పాత మార్గమే!
అసెంబ్లీ ముందు, సుల్తాన్‌బజార్,
చార్మినార్ మీదుగానే మెట్రో కారిడార్
సూత్రప్రాయంగా సీఎం అంగీకారం
పాత నగరంలో త్వరలో పనులు షురూ
నేడు సుల్తాన్‌బజార్ బంద్
సిటీబ్యూరో: మెట్రో అలైన్‌మెంట్ మార్పుపై ఎట్టకేలకు సందిగ్ధం తొలగింది. గతంలో సిద్ధం చేసిన పాత మార్గం (అలైన్‌మెంట్) ప్రకారమే పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఎల్ అండ్ టీ వర్గాలకు సూచన ప్రాయంగా తెలిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్1), జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్2), నాగోల్-రహేజా ఐటీ పార్క్ (కారిడార్ 3) మార్గాల్లో మెట్రో పనులకు అవాంతరాలు తొలగినట్లయింది. ఈ విషయమై ప్రభుత్వం నుంచి తమకు లిఖితపూర్వక ఆదేశాలు అందలేదని ఎల్‌అండ్‌టీ వర్గాలు స్పష్టం చేశాయి. పాత అలైన్‌మెంట్ ప్రకారం అసెంబ్లీ ముందు నుంచే మెట్రో మార్గం వెళ్లనుంది. జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో చారిత్రక సుల్తాన్‌బజార్, చార్మినార్‌ల వద్ద నుంచే మెట్రో పట్టాలు పరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో 2017 జూలై నాటికి మూడు మార్గాల్లో మెట్రో పనులు పూర్తి చేస్తామని ఎల్‌అండ్‌టీ, హెచ్‌ఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. తొలివిడతగా 2016 మార్చి నెలలో మియాపూర్-పంజగుట్ట, నాగోలు-సికింద్రాబాద్ మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని తెలిపాయి. మొత్తం 72 కి.మీ. మార్గంలో ఇప్పటివరకు 52 కి.మీ. మేరకు మెట్రో పిల్లర్లకు పునాదులు పూర్తయ్యాయి. మొత్తం 2800 పిల్లర్లకు గాను ఇప్పటి వరకు 2000 పూర్తయ్యాయి. మరో 40 కి.మీ.లలో పట్టాల ఏర్పాటుకు వీలుగా వయాడక్ట్ సెగ్మెంట్లు ఏర్పాటు చేసినట్టు హెచ్‌ఎంఆర్ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
చిక్కుల కారణంగానే...
ప్రభుత్వం పాత అలైన్‌మెంట్ వైపు మొగ్గు చూపడానికి ఆర్థిక, వాణిజ్య, సాంకేతిక చిక్కులే ప్రధాన కారణమని తెలిసింది. ముఖ్యంగా ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో అసెంబ్లీ వెనుక వైపు నుంచి మెట్రో మార్గాన్ని మార్చిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.400 నుంచి రూ.500 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. ఇక జేబీఎస్-ఫలక్‌నుమా రూట్‌లో సుల్తాన్ బజార్ వైపు కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల వెనక నుంచి తిలక్ పార్క్, బాటా జంక్షన్ మార్గంలో పనులు చేపడితే అనేక భవంతులు నేలమట్టం చేయాల్సి ఉంటుంది. దీంతో భారీగా ఆస్తినష్టం సంభవించనుంది. మరోవైపు పాత నగరంలో అలైన్‌మెంట్ మార్పుతో 3.2 కి.మీ. మేరకు మెట్రో పిల్లర్లను మూసీ నది మధ్య నుంచి ఏర్పాటు చేయడం సాంకేతికంగా కష్టసాధ్యమని... ఈ మార్గంలో మెట్రో ప్రాజెక్టు నిర్మిస్తే వాణిజ్య పరంగా తమకు గిట్టుబాటు కాదని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దీంతో పాత అలైన్‌మెంట్‌కే సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
సరికొత్త సాంకేతికతతో...
ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా రహదారికి ఇరువైపులా ఇనుప వారధి ఏర్పాటుతో మెట్రో పనులు చేపట్టేందుకు బ్యాలెన్స్ కాంటీలీవర్ పరిజ్ఞానం వినియోగిస్తున్నట్లు హెచ్‌ఎంఆర్ ఎమ్‌డీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. దీంతో వారధిపై మెట్రో పనులు జరుగుతున్న సమయంలోనే కింద నుంచి వాహనాల రాకపోకలకు వీలవుతుందన్నారు. ఈ విధానంలో గోద్రెజ్ వై జంక్షన్ (190 అడుగుల పొడవు), పంజగుట్ట జంక్షన్ (190 అడుగులు), ఖైరతాబాద్ జంక్షన్(190 అడుగులు), మొజంజాహీ మార్కెట్ (190 అడుగులు), పరేడ్‌గ్రౌండ్స్ (180 అడుగులు), ఒలిఫెంటాబ్రిడ్జి(83 మీటర్ల పొడవు), బోయిగూడ (64 మీటర్ల పొడవు)లలో వారధులు నిర్మించి వాటిపై మెట్రో పట్టాలు వేయనున్నట్టు తెలిపారు. నగరంలో 8 రైల్వే క్రాసింగ్‌ల వద్ద ద.మ.రైల్వే పట్టాల పైనుంచి అత్యంత ఎత్తులో మెట్రో పిల్లర్లు, వాటిపై పట్టాలు నిర్మించనున్నారు.
ఆత్మహత్యలే శరణ్యం: బడీచౌడి ట్రేడర్స్ జేఏసీ
జేబీఎస్-ఫలక్‌నుమా మార్గాన్ని సుల్తాన్‌బజార్, బడిచౌడి నుంచి మినహాయించకుంటే ఆత్మహత్యలే శరణ్యమని బడిచౌడి ట్రేడర్స్ జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో బడిచౌడిలో వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆనంతరం జేఏసీ కార్యదర్శి సుమన్‌గుప్తా, సంయుక్త కార్యద ర్శి మనోహార్‌లు మాట్లాడారు. వ్యాపారుల ఉపాధిని కూల్చవద్దని జేఏసీ ఆధ్వర్యంలో 2011 నుంచి ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న సీఎం కేసీఆర్ అప్పట్లో సుల్తాన్‌బజార్‌కు మెట్రో వస్తే తన తలపై నుంచే వెళ్లాలని అన్నారని గుర్తుచేశారు. సుల్తాన్‌బజార్ అంటే బడిచౌడి ఆర్యసమాజ్, హరిమజీద్ లు అంతర్భాగమే అన్నారు. మెట్రో అలైన్‌మెంట్‌ను బడీచౌడి నుంచి కాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు మార్చాలని డిమాండ్ చేశారు.
నేడు సుల్తాన్‌బజార్ బంద్
సుల్తాన్‌బజార్: మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదనను నిరసిస్తూ మంగళవారం బంద్ పాటించాలని సుల్తాన్‌బజార్ ట్రేడర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ హామీ మేరకు సుల్తాన్ బజార్ మీదుగా మెట్రో రైలు మార్గాన్ని వేయవద్దని కోరారు.