దీపక్‌పై వేటు పడేనా? | suspension on deepak reddy ? | Sakshi
Sakshi News home page

దీపక్‌పై వేటు పడేనా?

Published Thu, Jun 8 2017 11:17 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

దీపక్‌పై వేటు పడేనా? - Sakshi

దీపక్‌పై వేటు పడేనా?

– సీబీఐ దాడుల నేపథ్యంలో ఎమ్మెల్సీ వాకాటిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు
– అరెస్టయిన దీపక్‌రెడ్డిపై కూడా చంద్రబాబు వేటు వేస్తారా అని సర్వత్రా చర్చ
– దీపక్‌రెడ్డి చరిత్ర ఆది నుంచీ నేరపూరితమే
– జేసీ బ్రదర్స్‌ అండతో కబ్జాలు, దందాలు, సెటిల్‌మెంట్లు చేసినట్లు ఆరోపణలు

 
(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
దీపక్‌రెడ్డి ఐదేళ్ల కిందట వరకూ ‘అనంత’కు పరిచయం లేని పేరు. 2012 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రాయదుర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఒక్కసారిగా అందరి నోళ్లలో నానారు. గెలిచి కాదు..ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల చిట్టాతోనే! రాష్ట్రంలో.. బహుశా దేశంలోనే ఏ అసెంబ్లీ అభ్యర్థీ చూపించిన విధంగా తనకు రూ.6,781కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొని ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లా నుంచి కనుమరుగయ్యారు. తాజాగా తిరిగి వార్తల్లోకి వచ్చారు. భూకబ్జా కేసుల్లో హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేయడంతో  ఆయనపై ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సీబీఐ దాడుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై ఇటీవల సస్పెన్షన్‌ వేటు వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు భూకబ్జా లాంటి భారీ అక్రమాలతో ఏకంగా అరెస్టయిన ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డిపైన సస్పెన్షన్‌ వేటు వేస్తారా? వేయరా? అనే చర్చ విపక్షంతో పాటు అధికార పక్షంలోనూ నడుస్తోంది.

దీపక్‌రెడ్డి చరిత్ర నేరపూరితమే!
    దీపక్‌రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయాన అల్లుడు. ఈయన నెల్లూరు జిల్లాకు చెందినవారు. అయితే.. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. 2012 ఉప ఎన్నికలకు ముందు డీ.హీరేహాళ్‌లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ ఉప ఎన్నికల్లో రాయదుర్గం నుంచి పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలను పేర్కొంటూ వార్షిక ఆదాయం రూ.3.27లక్షలుగా, తన భార్య ఆదాయం రూ.1.98 లక్షలుగా పేర్కొన్నారు. తన పేరుతో రూ.4.59 కోట్ల చరాస్తులు, రూ.5.86 కోట్ల స్థిరాస్తులు , భార్య పేరుతో రూ.1.76 కోట్ల చరాస్తులు, రూ.16.86 కోట్ల స్థిరాస్తులు, ఇతర వాటాలు ఉన్నట్లు చూపారు. ఇవి కాకుండా మరో రూ.6,781.05కోట్ల ఆస్తులను చూపించారు. ఇవి వివాదాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి రూ.3.27లక్షల వార్షికాదాయం ఉండే వ్యక్తి రూ.6,781 కోట్ల ఆస్తులను ఎలా సంపాదించారు? ఇది సాధ్యమేనా అని అప్పట్లోనే సర్వత్రా చర్చ నడిచింది. దీపక్‌రెడ్డి ఇంత భారీస్థాయిలో ఆస్తులు సంపాదించేందుకు కారణం భూకబ్జాలు, సెటిల్‌మెంట్లే అని అప్పట్లోనే అంతా భావించారు. ఆదాయ పన్ను శాఖకు దీపక్‌రెడ్డి రూ.5 లక్షలు మాత్రమే రిటర్న్స్‌  చూపించడంతో ఈ  ఆస్తులు మొత్తం అవినీతి సంపాదనగా వచ్చి ఉండొచ్చని, ఈయన చరిత్ర కూడా నేరపూరితమేనని భావించారు.

