పన్నులు తక్కువ వసూళ్లు చేస్తే చర్యలు
పన్నులు తక్కువ వసూళ్లు చేస్తే చర్యలు
Published Fri, Oct 14 2016 6:16 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (మెట్రో): జిల్లాలో 15–16 సంవత్సరానికి సంబంధించి వచ్చే వారం రోజుల్లో 90శాతం తక్కువ పన్నులు వసూలు చేసే ఇఒ పిఆర్‌డిలు, పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ పన్నులు, డంపింగ్ యార్డుల నిర్మాణం, చెత్త సేకరణ, బయోమెట్రిక్ హాజరు అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నుల వసూళ్లపై ప్రతి వారం సమీక్షిస్తున్నా కొంత మంది అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదనీ, సమావేశానికి వచ్చి ఏదోలా ఆ వారం గడపడానికి కుంఠిసాకులు చెప్పడం పరిపాటిగా మారిందని అసహనం వ్యక్తం చేశారు. ఛాగల్లు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి మండలాల్లో ఇంటి పన్నులతోపాటు కుళాయి పన్నులు కూడా సరిగా వసూలు చేయడం లేదన్నారు. సిబ్బంది స్థానికంగా నివాసం ఉండాలని లేకుంటే ఉద్యోగాలు వదిలి వెళ్లాలన్నారు. పల్లెల్లో కొందరు ప్రజాప్రతినిధులు కుళాయి పన్నులు కట్టబోమని చెబుతున్నారని పలువురు ఇఒపిఆర్‌డిలు సమావేశంలో ప్రస్తావించగా నెలకు కుళాయికి 50 రూపాయలు పన్ను కట్టలేని స్థితిలో పశ్చిమ ప్రజలు లేరనీ, తొలి నుండి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వల్ల కొన్ని చోట్ల ప్రతిఘటన పరిస్థితులు ఉండవచ్చని అక్కడ కూడా వాస్తవ పరిస్థితిని వివరిస్తే నూరు శాతం పన్నులు వసూలు అవుతాయని కలెక్టర్ చెప్పారు. పంచాయతీలకు సంబంధించిన తీర్మానాలు, జమాఖర్చులు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారులు రాజ్యలక్ష్మి, శ్రీరాములు, అమ్మాజీ, ఇఒపిఆర్‌డిలు, ఎంపిడిఒ ప్రకాశరావు పాల్గొన్నారు.
చెత్త సేకరణకు రిక్షాలు
జిల్లాలో ప్రతి 200 ఇళ్లనూ ఒక బ్లాక్‌గా గుర్తించి ఇంటింటా చెత్తసేకరణకు ఒక రిక్షాను కేటాయిస్తామని ప్రజలంతా ఇళ్లల్లోని చెత్త సేకరణ సిబ్బందికిచ్చి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం అత్తిలి ఇఒపిఆర్‌డి వీరాస్వామినాయుడు మండలంలో ఇంటింటా చెత్త సేకరణకు గూగుల్ రూట్‌ప్లాన్‌ను కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ప్రతి పల్లె పరిశుభ్ర వాతావరణంలో ఉంచేందుకు ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని గ్రామపంచాయతీలో ప్రతి 200 ఇళ్లకు ఒక చెత్త రెక్షా ఏర్పాటు చేసుకోవాలని ఆ గ్రామంలో మొత్తం ఇళ్లను బట్టి ఎన్ని రిక్షాలు అవసరమవుతాయో, ఎంత మంది చెత్త సేకరణ సిబ్బంది కావాలో అనేది ప్రణాళిక సిద్ధం చేసుకుని రానున్న సమావేశాన్ని హాజరుకావాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలలో గాంధీజీ కలలుగన్న పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ఆచరణలో అమలు చేసేందుకు ఇంటింటా చెత్త సేకరణ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ చెప్పారు.
Advertisement