కాంట్రాక్టు ఉద్యోగుల మెడపై కత్తి!
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు సహా ఏపీలోనివివిధ ప్రభుత్వ శాఖల్లో కిందిస్థాయి సిబ్బంది ఉద్యోగాలకు ఎసరు మొత్తంగా 70 వేల మంది సిబ్బందిని తొలగిస్తారంటూ ప్రచారం
ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన.. ప్రభుత్వం ప్రకటనకు డిమాండ్
హైదరాబాద్: ‘సీన్ రివర్స్’ అంటే ఇదే! ఎన్నికలప్పుడు.. ‘జాబు కావాలంటే బాబు రావాల’ంటూ టీడీపీ ఊదరగొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. కానీ కొత్త ఉద్యోగాల సృష్టి సంగతి అటుంచితే.. ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు అంతర్గతంగా కసరత్తు జరుగుతోందనే సంకేతాలు వివిధ శాఖల్లో వేలాదిమంది సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడు లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఉండగా.. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల ఉద్యోగ కాలం పొడిగింపు ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కొనసాగింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే తమ ఉద్యోగ భవిష్యత్తుపై కాంట్రాక్టు సిబ్బంది అయోమయంలో ఉండగా.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆదర్శ రైతులు, ఆయుష్ ఉద్యోగులు, గృహ నిర్మాణ సంస్థ, రాజీవ్ విద్యా మిషన్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 70 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
1.ఉపాధి హామీ పథకంలో 13 జిల్లాల్లో దాదాపు 11 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 3,600 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. గృహ నిర్మాణ సంస్థలో దాదాపు 2,600 మంది 2006 నుంచి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వీరందరితో పాటు.. జలయజ్ఞం, భూసేకరణ కార్యాలయాల్లో పనిచేసే దాదాపు 700 మంది ఐట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవితవ్యం కూడా అయోమయంలో పడింది.
2.ఆదర్శ రైతులను కూడా తొలగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో కార్యాచరణ కూడా మొదలయినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. 13 జిల్లాల్లో 25 వేల మందికి పైగా ఆదర్శ రైతులు ఉన్న విషయం విదితమే. ఆదర్శ రైతులను తొలగించాలనే ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టాలని ఇప్పటికే ఆయా సంఘాలు నిర్ణయించాయి.
3..ఆయుష్‌లో దాదాపు 5,000 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కలెక్టర్ల నుంచి ఈమేరకు త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని వారి సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 30 మందికి తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొన్నారు. ఆయుష్‌లో వైద్యులు లేకపోవడం వల్ల సిబ్బంది ఉన్నా ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో వారిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారంటూ జిల్లా వైద్యాధికారి ఆయుష్ శాఖ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్‌కు లేఖ రాశారు.