కరకట్ట పటిష్టతపై సర్వే
పెదకళ్లేపల్లి (మోపిదేవి):
కృష్ణాకరకట్ట పటిష్టతపై సర్వే చేపట్టినట్లు క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ ఎంపీ రాజు తెలిపారు. మోపిదేవి వార్పు నుంచి పెదకళ్లేపల్లి కృష్ణానది కరకట్ట బలాన్ని పరిశీలించేందుకు గురువారం ఇంజనీరింగ్ అధికారులు మండలంలో పర్యటించారు. ఎస్‌ఈ మాట్లాడుతూ ఇటీవల కృష్ణానదికి వదిలిన 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీటిని తట్టుకునే సామర్థ్యం ఎంతవరకు కరకట్టకు ఉందనే విషయంపై సర్వేచేపట్టినట్లు తెలిపారు. గతంలో 2009లో కృష్ణానదికి అధిక మొత్తంలో వరదనీరు రావడంతో కరకట్ట తెగి గుంటూరు జిల్లాను ముంచెత్తినందున ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో 2009 నాటి వరద పునరావృత్తమైతే చేపట్టాల్సిన చర్యలతో పాటు పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వివరించారు. ఈఈ ఉమామహేశ్వరావు, ఆర్సీ ఏఈ చలపతిరావు, ఎంపీటీసీ సభ్యులు యక్కటి హనుమాన్‌ప్రసాద్ ఉన్నారు.