చెరుకు రైతుల దీక్షకు మద్దతు
చెరుకు రైతుల దీక్షకు మద్దతు
Published Mon, Oct 17 2016 12:18 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి
నంద్యాలరూరల్: నంద్యాల షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ మొండి వైఖరికి నిరసనగా రైతులు చేస్తున్న దీక్షలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం నంద్యాలకు వచ్చిన గౌరు నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డితో కలిసి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ చంద్రబాబుతో కుమ్మక్కై చెరుకు రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రూ.9.60కోట్ల రుణమాఫీ చెరుకు రైతులకు దక్కకుండా బ్యాంకు ద్వారా ఫ్యాక్టరీ చైర్మన్ ఖాతాలోకి జమ అవుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఆస్తులను కాపాడి రైతులకు, కార్మికులకు, కూలీలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం యాజమాన్యానికి తొత్తుగా మారి రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతల ప్రోత్సాహంతోనే ఫ్యాక్టరీ చైర్మన్ మధుసూదన్‌గుప్త రైతులకు అన్యాయం చేస్తున్నారని వివర్శించారు. రైతుల ఆందోళనలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని గౌరువెంకటరెడ్డి భరోసా ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వం ఫ్యాక్టరీ చైర్మన్‌ను అరెస్ట్ చేసి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని గౌరువెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే షుగర్ ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ వ్యాపార అనుమతుల రద్దు చేయించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement