Sean Rivers
-
కొండెక్కిన టమాటా
♦ నాడు నేలపాలు.. నేడు నింగిలోకి ధరలు ♦ అప్పుడు కిలో రూ. 5, ప్రస్తుతం రూ. 30 నుంచి రూ. 80 ♦ నెలలో సీన్ రివర్స్.! సదాశివపేట రూరల్ : ఒక నెల రోజుల తేడాతో ధరలో సీన్ రివర్స్ అయింది. రైతుల మాటకు విలువ లేకుండా పోతోంది. టమాటాను అమ్ముకోవడానికి రైతులే ధర నిర్ణయించే హక్కు లేకుండా పోయింది. దీంతో ఎంతకుపడితే అంతకు టమాటాను మార్కెట్లో అమ్మేస్తున్నారు. గత నెల టమాటా డబ్బా ధర రూ. 50 నుంచి రూ. 60 ఉంటే, ప్రస్తుతం అదే బాక్స్ ధర రూ. 500 నుంచి రూ. 550 వరకు ఉంది. సరిగ్గా నెల రోజుల క్రితం సదాశివపేటలో వారాంతపు సంతలో కిలో రూ. 5కు అమ్మినా కొనేవారు లేకపోవడంతో కుప్పలుతెప్పలుగా రోడ్లపై పారబోశారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరను చూసి నోట మాట రావడం లేదు. బుధవారం సదాశివపేటలో వారాంతపు సంతలో ఏకంగా కిలో రూ. 30కు చేరింది. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు కూరగాయాలు సాగుచేయడానికి సాహసించడం లేదు. ముందస్తు ఆలోచనతో సాగుచేసిన రైతులు మాత్రమే టమాటాను పండిస్తున్నారు. చాలా మంది రైతులు పంటను కాపాడుకోలేక బోర్లలో నీరు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రారంభంలో టమాటాను పారబోసిన రైతులు ఇప్పుడు నీరు లేక పంట ఎండిపోతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సంతలో కూరగాయల ధరలు మాత్రం పేదలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతీ రకం కూరగాయల ధర రూ. 30 నుంచి రూ. 80 ఉంటే వినియోగదారులు ఏమీ కొనలేక, తినలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం ధరలను తగ్గించడంలో విఫలమవుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మార్కెట్లో పెరుగుతున్న కూరగాయల ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. దళారులదే హవా... మార్కెట్లో దళారులదే హవా నడుస్తోంది. వారిని ప్రశ్నించే వారు లేకపోవడంతో ధరలు అమాంతం పెరుగుతున్నాయి. తాము నష్టాల్లో కూరుకుపోతున్నా పట్టించుకొనే వారు కరువయ్యారని రైతులు చెబుతున్నారు. -
‘ఎర్ర’ దొంగల వేటలో..సీన్ రివర్స్
‘ఆపరేషన్ రెడ్’ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న స్మగ్లర్ల బంధుగణం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులపై కిడ్నాప్ కేసులు పెడుతున్న వైనం ‘ఎర్ర’ దొంగల వేటలో స్మగ్లర్ల బంధుగణం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్ణాటక, తమిళనాడులో స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకోగానే సమీపంలోని పోలీసుస్టేషన్లో బంధుగణం తమ మనిషి అదృశ్యమైనట్లు కేసు పెడుతోంది. ఆ వెంటనే చిత్తూరు జిల్లా పోలీసులు తమ మనిషిని కిడ్నాప్ చేశారంటూ మరో కేసు పెడుతోంది. వరుసగా కేసులు చుట్టుముట్టుతుండడంతో పోలీసులు బెంబేలెత్తుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: చిత్తూరు, కర్నూలు, వైఎస్ఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘ఆపరేషన్ రెడ్’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసి.. పీడీ యాక్ట్‌ను ప్రయోగించి కటకటాల వెనుకకు పంపిస్తున్నారు. తొలుత ఎదురులేకుండా ఆపరేషన్ రెడ్ కొనసాగినా ఇప్పుడు పోలీసులు వెనుకంజ వేస్తున్నా రు. తమిళనాడు, కర్ణాటక పోలీసులు సహకరిం చకపోవడం ఒక కారణమైతే.. స్మగ్లర్ల అనుచరు ల దాడులు, బంధువులు పెట్టే కేసులు మరొక కారణం. దేశంలో పేరుమోసిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ రియాజ్‌ది కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలోని కటికినహళ్లి. ఆ గ్రామంలో రియాజ్ బంధుగణంలో 21 మంది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లుగా గుర్తింపు పొందారు. ఇందులో రియాజ్తోపాటూ మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రియాజ్‌ను అదుపులోకి తీసుకునేందుకు జిల్లా పోలీసులు కటికినహళ్లికి వెళ్లినప్పుడు.. ఆ గ్రామంలో స్మగ్లర్ల అనుచరులు వీరిపై దాడి చేశారు. ఆ దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడికి సమీపంలోని హొస్కోట పోలీసుస్టేషన్‌కు మన జిల్లా పోలీసులు సమాచారం అందించినా స్పందన కరువైంది. చివరకు ఎలాగోలా రియాజ్‌ను