శిశువును తీసుకుని బీదర్ బస్సెక్కుతున్న మహిళ (సర్కిల్‌లో)
సాక్షి, హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రసూతి ఆస్పత్రిలో ఆయాలా వచ్చిన ఓ మహిళ ఆరు రోజుల ఆడ శిశువుకు వ్యాక్సినేషన్ ఇప్పిస్తానని చెప్పి శిశువుతో ఉడాయించిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా పోలీసులు ఆస్పత్రికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. సుమారు 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ శిశువును అపహరించినట్లు సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించారు.
ఈ విషయం గురించి సుల్తాన్ బజార్ సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. ‘శిశువును అపహరించిన మహిళ తొలుత బీదర్ వైపు వెళ్లినట్లు గుర్తించాము. అనంతరం ఆమె ప్రయాణించిన బస్సు డ్రైవర్, కండక్టర్‌లను విచారించగా ఆమె బీదర్ కొత్త కమాన్ దగ్గర దిగినట్లు చెప్పారు. అక్కడి నుంచి ఆమె ఆటోలో వెళ్ళి ఉండవచ్చని అనుమానిస్తున్నాము. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని విచారిస్తున్నాము. కాని ఈ మహిళకు పాత కేసుల్లో ఉన్న వారితో ఎలాంటి పోలికలు లేవ’ని తెలిపారు.
అంతేకాక శిశువును అపహరించిన మహిళ పాప తల్లితో మాట్లాడినప్పుడు తెలుగులోనే మాట్లాడిందని, కండక్టర్‌తో మాట్లాడినప్పుడు మాత్రం కన్నడలో మాట్లాడిందని సీఐ శివశంకర్ చెప్పారు. శిశువును అపహరించిన మహిళను పట్టుకునేందుకు మొత్తం 11 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ఏడు తెలంగాణకు చెందినవి కాగా, మరో నాలుగు బీదర్ పోలీసు బృందాలని తెలిపారు.
నా కూతురు నాకు కావాలి: తల్లి విజయ
‘ఆ మహిళ నాతో తెలుగులోనే మాట్లాడింది. టీకా వేయించాలని నా కూతుర్ని తీసుకెళ్లింది. ఇప్పుడు నా కూతురు కనిపించకుండా పోయింది. నా కూతురు నాకు కావాలి, ఎక్కడ ఉన్నా నా కూతుర్ని నాకు తెచ్చివ్వండి’ అంటూ బాలిక తల్లి విజయ కన్నీరుమున్నీరైంది.
Comments
Please login to add a commentAdd a comment