అసైన్డ్ భూములను లాక్కొనే కుట్ర
దొరికింది దొరికినట్లు సీఎం భోంచేస్తున్నారు: తమ్మినేని ధ్వజం
సాక్షి, హైదరాబాద్: దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అసైన్డ్ భూములను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాక్కోవాలని చూస్తున్నారని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తింది. ఈ వర్గాలకు భద్రత కల్పించడం కోసం ఇచ్చిన అసైన్డ్ భూములను ఇత రులు తీసుకోవడానికి ప్రతిబంధకంగా ఉన్న 9/77 చట్టాన్ని సవరించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడింది. పార్టీ అధికార ప్రతి నిధి తమ్మినేని సీతారాం శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసైన్డ్ భూములను తన పచ్చదండుకు కట్టబెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. బలహీనవర్గాల ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకు ని వారి నుంచి పెత్తందార్లు కొనుగోలు చేసిన భూములను 500 నుంచి వెయ్యి గజాల మేరకు స్లాబులుగా విభజించి క్రమబద్ధీకరించేందుకు తెర లేపుతున్నారన్నారు.
వందిమాగధులకు కట్టబెడతారా? : ల్యాండ్ బ్యాంక్ పేరుతో తడ నుంచి ఇచ్ఛాపురం వరకూ పది లక్షల ఎకరాల భూమిని చంద్రబాబు సేకరిస్తున్నారని, ఇవన్నీ తన వందిమాగధులకే కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. ఎలాగూ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ఇల్లుండగానే దీపం చక్క బెట్టుకోవాలని ఇలా చేస్తున్నారా? అని సీతారాం అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ‘ఈట్ ఇండియా కంపెనీ’కి సీఈఓగా వ్యవహరిస్తూ దొరికింది దొరికినట్లుగా భోంచేస్తున్నారని తమ్మినేని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో హామీలేవీ నెరవేర్చలేదని, దీనిపై ప్రజల సమక్షంలో ఉమ్మడి వేదికపై తనతో చర్చకు రావాలని సీతారాం సవాలు విసిరారు.