అరెస్టు చేసి.. పీడీ యాక్ట్‌ను ప్రయోగించి కటాకటాల వెనుకకు పంపడంలో పోలీసులు సఫలీకృతులయ్యారు. కానీ.. ఇప్పుడు కటికినహళ్లిలో మిగిలిన 16 మందిని అరెస్టు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. నాలుగు రోజుల కిత్రం చిత్తూరు నుంచి ఓ ప్రత్యేక పోలీసు బృందం మారువేషాల్లో కటికినహళ్లికి వెళ్లింది. రియాజ్ అనుచరుడైన నౌషద్ అనే అంతర్జాతీయ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని, చిత్తూరుకు తరలించింది. ఇది పసిగట్టిన నౌషద్ బంధుగణం.. హొస్కోట పోలీసుస్టేషన్‌కు వెళ్లి తమ మనిషి కన్పించడం లేదని ఫిర్యాదు చేసింది. హొస్కోట పోలీసుస్టేషన్లో నౌషద్‌ను చిత్తూరు పోలీసులు కిడ్నాప్ చేసినట్లు స్మగ్లర్ల అనుచరులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు పోలీసులపై హొస్కోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో కర్ణాటక, తమిళనాడలోని పలు స్టేషన్లలో మన జిల్లా పోలీసులపై కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. కర్ణాటక, తమిళనాడు పోలీసులు సహకరించాల్సింది పోయి కేసులు బనాయిస్తుండటం‘ఆపరేషన్ రెడ్’కు ప్రతిబంధకంగా మారుతోందని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
టెంఢర్!
తానొకటి తలిస్తే.. ఇంకేదో అయ్యిందన్నుట్లు తయారైంది ఆ కాంట్రాక్టర్ పరిస్థితి. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేయాలనుకుంటే.. సొంత జేబుకే చిల్లుపడే ప్రమాదం ఏర్పడటంతో బిక్కుమొహం వేశారు. సీన్ రివర్స్ కావడంతో తోక ముడిచారు. తక్కువ రేట్లు కోట్ చేసి పెద్ద మొత్తంలో పనులు దక్కించుకున్నారు. పనులు పర్యవేక్షించే వారంతా తమవారే కావడంతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు సాగించి.. పెద మొత్తంలో వెనకేసుకోవచ్చని ఆశపడ్డారు. కానీ ఎన్నికల కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయి. అసలుకే మోసం వచ్చేలా ఉండటంతో పత్తా లేకుండాపోయారు. రాజాం: రాజాం నగర పంచాయతీ పరిధిలో చేపట్టిన రూ. 1.31 కోట్లతో వివిధ పనుల్లో సింహభాగం చేజిక్కించుకున్న కాంట్రాక్టర్ పత్తా లేకుండా పోయారు. దీంతో అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈయన పనులు చేపట్టకపోవడం వెనక పెద్ద కథే ఉన్నట్లు తెలిసింది. ఫిబ్రవరి నెలలో ఈ పనులు చేపట్టేందుకు ఈ ప్రొక్యూర్మెంట్ విధానంలో ఆన్లైన్ టెండర్లు ఆహ్వానిం చారు. వీటిలో పది పనులను స్థానిక కాం ట్రాక్టర్ ఒకరు రూ.20 లక్షలకు దక్కించుకున్నారు. మిగిలిన రూ.1.21 కోట్ల విలువైన 31 పనులను విశాఖపట్నానికి చెందిన మరో కాంట్రాక్టర్ తక్కువ రేట్ కోట్ చేసి చేజిక్కించుకున్నారు. స్థానిక కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టి వాటిలో నాలుగింటిని ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. అయితే ఎక్కువ పనులు చేజిక్కించుకున్న విశాఖ కాంట్రాక్టర్ మాత్రం పనులు చేపట్టడం కాదు కదా.. కనీసం ఇప్పటివరకు ఒప్పందం కూడా కుదుర్చుకోనేలేదు. 25 శాతం తక్కువకు టెండరు పాడిన ఆయన నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో నగరపంచాయతీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రావాలని కోరుతూ నగరపంచాయతీ అధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. అయినా అటు నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 16న తుది నోటీసు జారీచేశారు. 4 రోజుల్లోగా వచ్చి అగ్రిమెంట్లు రాయిం చుకోవాలని అందులో స్పష్టంగా సూచించారు. దీనికి కూడా కాంట్రాక్టర్ నుంచి స్పందన లేకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టితీసుకెళ్లి టెం డర్ రద్దు చేసే విషయం పరిశీలిస్తామని మున్సిపల్ కమిషనర్ వి.