‘కాంట్రాక్టు’కూ వెన్నుపోటు!
క్రమబద్ధీకరణ కుదరదన్న బాబు సర్కార్.. న్యాయపరమైన చిక్కులంటూ కాకమ్మ కబుర్లు
♦ మూడేళ్లుగా నాన్చి చివరకు తేల్చింది ఇదా..
♦ కాంట్రాక్టు ఉద్యోగులలో ఆగ్రహావేశాలు
♦ రెగ్యులరైజేషన్, జీతభత్యాలపై స్పష్టత ఇవ్వండి
♦ కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల డిమాండ్..
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు కార్మికులనే కాదు.. నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాలనూ చంద్రబాబు ఇలాగే మోసం చేశారు. అన్ని హామీలను అటకెక్కించారు. అవసరం తీరాక వెన్నుపోటు పొడిచారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, చేనేత కార్మికులు, విద్యార్థులు.. ఇలా ఎవరినీ వదలలేదు. తాజాగా ఆ జాబితాలో కాంట్రాక్టు ఉద్యోగులు చేరారు. క్రమబద్ధీకరణ కుదరదని చంద్రబాబు తేల్చేయడంతో వారంతా ఇపుడు లబోదిబోమంటున్నారు. న్యాయపరమైన చిక్కులున్నాయని చెబుతున్నా ఉద్యోగులు నమ్మడం లేదు.
ఎందుకంటే పొరుగున ఉన్న తెలంగాణ కాంట్రాక్టు కార్మికులను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తోంది. ఈ మూడేళ్లలో మూడు జీవోలిచ్చింది. అక్కడ లేని న్యాయపరమైన చిక్కులు ఆంధ్రప్రదేశ్‌కి ఎక్కడి నుంచి వచ్చాయి? రెగ్యులరైజ్ చేయడం బాబుకు ఇష్టం లేదు. హామీ ఇచ్చి మోసం చేయడం, పొంతనలేని సాకులు చెబుతుండడం, మూడేళ్లు నాన్చి ఇపుడు కుదరదనడం.. ఉద్యోగులలో ఆగ్రహావేశాలను రగిలించింది. అలాగే ప్రభుత్వం చెప్పినట్టుగా 50శాతం వేతనం పెంచినా పెద్దగా ఒనగూరేది లేదని వారు మండిపడుతున్నారు.
మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయాపన
తమను మోసగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందని కాంట్రాక్టు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 2014 సెప్టెంబర్ 9న మంత్రు లు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డిల తో ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ సంఘం 2016 సెప్టెంబర్ 16 నుంచి 2018 ఏప్రిల్ 18 వరకు 11 సార్లు సమావేశమైంది. చివరకు క్రమబద్ధీకరించలేమని తేల్చింది.
ఉద్యోగుల సంఖ్యపైనా గందరగోళం
రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు అనే దానిపై ప్రభుత్వం ఒక్కోసారి ఒక్కోరకంగా చెపుతుండటం అనుమానాలకు దారి తీస్తోందని కాంట్రాక్టు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 56,714 మంది ఉన్నారని మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో చెప్పింది. ఇందులో ప్రభుత్వ శాఖల్లో 13,671 మంది, ప్రభుత్వ రంగ సంస్థల్లో 43,043 మంది ఉన్నట్టు పేర్కొంది. తాజాగా 26,664 మంది మాత్రమే అంటోంది. అంటే మిగతా 30,050 మంది ఉద్యోగులు ఏమైనట్టు? పైగా జాతీయ ఆరోగ్యమిషన్ పరిధిలో సుమారు 8 వేల మంది పనిచేస్తున్నారు. వీళ్లందరికీ కేంద్రమే వేతనాలు చెల్లిస్తోంది. వీళ్లనూ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో చూపి వేతనాలు చెల్లిస్తున్నట్టు లెక్కలు చూపుతోంది.
న్యాయపరమైన చిక్కులు ఎక్కడున్నాయి?
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. చంద్రబాబు 2014లో ఎన్నికల హామీ ఇచ్చే నాటికి న్యాయ పరమైన చిక్కులు లేవా? ఎన్నికల్లో గెలిచాక చిక్కులొచ్చా యా? ఒకవేళ ముందే న్యాయపరమైన చిక్కులు ఉండి ఉంటే మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? ఊరూవాడా ఉపన్యాసాల్లో ఎందుకు చెప్పారు? అనే ప్రశ్నలకు ప్రభు త్వం నుంచి సమాధానం లేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు... గిరిజన సంక్షేమశాఖలో ఉన్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2016 ఫిబ్రవరి 19న జీవో ఎంఎస్ నెం.57ను, వైద్య ఆరోగ్యశాఖలోని ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2017 మార్చి 22న జీవో ఎంఎస్ నెం.19ను, జీవో ఎంఎస్ నెం.20ను జారీచేసింది. కాంట్రాక్టు లెక్చరర క్రమబద్ధీకరించే ప్రక్రియా కొనసాగుతోంది.కాగా సుప్రీంకోర్టు సహా రాజస్థాన్,బాంబే,ఏపీ హైకోర్టులు కూడా క్రమబద్ధీకరణకు అనుకూలంగా వివిధ సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి.
దారుణంగా మోసం చేశారు
మంత్రివర్గ ఉపసంఘమంటూ మూడేళ్ల పాటు నాన్చి ఇప్పుడు చెయ్యలేమని చేతులెత్తేయడమంటే దారుణంగా వంచించడమే. తెలంగాణకు లేని అడ్డంకులు ఏపీకి ఎందుకు వస్తున్నాయి? కాంట్రాక్టు ఉద్యోగులకు హామీ ఇచ్చినప్పుడు చంద్రబాబుకు ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఇది వంచన కాక మరేంటి? .–మేసా ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు.
‘‘ప్రభుత్వ ఉద్యోగాలు పరమవేస్ట్.. ఉద్యోగులు సోమరులుగా తయారవుతారు’’
– సీఎం చంద్రబాబు బాబు ‘మనసులో మాట’
రాష్ట్రంలో అరలక్ష కాంట్రాక్టు సిబ్బంది,
ఆ కుటుంబాల్లో 4 లక్షల ఓట్లున్నాయి.
– అందుకే 2014 ఎన్నికల ముందు క్రమబద్ధీకరణ హామీ ఇచ్చారు
అందుకే చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను సృష్టించారు... తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించేయాలనుకున్నారు.
ఎన్నికలయిపోయాయి. అవసరం తీరిపోయింది.. ఎలా గోలా వారిని, వారికిచ్చిన హామీని చెత్తబుట్టలో వేయాలి..
– అందుకే ఓ మంత్రివర్గ ఉపసంఘం వేశారు..
మూడేళ్లు నాన్చారు. ఇప్పుడు క్రమబద్ధీకరణ కుదరదని తేల్చేశారు.