బెల్టుషాపులో వ్యక్తి అనుమానాస్పద మృతి
బెల్టుషాపులో వ్యక్తి అనుమానాస్పద మృతి
Published Sat, Oct 1 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
పెరవలి : బెల్టుషాపు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పెరవలిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పెరవలి జాతీయ రహదారి పక్కన ఉన్న మద్యం దుకాణానికి గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు పెరవలికి చెందిన మానేపల్లిచంద్రశేఖర్(45) వచ్చాడు. మద్యం కొని తాగి అక్కడే ఉన్న బల్లపై పడుకున్నాడు. కొద్దిసేపు అటుఇటు దొర్లి, కిందపడ్డాడు. అయినా దుకాణ సిబ్బంది పట్టించుకోలేదు. నిద్రపోయాడనుకుని సిబ్బంది వెళ్లిపోయారు. మళ్లీ ఉదయం వచ్చి చూసేసరికి అక్కడే బల్ల వద్ద చంద్రశేఖర్ పడి ఉండడంతో అనుమానం వచ్చిన వారు అతడిని లేపగా లేవలేదు. దీంతో చనిపోయాడని నిర్ధారించుకుని పోలీసులకు, బంధువులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న బంధువులు మృతదేహాన్ని చూసి కొట్టి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కొద్దిసేపు బెల్టుషాపు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు తమకేమీ సంబంధం లేదని, మద్యం ఇవ్వబోమని చెప్పినా.. వినలేదని, తప్పక ఇచ్చామని చెప్పారు. పోలీసులు ఇరువర్గాల వాదనలు విన్నారు. దీంతో షాపు వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బెల్టుషాపు నిర్వాహకులు, మృతుడి బంధువులు గ్రామ పెద్దల వద్దకు వెళ్లి ఓ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. బెల్టుషాపునకు అనుమతి లేకున్నా.. యథేచ్ఛగా నిర్వహించడం, అర్ధరాత్రి మద్యం అమ్మకూడదని నిబంధన ఉన్నా.. పాటించకపోవడం నేరమని పెరవలి ఎస్సై పి.నాగరాజు చెప్పారు. చంద్రశేఖర్ ఎలా చనిపోయాడనేది పోస్టుమార్టం నివేదికలో తేలుతుందని వివరించారు. బెల్టుషాపుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బెల్టుషాపులను నియంత్రించాలి : డయల్ యువర్ ఎస్పీలో పలువురి వినతి
ఏలూరు అర్బన్ : జిల్లాలో బెల్టుషాపులను నియంత్రించాలని పలువురు ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను కోరారు. శుక్రవారం డయల్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన జిల్లా వాసులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి ప్రజలు ఫోన్ చేసి బెల్టుషాపుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని నియంత్రించాలని కోరారు. దీనికి స్పందించిన ఎస్పీ ఎక్సైజ్ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆ షాపులను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఇంకొందరు గణపతి lనిమజ్జనాలకు ఏర్పాట్లు బాగా చేశారని ఎస్పీని అభినందించారు. ఏలూరు నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి స్థానిక ఫత్తేబాదలో రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రి నిలువ వల్ల రాకపోకలకు ఇబ్బందులు çకలుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులపై జంగారెడ్డిగూడెం నుంచి మరొకరు ఫిర్యాదు చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు కావడం లేదని గణపవరం వాసి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 25 మంది ఫోన్ చేసి వారి సమస్యలు విన్నవించారు.
Advertisement