అచ్చెన్నాయుడు చెప్పారు. ఎందుకు తోకముడిచారంటే.. కాంట్రాక్టర్ వెనుకంజ వేయడం వెనుక పెద్ద తతంగమే నడిచింది. గతంలో ఇక్కడ ఏఈగా పనిచేసి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు బది లీపై వెళ్లి ఏఈ సూత్రధారిగా ఇది నడించింది. రాజాం నగర పంచాయతీలో పెద్ద ఎత్తున పనులు చేపడుతున్నారని తెలుసుకున్న సదరు ఏఈ.. ఇక్కడంతా తనకు తెలిసిన అధికారులే ఉన్నందున తన వారితో టెండర్లు వేయించి పనులు దక్కించుకుంటే పెద్ద మొత్తంలో లాభపడవచ్చని భావించారు. తనకు అనుకూలమైన కాంట్రాక్టర్‌ను రంగంలోకి దించారు. తక్కువ రేటు కోట్ చేసిన వారికే పనులు కేటాయిస్తారన్న విషయం తెలుసు కనుక.. వ్యూహాత్మకంగా 25 శాతం తక్కువ రేటు కోట్ చేయించి.. టెండర్ ఖరారు చేయించుకోవడంలో విజయం సాధించారు. ఆ తర్వాత పనులు ఎలా చేసినా అడిగేవారుండరు. తక్కువ రేటే కోట్ చేసినా లాభాలకు ఢోకా ఉండదన్నది ఆయనగారి ఉద్దే శం. అయితే ఫిబ్రవరి నెలలో టెండర్లు పిలిచినా ఆ తర్వాత అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ కారణంగా పనులు చేపట్టలేదు. ఎన్నికల అనంతరం, కొత్త ప్రభుత్వం రావడం.. అదే సమయంలో సిమెంటు, ఇసుక తదితర నిర్మాణ సామగ్రి ధరలు బాగా పెరిగిపోయాయి. అసలే తక్కువ రేటు కోట్ చేశారు. ఇప్పుడు నిర్మాణ సామగ్రి ధరలు పెరిగాయి. ఇప్పుడు పనులు చేపడితే లాభం గూబల్లోకి వస్తుందని కాంట్రాక్టర్‌కు భయం పట్టుకుంది. దాంతో అగ్రిమెంటు కు సైతం ముందుకు రావడం లేదని తెలిసింది. ఇదే విషయమై నగర పంచాయతీ కమిషనర్ వి.అచ్చెన్నాయుడు వద్ద ప్రస్తావించగా కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేసిన విషయం వాస్తవమేనన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగుల మెడపై కత్తి!
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు సహా ఏపీలోనివివిధ ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు మొత్తంగా 70 వేల మంది సిబ్బందిని తొలగిస్తారంటూ ప్రచారం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన.. ప్రభుత్వం ప్రకటనకు డిమాండ్ హైదరాబాద్: ‘సీన్ రివర్స్’ అంటే ఇదే! ఎన్నికలప్పుడు.. ‘జాబు కావాలంటే బాబు రావాల’ంటూ టీడీపీ ఊదరగొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ కొత్త ఉద్యోగాల సృష్టి సంగతి అటుంచితే.. ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు అంతర్గతంగా కసరత్తు జరుగుతోందనే సంకేతాలు వివిధ శాఖల్లో వేలాదిమంది సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉండగా.. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల ఉద్యోగ కాలం పొడిగింపు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే తమ ఉద్యోగ భవిష్యత్తుపై కాంట్రాక్టు సిబ్బంది అయోమయంలో ఉండగా.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, ఆయుష్ ఉద్యోగులు, గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్ విద్యా మిషన్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 70 వేల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 1.ఉపాధి హామీ పథకంలో 13 జిల్లాల్లో దాదాపు 11 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 3,600 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థలో దాదాపు 2,600 మంది 2006 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వీరందరితో పాటు.. జలయజ్ఞం, భూసేకరణ కార్యాలయాల్లో పనిచేసే దాదాపు 700 మంది ఐట్సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం కూడా అయోమయంలో పడింది. 2.ఆదర్శ రైతులను కూడా తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో కార్యాచరణ కూడా మొదలయినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 13 జిల్లాల్లో 25 వేల మందికి పైగా ఆదర్శ రైతులు ఉన్న విషయం విదితమే. ఆదర్శ రైతులను తొలగించాలనే ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టాలని ఇప్పటికే ఆయా సంఘాలు నిర్ణయించాయి. 3..ఆయుష్‌లో దాదాపు 5,000 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కలెక్టర్ల నుంచి ఈమేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని వారి సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 30 మందికి తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొన్నారు. ఆయుష్‌లో వైద్యులు లేకపోవడం వల్ల సిబ్బంది ఉన్నా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో వారిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారంటూ జిల్లా వైద్యాధికారి ఆయుష్ శాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్‌కు లేఖ రాశారు. -
లోక్‌సభలో సీన్ రివర్స్....!
