
నిఘా నీడలో పల్లె
- గుర్రాలగొందిలో అక్రమాలకు చెక్
- గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు
చిన్నకోడూరు: అక్రమాలు, నేరాలు, ప్రమాదాలు జరగకుండా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సాధారణంగా పోలీసులు చేపడతారు. కానీ ఇక్కడ దాతల సహకారంతో స్థానికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సురక్షితంగా ఉండటానికి ఆ పల్లెవాసులు చేసిన ప్రయత్నం ఆదర్శంగా నిలుస్తోంది. చిన్నకోడూరు మండలంలో గుర్రాలగొంది మేజర్ గ్రామ పంచాయతీ. ఈ గ్రామంలో ఎక్కువ శాతం మంది ప్రభుత్వం ఉద్యోగులు, రైతులు ఉన్నారు.
సుమారు 1800 జనాభా ఉంది. స్థానికులు, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో దోపిడీలు, దొంగతనాలు, అక్రమ దందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా అందరూ భద్రంగా ఉండేందుకు శ్రీకారం చుట్టారు. దానికి మంత్రి హరీశ్‌రావు సహకారంతో కరీంనగర్ గ్రానైట్ కంపెనీ ప్రతినిధి రాజేశ్వర్‌రావు ముందుకువచ్చారు.
రూ. 1.30 లక్షలు వెచ్చించి గ్రామ ప్రధాన కూడళ్లలో 6 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో రికారై్డన పుటేజీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హార్డ్ డిస్క్‌లో భద్రంగా ఉంటుంది. గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలను పరిశీలించడానికి ఆపరేటర్‌ను సైతం నియమించారు.
అక్రమాలకు చెక్...
గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో దొంగతనాలు, దోపిడీలు, అక్రమ దందాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరించినా వారిని గుర్తించి పోలీసులకు అప్పగించేందుకు వీలు కలుగుతుంది.
అపరిచిత వ్యక్తులు గ్రామంలో కాలు మోపగానే క్షణాల్లో ఇట్టే గుర్తుపట్టొచ్చు. దోపిడీలు, దొంగతనాలు, అక్రమ దందాలు వంటి వాటికి గ్రామంలో ఫుల్‌స్టాప్ పడినట్టే. సీసీ కెమెరాలతో పోలీసులకు పనిభారం తగ్గుతుంది. దొంగతనాలు జరిగినప్పుడు నేరస్తులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు కీలక ఆధారంగా మారనున్నాయి. కాగా గ్రామంలో ఇటీవల ఓ షాప్‌లో దొంగ తనానికి పాల్పడిన వ్యక్తిని సీసీ పుటేజీ ద్వారా కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
అందరి సహకారంతోనే..
మంత్రి హరీష్‌రావు సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నా. ఈ విషయంలో ప్రజల సహకారం మరువలేనిది. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో అక్రమాలకు, దొంగతనాలకు అడ్డుకట్ట పడింది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో గడిపేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఆంజనేయులు, సర్పంచ్