హైదరాబాద్‌లోనే రూ.15 వేల కోట్ల ఆస్తులు?
    దీపక్‌రెడ్డికి హైదరాబాద్‌లోనే రూ.15 వేల కోట్లకుపైగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. నకిలీ పత్రాలు సృష్టించి చాలాచోట్ల ప్రభుత్వ భూములను కాజేసినట్లు ఆరోపణలున్నాయి.  శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడెంలో ఖరీదైన మూడెకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లో దీపక్‌రెడ్డి పేరుతో అత్యంత విలువైన 8,084, అతని భార్య పేరుతో 13,224 చదరపు అడుగుల స్థలాలు ఉన్నట్లు సమాచారం. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో దీపక్‌రెడ్డికి 840 గజాల స్థలం, బెంగళూరులో అతని భార్యకు అత్యంత విలువైన 2,400గజాల స్థలం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోనూ  భార్య పేరుతో రూ. 7 కోట్లకుపైగా విలువ చేసే 16వేల చదరపు అడుగుల వాణిజ్యస్థలం ఉన్నట్లు తెలుస్తోంది.

పలు కేసుల నమోదు
        దీపక్‌రెడ్డిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. బెదిరింపులు, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ సెక‌్షన్‌ 506 కింద రెండు కేసులు, ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సెక‌్షన్‌447 కింద కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. కొందరిపై దాడి చేశారని సెక‌్షన్‌ 341 కింద ఓ కేసు, మారణాయుధాలు కలిగి ఉన్నాడని సెక‌్షన్‌ 148 కింద మరో కేసు నమోదైనట్లు సమాచారం. ఇవి కాకుండా భూకబ్జాలకు సంబంధించి హైదరాబాద్‌లో 6 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు మంగళవారం దీపక్‌ను అరెస్టు చేశారు. గతంలోనూ మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో బెదిరింపుల కేసు, సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ను బెదిరించిన కేసులు నమోదయ్యాయి.

జేసీ బ్రదర్స్‌ అండతోనే దందాలు!
            దీపక్‌రెడ్డి చేసిన దందాల వెనుక జేసీ బ్రదర్స్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. 2004–2009 మధ్య కాలంలో జేసీ దివాకర్‌రెడ్డి మంత్రిగా ఉండటం, జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటంతో హైదరాబాద్‌లో సెటిల్‌మెంట్లు, కబ్జాల అంశాల్లో జేసీ బ్రదర్స్‌ జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడేవారని తెలుస్తోంది. వీరి అండతోనే దీపక్‌ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు వినికడి. హైదరాబాద్‌లోని సెటిల్‌మెంట్లలో జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి కూడా దీపక్‌రెడ్డికి సహకారం అందినట్లు తెలుస్తోంది.

బాబు..వేటు వేస్తారా?
వాకాటి నారాయణరెడ్డిపై సస్పెన్షన్‌ వేటు వేయడంతో ఇప్పుడు టీడీపీతో పాటు విపక్షాల దృష్టి దీపక్‌రెడ్డిపై పడింది.  చంద్రబాబు నిజంగా అవినీతికి తావు ఇవ్వని వ్యక్తిగా చెప్పుకునేందుకే వాకాటిపై వేటు వేసి ఉంటే, ఇప్పుడు ఏకంగా అరెస్టయిన దీపక్‌రెడ్డిని కూడా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని విపక్ష సభ్యులతో పాటు కొందరు స్వపక్షసభ్యులు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. జేసీ బ్రదర్స్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాల వలలో చంద్రబాబు చిక్కుకుని ఉన్నారని, దీపక్‌రెడ్డిపై వేటు వేసే ధైర్యం చేయలేరని కూడా పలువురు చర్చించుకుంటున్నారు. దీపక్‌రెడ్డి గత చరిత్ర మొత్తం నేరపూరితమని తెలిసికూడా చంద్రబాబు ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే సీఎం వైఖరి స్పష్టమైందని విపక్షాలు అంటున్నారు. ఈక్రమంలో చంద్రబాబు ఎలాంటి చర్యకు ఉపక్రమిస్తారో వేచిచూడాలి!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement