కొబ్బరి మొవ్వ కోస్తూ కుప్పకూలి..
Published Sun, Sep 25 2016 1:48 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
దొమ్మేరు (కొవ్వూరు రూరల్) : దొమ్మేరు పంచాయతీ కార్యాలయ సమీపంలో ఓ వ్యక్తి కొబ్బరి చెట్ల మొవ్వ కోస్తూ కుప్పకూలి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వేములూరు గ్రామానికి చెందిన సోము రాఘవులు (48) కొబ్బరి పువ్వులు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో దొమ్మేరు పంచాయతీ స్థలంలో తొలగించిన కొబ్బరి చెట్ల మొవ్వ సేకరించేందుకు వచ్చాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకున్న రాఘవులు చెట్ల కొబ్బరి మొవ్వ నుంచి పువ్వు సేకరిస్తున్నాడు. రెండు మొవ్వల నుంచి పువ్వును తీసి మూడో చెట్టు వద్దకు చేరుకోగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకుని రాఘవులను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీ సభ్యుడు ముదునూరి నాగరాజు పోలీసులకు సమాచారమిచ్చి మృతుడి వివరాలను సేకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ ఎస్సై గం గాభవాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Advertisement
Advertisement