భూములిచ్చి అడుక్కతినమంటారా..!
-
కన్నేపల్లిలో పంప్‌హౌస్ సర్వేను అడ్డుకున్న రైతులు
కాళేశ్వరం: .మహదేవపూర్ మండలం కన్నేపల్లి గ్రామంలో మేడిగడ్డ కాళేశ్వరం బ్యారేజీకి సంబంధించిన ప్రధానపంప్‌హౌస్ నిర్మాణం కోసం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుధవారం సర్వే చేయగా.. రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు, అధికారులకు స్వల్వ వాగ్వాదం నెలకొంది. ప్రాజెక్టులకు తమ భూములిచ్చి అడుక్కతినమంటారా.. అంటూ అధికారులను నిలదీశారు సర్వేనంబర్ 74లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన రైతుల నుంచి 48ఎకరాల అసైన్డ్ భూమిని భూసేకరణ కింద తీసుకున్నారన్నారు. మళ్లీ అదే సర్వే నంబర్‌లో పంప్‌హౌస్ నిర్మాణం కోసం 76ఎకరాల భూమిని మంగళ, బుధవారాల్లో సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో వారు వెనుదిరిగివెళ్లారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రిటైర్డ్ డెప్యూటీ కలెక్టర్ మనోహర్ కరీంనగర్ నుంచి కన్నేపల్లికి చేరుకున్నారు. భూనిర్వాసిత రైతులతో సమావేశం నిర్వహించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతకుముందు 48ఎకరాల్లో వివరాలు తప్పుల తడకగా సర్వే చేశారని, రీసర్వే చేయాలని రైతులు పట్టుబట్టారు. ఆయన స్పందించి అధికారులతో రీ సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు. తమ కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని రైతులు కోరారు. అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.3లక్షల2వేలు అందిస్తామని మనోహర్ చెప్పగా.. రైతులు ససేమీరా అంటూ వెనుదిరిగారు. తహసీల్దార్ జయంత్, ఇరిగేషన్ అధికారులు ఓంకార్‌సింగ్, ప్రకాశ్, వెంకటరమణ, రిటైర్డ్ తహసీల్దార్ రవీందర్, ఆర్‌ఐ కృష్ణ, సర్వేయర్ వసియోద్దీన్, మెగా ప్రాజెక్టు మేనేజర్ సుభాష్, ఉపసర్పంచి మల్లారెడ్డి, మాజీ సర్పంచి చిన్న మల్లారెడ్డి ఉన్నారు.