మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. తెలిసిన వ్యక్తి పనే.. 9 గంటల్లోనే.. | Sakshi
Sakshi News home page

Hyderabad Kidnap Case: మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. తెలిసిన వ్యక్తి పనే.. 9 గంటల్లోనే..

Published Fri, Dec 24 2021 8:32 AM

3 Year Old Girl kidnapped in Hyderabad, Cops Rescued Child, Arrest Accused - Sakshi

సాక్షి, రాంగోపాల్‌పేట్‌(హైదరాబాద్‌): ఇంటి ఎదుట ఆడుకుంటున్న మూడేళ్ల బాలికను కిడ్నాప్‌ చేసిన దుండగులను పోలీసులు తొమ్మిది గంటల్లోనే పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. రెజిమెంటల్‌ బజార్‌లో నివసించే శ్రీనివాస్, ఉమా దంపతులకు తరుణ్‌ (6), కీర్తన (3) ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కీర్తనకు అన్నం పెట్టేందుకు తల్లి ఉమా కిచెన్‌లోకి వెళ్లగా చిన్నారి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చింది.

10 నిమిషాలకు తల్లి వచ్చి చూసేసరికి పాప కనిపించ లేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన దర్యాప్తు చేశారు. శ్రీనివాస్‌ ఇంటికి కొద్ది దూరంలో ఇద్దరు యువకులు తచ్చాడినట్లు స్థానికులు తెలిపారు. ఓ మహిళ వీరిని ప్రశ్నించగా... సాయి కోసం వచ్చామని చెప్పడంతో పాటు అక్కడ కొందరు ఆ పేరున్న వాళ్లు ఉండటంతో తెలిసిన వారై ఉండవచ్చని ఆమె భావించింది. కాసేపటికి చిన్నారిని యాక్టివా వాహనంపై తమ మధ్య కూర్చోబెట్టుకుని వెళ్లడాన్ని గుర్తించిన ఎల్లోరా అనే వృద్ధురాలు పోలీసులకు తెలిపింది. వాళ్లు చిన్నారితో మాట్లాడుకుంటూ తీసుకుని వెళ్లినట్లు చెప్పింది.
చదవండి: న్యూఇయర్‌ వేడుకలు.. గ్రాము కొకైన్‌ ధర.. బంగారం కంటే 3 రెట్లు ఎక్కువ

దీంతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని భావించారు. రంగంలోకి దిగిన ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్, గోపాలపురం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ముందుకు వెళ్లి గాలింపు చేపట్టారు. రాత్రి 10 గంటలకు జీడిమెట్లలో నిందితుల ఆచూకీ గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సూత్రధారి బాలిక కుటుంబానికి పరిచయస్తుడు. పాపకు మామ వరసైన వ్యక్తే కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, మరో ఇద్దరు కిడ్నాప్‌ చేశారని, ఇంకొకరు బాలికను దాచిపెట్టడానికి సహకరించారని తేల్చారు.  వ్యక్తిగత కారణాలతోనే బాలికను కిడ్నాప్‌ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.  
చదవండి: ఆన్‌లైన్‌లో పరిచయం.. నీ కష్టాలు తీరుస్తా.. వ్యక్తిగత ఫొటోలు, రూ.5 వేలు పంపు..

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement