బజార్, బడిచౌడి నుంచి మినహాయించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని బడిచౌడి ట్రేడర్స్ జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో బడిచౌడిలో వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆనంతరం జేఏసీ కార్యదర్శి సుమన్గుప్తా, సంయుక్త కార్యద ర్శి మనోహార్‌లు మాట్లాడారు. వ్యాపారుల ఉపాధిని కూల్చవద్దని జేఏసీ ఆధ్వర్యంలో 2011 నుంచి ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న సీఎం కేసీఆర్ అప్పట్లో సుల్తాన్‌బజార్‌కు మెట్రో వస్తే తన తలపై నుంచే వెళ్లాలని అన్నారని గుర్తుచేశారు. సుల్తాన్‌బజార్ అంటే బడిచౌడి ఆర్యసమాజ్, హరిమజీద్ లు అంతర్భాగమే అన్నారు. మెట్రో అలైన్‌మెంట్‌ను బడీచౌడి నుంచి కాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు మార్చాలని డిమాండ్ చేశారు. నేడు సుల్తాన్‌బజార్ బంద్ సుల్తాన్‌బజార్: మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను నిరసిస్తూ మంగళవారం బంద్ పాటించాలని సుల్తాన్‌బజార్ ట్రేడర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ హామీ మేరకు సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో రైలు మార్గాన్ని వేయవద్దని కోరారు. -
సుల్తాన్‌బజార్ ఆస్పత్రికి ఉస్మానియా యూనిట్లు
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: నేటి నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో నాలుగు వైద్య విభాగాలు, రోగుల తరలింపు ప్రక్రియ మొదలుకానుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, మెడికల్గ్యాస్ట్రో విభాగాలను సుమారు 400 పడకలున్న సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనంలో ఉన్న 18 యూనిట్లను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి, ప్రసూతి యూనిట్‌ను పేట్లబురుజుకు తరలించనున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం టీజీడీఏ నాయకులు డాక్టర్ రమేశ్, వీరేశం, పుట్ల శ్రీనివాస్ ఇతర అధికారులతో కలసి మంత్రి సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సందర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి వచ్చే యూనిట్లకు వార్డులు అనువుగా ఉన్నాయా, లేవా అనే విషయాలను డీఎంఈ డాక్టర్ రమణి, ఆసుపత్రి సూపరిండెంటెంట్‌లను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ నిపుణుల సలహాల మేరకు 105 సంవత్సరాల ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని పునర్నిర్మించనున్నట్లు చెప్పారు. ఉస్మానియా నుంచి వచ్చే యూనిట్లు ఇవే.. ఉస్మానియా ఆసుపత్రి నుండి సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రికి రానున్న యూనిట్లు జనరల్ మెడిసన్-8, జనరల్ సర్జరీ-8, మెడిక ల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ , సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ యూనిట్లను తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 740 పడకలు సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కొనసాగుతాయని చెప్పారు. ఇవి కేవలం ఏడాదే అక్కడ కొనసాగుతాయని తెలిపారు. ఇతర 5 ఆసుపత్రులలో.. ఉస్మానియా ఆసుపత్రిలో అవుట్‌పేషెంట్(ఓపీ)తోపాటు ఎమర్జెన్సీ విభాగాలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. నాంపల్లి, మలక్‌పేట్, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్ ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్కేర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రికి ఆర్థోపెడిక్ రోగులను వైద్యుల పర్యవేక్షణలో తరలించనున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర వైద్యం అందించేందుకు పటిష్టమైన రవాణా ఏర్పాటు సైతం చేస్తున్నట్లు చెప్పారు. మార్చురీ ఉస్మానియా ఆసుపత్రిలో కొనసాగుతుందని తెలిపారు. -
‘మెట్రో’ మార్పులపై కదలిక
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన హెచ్ఎంఆర్ నివేదికలో ప్రత్యామ్నాయ మార్గాల సూచన! సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు అలైన్మెంట్ మార్పు అంశం కొలిక్కి వస్తోంది. పాత నగరం, సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పులకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల సూచనతోపాటు కొత్త అలైన్మెంట్ వల్ల పెరగనున్న నిర్మాణ వ్యయం, అలైన్మెంట్తో ఆస్తులు కోల్పోయే బాధితులకు కొత్త భూసేకరణ చట్టం కింద చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించిన వివరాలను ఈ నివేదికలో పొందుపరిచినట్లు తెలిసింది. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ వద్ద ఉన్న ఈ ప్రతిపాదనలు త్వరలో సీఎం కేసీఆర్ పరిశీలన కోసం వెళ్లనున్నాయి. అలైన్మెంట్ మార్పు ప్రతిపాదనలపై సీఎం నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ విషయాన్ని మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ- హెచ్ఎంఆర్ఎల్ కన్సార్షియానికి తెలుపుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ లేఖ రాయనుంది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎల్టీ-హెచ్ఎంఆర్ కన్సార్షియం 72 కి.మీల మెట్రో మార్గాన్ని నిర్మించాల్సి ఉండగా.. అలైన్మెంట్ మార్పుల వల్ల అదనంగా 3.2 కి.మీ.ల రైలు మార్గాన్ని నిర్మించాల్సి రానుంది. దీనికి అదనపు వ్యయం రూ.1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు కానుందని ప్రభుత్వానికి హెచ్ఎంఆర్ సూచించినట్లు సమాచారం. కాగా, అలైన్మెంట్ మార్పుల ప్రతిపాదనలను ఇంకా పరిశీలించలేదని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి ‘సాక్షి’కి తెలిపారు. సీఎస్‌ను కలిసిన మెట్రో అధికారులు.. మెట్రో రైలు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో రైలు ఎండీ వీబీ గాడ్గిల్ శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమై ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. భూసేకరణలో జాప్యం వల్ల ప్రాజెక్టు నిర్మాణానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఎల్అండ్టీ ఎండీ... సీఎస్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంలో తదుపరి చర్చల కోసం ఈ నెల 9న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.