క్లీన్‌ సిద్దిపేట .. ఇక గ్రీన్‌ సిద్దిపేట | target green siddipet | Sakshi
Sakshi News home page

క్లీన్‌ సిద్దిపేట .. ఇక గ్రీన్‌ సిద్దిపేట

Published Tue, Jul 19 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

మొక్క నాటుతున్న మంత్రి హరీశ్‌రావు (ఫైల్‌)

మొక్క నాటుతున్న మంత్రి హరీశ్‌రావు (ఫైల్‌)

  • ‘లక్ష’ణంగా లక్ష్యం సాధించారు
  • మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్దిపేట మున్సిపాల్టీ
  • బొట్టు, చెట్టుతో సత్ఫలితాలు
  • పేటలో 1.29 లక్షల మొక్కలు నాటిన ప్రజలు
  • సిద్దిపేట జోన్‌: గ్రీన్‌ సిద్దిపేటగా మార్చాలనే మంత్రి హరీశ్‌రావు ఆశయానికి సిద్దిపేట మున్సిపాల్టీ చేయూతగా నిలిచింది. వినూత్న పథకాల ప్రయోగాలతో దేశ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేట మున్సిపాల్టీ హరితహారంలో మరోరికార్డు సొంతం చేసుకుంది. ఇటీవల సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో ఒకే రోజు లక్ష మొక్కలను నాటి రికార్డు సొంతం చేసుకున్న విషయం విదితమే.

    అలాగే పట్టణ పరిధిలో అత్యధికంగా మొక్కలు నాటి సిద్దిపేట స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీ మరో రికార్డు సాధించింది. హరితహారంలో భాగంగా 1, 29 లక్షల మొక్కలను నాటిన సిద్దిపేట మున్సిపల్‌ యంత్రాంగం మెగా ప్లాంటేషన్‌లో భాగంగా ఒక్కరోజే 86, 278 మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి మొక్కను అందించే లక్ష్యంతో మున్సిపల్‌ యంత్రాంగం డ్వాక్రా మహిళ సంఘాల సౌజన్యంతో బొట్టు, చెట్టు అనే వినూత్న కార్యక్రమం నిర్వహించారు.

    వార్డుల్లో ఇంటింటికి తిరిగి డ్వాక్రా మహిళలు బొట్టు పెట్టి మొక్కలను అందించి హరితహరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదే విధంగా ప్రతి వ్యక్తికి మొక్కను పంపిణీ చేసిన మున్సిపల్‌ అధికారులు దత్తత అంగీకార పత్రాన్ని అందజేసి మొక్క పరిరక్షణ బాధ్యతను ప్రజలపైనే పెట్టడం  నిరే్ధశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు దోహదపడింది.

    సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలో 28 వేల నివాస గృహాలు ఉండగా, 1.5 లక్షల జనాభా ఉంది. పట్టణంలోని 34 వార్డుల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని ప్రభుత్వం నిరే్ధశించింది. అ దిశగానే మంత్రి హరీశ్‌రావు గత నెలలో హరితహారాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు సమీక్షలు నిర్వహించారు. ఉద్యమం తరహాలో హరితహరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

    ఈ క్రమంలోనే సిద్దిపేట మున్సిపాల్టీకి ప్రభుత్వం ఈ యేడు 50 వేల మొక్కలు నాటాలని నిరే్ధశించింది. క్లీన్‌ సిద్దిపేటగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్దిపేటలో ప్రభుత్వ లక్ష్యాన్ని రెట్టింపు చేసి లక్ష మొక్కలు నాటి గ్రీన్‌ సిద్దిపేటగా మార్చాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఆ దిశగా పట్టణంలోని 34 వార్డుల ప్రజాప్రతినిధులును, విద్యాసంస్థలను, స్వచ్ఛంద సంఘాలను, ఆధికారులను ఐక్యం చేసి హరితహరాన్ని  ప్రారంభించారు.

    రెండేళ్లుగా లక్ష్యాన్ని అధిగమిస్తూ..
    సిద్దిపేటలో గతేడాది సీఎం కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించిన హరితహారం కార్యాక్రమ స్పూర్తితో  సిద్దిపేట మున్సిపల్‌ అధికారులు వరుసగా రెండేళ్లుగా లక్ష్యాన్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంలో ప్రభుత్వ నిరే్ధశిత లక్ష్యాన్ని పూర్తి చేశారు. గతేడాది మున్సిపల్‌ శాఖ పట్టణానికి 75 వేల మొక్కలను నాటాలని లక్ష్యాన్ని నిరే్ధశించింది. ఈ క్రమంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా హరితహారాన్ని చేపట్టి 1.25 లక్షల మొక్కలు నాటారు.

    ఈ సంవత్సరం ప్రభుత్వం 50 వేల మొక్కలు నాటాలని సూచించగా గత కొన్ని రోజులుగా ప్రణాళికాబద్ధంగా హరితహరాన్ని నిర్వహించి ఈ నెల 18వ తేదీ నాటికి పట్టణంలో 1,29,638 మొక్కలను నాటారు. మెగా ప్లాంటేషన్‌ సందర్భంగా సోమవారం ఒక్కరోజే పట్టణంలో 86,278 మొక్కలను మున్సిపల్‌ ఆధ్వర్యంలో నాటారు.

    పక్కాగా ప్రణాళిక ..
    సిద్దిపేటను గ్రీన్‌ సిద్దిపేటగా మార్చాలనే మంత్రి ప్రణాళికను అధికార యంత్రాంగం నిర్ధేశిత లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించింది. పట్టణంలోని 28 వేల ఇండ్లకు 22 వేల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ప్రధానంగా మామిడి, జామ, దానిమ్మ, సీతాఫలం, బాదం, ఖర్జూర, బొప్పాయ లాంటి పండ్ల మొక్కలతో పాటు నాలుగు రకాలు ఆయుర్వేద మొక్కలు అందజేశారు. మొక్కలను పరిరక్షించేందుకు మున్సిపల్‌ పారిశుద్ధ్య టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఆద్వర్యంలో దత్తత పత్రాలను రూపొందించి ప్రతి వ్యక్తికి వాటిని అందజేసి వారి ద్వారా మొక్క దత్తతను అధికారికంగా తీసుకున్నారు.

    దీనికి తోడు మహిళల్లో చైతన్యం, స్ఫూర్తి కలిగించేందుకు మున్సిపాల్టీకి చెందిన మెప్మా విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు బొట్టు పెట్టి మొక్కను అందించి  హరితహారం యజ్ఞంలో భాగస్వామ్యం కావాలని డ్వాక్రా సంఘాలు పిలుపునిచ్చాయి.  సమిష్టిగా రూపొందించిన హరితహారం నిరే్ధశిత లక్ష్యాన్ని సిద్దిపేట మున్సిపల్‌ అధిగమించినప్పటికి ఈ నెల చివరి వరకు కొనసాగింపు దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు.  

    గ్రీన్‌ సిద్దిపేట నా స్వప్నం
    హరితహారంలో భాగంగా దశల వారిగా పట్టణాన్ని గ్రీన్‌ సిద్దిపేటగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. గత యేడాది, ఈ యేడు పెద్ద ఎత్తున పట్టణంలో మొక్కలు నాటాం. ప్రతి ఒక్కరు నాటిన మొక్కను పరిరక్షించాలి. – హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement