తైక్వాండో పోటీలు ప్రారంభం
అనంతపురం న్యూసిటీ : స్థానిక ఇండోర్ స్టేడియంలో తైక్వాండో జిల్లా స్థాయి పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు క్యాడెట్ విభాగంలో పోటీలు జరిగాయి. క్యాడెట్‌లో సీ.వనిత, పీ.హర్షిత, వీ.మైత్రేయి, పీ. రిచిత, ఎం.నాగసాయిహాసిని, సీ. శ్రీ వైష్ణవి, డీ ప్రశస్థ బంగారు పతకాలు సాధించారు.
కఠోర సాధనతోనే గుర్తింపు
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి క్రీడాకారులకు పలు సూచనలు సలహాలను అందించారు. క్రీడాకారులకు కఠోర సాధనతోనే గుర్తింపు వస్తుందన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తైక్వాండో క్రీడకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. మున్ముందు మరిన్ని పోటీలకు ‘అనంత’ వేదికగా నిలుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రియేటర్ కృష్ణ, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు కొర్రపాడు హుస్సేన్‌పీరా, తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు.