కొండెక్కిన టమాటా
♦ నాడు నేలపాలు.. నేడు నింగిలోకి ధరలు
♦ అప్పుడు కిలో రూ. 5, ప్రస్తుతం రూ. 30 నుంచి రూ. 80
♦ నెలలో సీన్ రివర్స్.!
సదాశివపేట రూరల్ : ఒక నెల రోజుల తేడాతో ధరలో సీన్ రివర్స్ అయింది. రైతుల మాటకు విలువ లేకుండా పోతోంది. టమాటాను అమ్ముకోవడానికి రైతులే ధర నిర్ణయించే హక్కు లేకుండా పోయింది. దీంతో ఎంతకుపడితే అంతకు టమాటాను మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. గత నెల టమాటా డబ్బా ధర రూ. 50 నుంచి రూ. 60 ఉంటే, ప్రస్తుతం అదే బాక్స్ ధర రూ. 500 నుంచి రూ. 550 వరకు ఉంది. సరిగ్గా నెల రోజుల క్రితం సదాశివపేటలో వారాంతపు సంతలో కిలో రూ. 5కు అమ్మినా కొనేవారు లేకపోవడంతో కుప్పలుతెప్పలుగా రోడ్లపై పారబోశారు.
ప్రస్తుతం మార్కెట్‌లో టమాటా ధరను చూసి నోట మాట రావడం లేదు. బుధవారం సదాశివపేటలో వారాంతపు సంతలో ఏకంగా కిలో రూ. 30కు చేరింది. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు కూరగాయాలు సాగుచేయడానికి సాహసించడం లేదు. ముందస్తు ఆలోచనతో సాగుచేసిన రైతులు మాత్రమే టమాటాను పండిస్తున్నారు. చాలా మంది రైతులు పంటను కాపాడుకోలేక బోర్లలో నీరు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రారంభంలో టమాటాను పారబోసిన రైతులు ఇప్పుడు నీరు లేక పంట ఎండిపోతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సంతలో కూరగాయల ధరలు మాత్రం పేదలకు చుక్కలు చూపిస్తున్నాయి.
ప్రతీ రకం కూరగాయల ధర రూ. 30 నుంచి రూ. 80 ఉంటే వినియోగదారులు ఏమీ కొనలేక, తినలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం ధరలను తగ్గించడంలో విఫలమవుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మార్కెట్‌లో పెరుగుతున్న కూరగాయల ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
దళారులదే హవా...
మార్కెట్‌లో దళారులదే హవా నడుస్తోంది. వారిని ప్రశ్నించే వారు లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. తాము నష్టాల్లో కూరుకుపోతున్నా పట్టించుకొనే వారు కరువయ్యారని రైతులు చెబుతున్నారు.