సుర్రుమనిపించిన సూరీడు
సుర్రుమనిపించిన సూరీడు
Published Tue, May 16 2017 2:07 AM | Last Updated on Tue, Sep 5 2017 11:13 AM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : భానుడు నిప్పులు చెరిగాడు. ఎండ ప్రచండంతో జిల్లా ప్రజలు విలవిల్లాడారు. సోమవారం జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారం రోజుల క్రితం వరకు జిల్లాలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లబడినా.. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటివరకూ 40–41 డిగ్రీల ఉష్ణోగ్రతలను మాత్రమే చవిచూసిన ప్రజలు ఈ వేసవిలో తొలిసారిగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత
నమోదు కావడంతో తల్లడిల్లారు. వడగాడ్పుల తీవ్రత పెరగడంతో జనం రోడ్లపైకి రాలేకపోయారు. వృద్ధులు, చిన్నారులు వేడికి ఉక్కిరిబిక్కిరయ్యారు.
రాత్రి వేళలోనూ వదలని వేడి
సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఎండతీవ్రత కనిపించింది. అత్యవసర పనులు ఉన్నవారు తప్ప ప్రజలెవరూ మధ్యాహ్నం 11 గంటల తరువాత రోడ్లపైకి రావడానికి సాహసం చేయలేకపోయారు. రాత్రి 10 గంటలకు కూడా వేడి గాలులు వదల్లేదు. ఇళ్లల్లోని గోడలు, ధరించిన వస్త్రాలు వేడెక్కి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇళ్లల్లోని మంచినీళ్లు సైతం కాగిపోయాయి.
నాసా హెచ్చరికలతో ఆందోళన
రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నట్టు నాసా ప్రకటిం చింది. ఆ 8 జిల్లాల్లో పశ్చిమ గోదావరి కూడా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇలానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారంతో అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది. నాలుగు రోజులపాటు ప్రజలు ఎండల్లో తిరగకూడదంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వడదెబ్బ బారిన పడినవారికి చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Advertisement
Advertisement