ప్రగతి లేకుంటే వేటు
- మరుగుదొడ్డి నిర్మాణాలపై కలెక్టర్ హెచ్చరిక
- కార్యక్రమంపై అధికారులు, సిబ్బందితో సమీక్ష
- కృష్ణగిరి మండలంలో సీఆర్‌పీలందరూ తొలగింపు
కర్నూలు(అర్బన్): మరుగుదొడ్డి నిర్మాణాల్లో ప్రగతి చూపని సీఆర్‌పీలపై వేటు తప్పదని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. ఏపీఓ, ఏపీడీ, ఏఈల పనితీరు అసంతృప్తిగా ఉన్నందునా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక సునయన ఆడిటోరియంలో శుక్రవారం బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలను తీర్చిదిద్దుట, పూర్తయిన మరుగుదొడ్ల వివరాలు, పెండింగ్ గురించి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 14వ తేదీన జరిగిన సమీక్షలో నెల గడువు కోరగా అనుమంతించామని, డిసెంబర్ 14 పూర్తయినా లక్ష్యం సాధించలేక పోయారంటూ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 31 నాటికి లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలన్నారు. కృష్ణగిరి మండలంలో మరుగుదొడ్ల నిర్మాణాల్లో పురోగతి బాగాలేని కారణంగా సీఆర్‌పీలందరిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇకపై అక్కడ మరుగుదొడ్డి నిర్మాణ పనులను ఏపీడీ, ఏపీఓలు చేపడతారని, వారితోనే సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఏపీడీ, ఏపీఓ ఒక్కో గ్రామంలో కూర్చొని చిత్తశుద్ధితో పనులు చేయించగలిగితే త్వరతిగతిన పనులు పూర్తవుతాయన్నారు. పనుల పరిశీలనకు ఇండిపెండెంట్ టీములను ఏర్పాటు చేశామని, వారి నివేదికల ఆధారంగా సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. తక్కువ ప్రగతి ఉన్న ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ పనితీరును మెరుగుపరచుకోవాలన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందని చెప్పిన కలెక్టర్.. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికలను తమకు అందించాలని ఆదేశించారు. పూర్తయిన మరుగుదొడ్ల వివరాలను ఏరోజుకారోజు ఆప్‌డేట్ చేయాలన్నారు. సిబ్బంది పనితీరుకు సంబంధించి ఏ,బీ,సీ,డీ కేటగిరీలుగా విభజించి విడివిడిగా క్యాడర్ వారీగా నివేదికలను సిద్ధం చేసి కార్యాలయ నోట్‌ను తమకు అందించాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ డా. సీహెచ్ పుల్లారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ హరిబాబు పాల్గొన్నారు.