అధికార పక్షంలో బీజేపీ... విపక్షంలో కాంగ్రెస్ కొలువుదీరిన 16వ లోక్‌సభ న్యూఢిల్లీ: కేంద్రంలో బుధవారం 16వ లోక్‌సభ కొలువుదీరింది. అయితే 15వ లోక్‌సభతో పోలిస్తే పూర్తిగా సీన్ రివర్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సభ్యులు పూర్తిస్థారుులో అధికారపక్ష బెంచీలను ఆక్రమించగా.. మునుపెన్నడూ లేని విధంగా కేవలం 44 మంది సభ్యులతో కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి దిగజారిపోరుుంది. బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తుండగా విజయదరహాసంతో మోడీ బుధవారం లోక్‌సభలో అడుగుపెట్టారు. బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ఆయన వెన్నంటి వచ్చారు. మీగడ రంగు కుర్తా ధరించి వచ్చిన ప్రధాని ముందువరుసలోని సభ్యుల్ని చిరునవ్వుతో పలకరించారు. కాంగ్రెస్ సభ్యుల వైపునకు రాగా అప్పుడే పక్క నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియూగాంధీ లోనికివచ్చారు. ఇద్దరూ ముకుళిత హస్తాలతో పరస్పరం పలకరించుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యూదవ్తో మోడీ చేతులు కలిపారు. ములాయం ప్రధానిని అభినందించడం కనిపించింది. సీటింగ్ ఏర్పాట్లు సైతం కేంద్ర ప్రభుత్వంలో చోటు చేసుకున్న మార్పును ప్రతిఫలించారుు. బీజేపీ అగ్రనేత అద్వానీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ హోదాలో ప్రధాని మోడీ పక్క సీట్లో కూర్చున్నారు. వారికి పక్కనే ఉన్న మొదటి బెంచీలో మురళీ మనోహర్ జోషీ, రాంవిలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ), ఎం.వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్ ఆసీనులయ్యూరు.ప్రతిపక్ష బెంచీల్లో.. మొదటి వరుసలో లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే, సోనియూగాంధీ, వీరప్ప మొరుులీ, కె.హెచ్.మునియప్ప కూర్చున్నారు. రాహుల్ గాంధీ వెనుక బెంచీలో కూర్చున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు నాయకత్వం వహించేందుకు నిరాసక్తత వ్యక్తం చేసిన రాహుల్.. తొమ్మిదో వరుసలోని బెంచీల్లో అస్రార్ ఉల్ హక్, శశిథరూర్‌ల పక్కన కూర్చున్నారు. విపక్షంలో ముందు వరుసల్లో కూర్చున్నవారిలో ములాయం సింగ్ యూదవ్, సుదీప్ బందోపాధ్యాయ్ (టీఎంసీ), అర్జున్ చరణ్ సేథీ (బీజేడీ), తంబిదురై (ఏఐఏడీఎంకే) ఉన్నారు. ముండే మరణంతో విషాదఛాయలు: కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మరణంతో లోక్‌సభ మొదటిరోజు సమావేశంలో కొంత విషాద వాతావరణం కన్పించింది. దివంగత నేతకు నివాళి అర్పించిన తర్వాత సభ మరుసటి రోజుకు వారుుదా పడింది. ముండే మృతి పట్ల ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ సంతాపం ప్రకటించారు. సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆయన గురువారానికి వారుుదా వేశారు. అనంతరం లోక్‌సభ సెక్రటరీ జనరల్ పి.శ్రీధరన్ 16వ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల జాబితాను సభ ముందుం చారు. వారుుదా పడే ముందు ముండే మృతికి సంతాప సూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది.