విజయం కోసం పోటాపోటీ..
తణుకు అర్బన్ : జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 62వ అంతర జిల్లాల క్రీడా పోటీలు తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూలులో శనివారం ప్రారంభమయ్యాయి. డీవైఈవో జంగం స్వామిరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు క్రీడల ద్వారా కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ఈ పోటీలకు 13 జిల్లాలకు చెందిన క్రీడాకారులు హాజరయ్యారు. తొలిరోజు అండర్–14 బాస్కెట్బాల్, అండర్–17 టేబుల్ టెన్నిస్ విభాగాల్లో బాలురు, బాలికల మ్యాచ్లు ఉత్కంఠ భరితంగా సాగాయి. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, కౌన్సిలర్లు మల్లిన రాధాకృష్ణ, పరిమి వెంకన్నబాబు, జెడ్పీటీసీ ఆత్మకూరి బులి దొరరాజు, పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ మునుకుట్ల రామారావు, జాతీయ బాస్కెట్ బాల్ క్రీడాకారులు నల్లజర్ల వెంకన్న, ఎంఈవో ఎస్.శ్రీనివాసరావు, రాష్ట్ర క్రీడాధికారి పేరం రవీంద్రనాథ్, ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.శ్రీనివాస్, హెచ్ఎం నారగాని రమేష్, ప్రాంతీయ క్రీడాధికారి పీఎస్ సుధాకర్ పాల్గొన్నారు.
లీగ్ విజేతలు వీరే...
తొలిరోజు బాస్కెట్ బాల్ అండర్ 14 బాలుర విభాగంలో శ్రీకాకుళం జట్టుపై 22–1 తేడాతో విశాఖపట్నం జట్టు, గుంటూరుపై 25–13 తేడాతో అనంతపురం, విజయనగరంపై 26–3 తేడాతో కృష్ణా జిల్లా జట్లు గెలుపొందాయి. బాలికల విభాగంలో కర్నూలుపై 11–6 తేడాతో పశ్చిమ గోదావరి, విశాఖపై 18–4 తేడాతో తూర్పుగోదావరి గెలిచినట్లు తెలిపారు.
టేబుల్ టెన్నిస్ విభాగంలో..
టేబుల్ టెన్నిస్ అండర్–17 బాలికల విభాగంలో కృష్ణా, అనంతరపురం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా జట్లు వరుసగా విజయం సాధించాయి. బాలుర విభాగంలో అనంతపురం, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు గోదావరి జట్లు విజయం సాధించినట్టు నిర్వాహకులు తెలిపారు.