పింఛన్ల కోసం ప్రశ్నిస్తే సునీల్‌పై కేసులా?
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు!
40 ఏళ్లలో ఇలాంటి ప్రజాకంటక పాలన చూడలేదు
పలమనేరు: అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని ఎంపీడీవోను కోరిన ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌పై నాన్‌బెయిలబుల్ కేసు పెట్టించడం ఎంతవరకు సమంజసమని వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. పలమనేరులో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ స్వగృహంలో గురువారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ఆయన జోస్యం చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రజాకంటక పాలన చూడలేదని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీ అంటే ఏమాత్రం గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రజాపాలన అంటే కేవలం పోలీసులు, కేసులే అనుకుంటున్నారన్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యే సునీల్ ఎంపీడీవోను ప్రశ్నిస్తే అక్కడ పనిచేసే సిబ్బందితో నాన్‌బెయిల్ కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇలాంటి సంఘటనలతో దళితులపై ఆయన ఎంత చిన్నచూపు చూస్తున్నారో అర్థం అవుతోందన్నారు. తమ ఎమ్మెల్యేపై తప్పుడు కేసుపెట్టినంత మాత్రాన ఇలాంటి తాటాకు చప్పుళ్లకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగుఎక్కువ అన్నట్టు ఓడిపోయే పార్టీ నాయకుడికి లేనిపోనీ తెలివితేటలొచ్చినట్టున్నాయని విమర్శించారు. స్థానిక కో–ఆర్డినేటర్లు సీవీ కుమార్, రాకేష్‌రెడ్డితో పాటు, పట్టణ, మండల కన్వినర్లు‡ మండీ సుధా, బాలాజీ నాయు డు, రాష్ట్ర కార్యదర్శులు మురళీకృష్ణ, మొగసాల కృష్ణమూర్తి, నాయకులు వెంకటేగౌడ, దయానంద్‌గౌడ, చెంగారెడ్డి, రెడ్డెప్ప, ప్రహ్లాద, మోహన్‌రెడ్డి, నాగరాజు, శ్యామ్‌సుందర్‌రాజు, కిరణ్ పాల్గొన్నారు.
ప్రశ్నించినందుకు కేసులు
ఐరాల : అర్హులకు పింఛన్ల పంపిణీలో అవకతవకులపై అధికారులను ప్రశ్నిం చినందుకు ఎమ్మెల్యే సునీల్ కుమార్, మరో ముగ్గురు నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు. అధికార పార్టీకి చెందిన నేతల అండతో కేసులు బనాయించారని మండల ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రజల పక్షాన ఉండే అధికారులకు అండగా ఉంటాం.. సునీల్‌కుమార్
ఐరాల (కొండేపల్లె) : ప్రజల పక్షాన ఉండే అధికారులకు ఎన్ని ఒత్తిళ్లు, వేధింపులు ఎదురైనా వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సునీల్ అన్నారు. ఆయన గురువారం ఐరాల మండలంలోని కొండేపల్లెలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఐరాల మండలానికి 330 ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు అయితే వాటిలో వంద పింఛన్లను ఒకే సామాజిక వర్గానికి మంజూరు చేయడం సబబేనా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. జిల్లా అధికారుల సూచనల మేరకు మండలంలో 80 శాతం అర్హత ఉన్న వారికి పింఛన్ అందించాలని 30 మంది వివరాలు అందజేస్తే వాటిలో కనీసం ఒక్కరికి కూడా మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఈవిషయంపై నిలదీస్తే కొందరు అధికారులు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో తమపై కేసులు బనాయించారని ఆరోపించారు. ఎంపీడీవో, ఉద్యోగుల చేత ఆందోళన చేయించడం తగదని వారికి ఎమ్మెల్యే హితవు పలికారు.