సంకట స్థితిలో గోపాలపురం టీడీపీ
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితిలో ఉంది. టికెట్ రేసులో ముప్పిడి వెంకటేశ్వరరావు, యేపూరి దాలయ్య ఉన్నారు. ముప్పిడికి టికెట్ ఖరారైందని అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయని స్థానిక నాయకులు చెబుతున్నారు. అయితే టికెట్ ఖరారుపై ప్రకటన చేస్తే దాలయ్య వర్గం దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుండడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గ్రామాల్లో ప్రచారాలు చేస్తున్న నాయకులు తమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో చెప్పకుండా దాటవేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సీమాంధ్ర టీడీపీ నేతల సమావేశానికి ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల నుంచి ఆ పార్టీ నాయకులు వెళ్లి ఈసారి గోపాలపురం టికెట్ ఈ రెండు మండలాల్లోని వారికే ఇవ్వాలని, స్థానికేతరుడిని తీసుకువస్తే సహకరించేది లేదని అధినేత చంద్రబాబు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాగంటి మురళీమోహన్ వద్ద కుండబద్దలు కొట్టారు. ఈ రెండు మండలాల్లో యేపూరి దాలయ్య వైపు ఒక వర్గం, ముప్పిడి వెంకటేశ్వరరావు వైపు మరో వర్గం పనిచేస్తోంది.
ఈ క్రమంలోనే ముప్పిడికి టికెట్ ఖరారయ్యిందని టీడీపీ అధిష్టానం స్థానిక నాయకులకు తెలిపింది. అయితే రెండు వర్గాల మధ్య విభేదాలు తీవ్రం కావడంతో అధికారికంగా ప్రకటించలేదు. ముప్పిడి తనకు టికెట్ ఖరారయిందని ధీమా వ్యక్తం చేస్తుండగా.. పార్టీ జెండాను భూజనెత్తుకుని, అహర్నిశలు శ్రమించిన వ్యక్తికి కాకుండా ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని, ఇస్తే సహించేది లేదని దాలయ్య వర్గం అధినేత తీరుపై మండిపడుతోంది. ఇటీవల ద్వారకాతిరుమలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మురళీమోహన్ ముప్పిడి, దాలయ్య చేతులు కలిపి టికెట్ ఎవరికి ఇచ్చినా వారి విజయానికి యత్నించాలని ఇద్దరికీ సూచించారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మురళీమోహన్ చేసిన యత్నాలు ఫలించలేదు.