ఇబ్రహీంపట్నం రూరల్ / తుర్కయాంజాల్ / సాక్షి, హైదరాబాద్: శుక్రవారం ఉదయం 11.20. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని మన్నెగూడలో ఓ ఇల్లు. ఆ ఇంటి యజమాని కుమార్తెకు పెళ్లిచూపులు. ఇల్లంతా హడావుడిగా ఉంది. ఆ సమయంలో మూడు వాహనాలు అక్కడికి దూసుకువచ్చాయి. వాటిలోంచి పదుల సంఖ్యలో దుండగులు కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని దిగారు. ఇంట్లో విధ్వంసం సృష్టించారు. అడ్డొచ్చిన ఇంటి యజమాని, ఇతర కుటుంబసభ్యులపై దాడి చేశారు. యువతిని కూడా కొడుతూ బలవంతంగా కారెక్కించి తీసుకెళ్లారు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో అంతా సినీఫక్కీలో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించగా..చివరకు యువతి క్షేమంగా బయటపడటంతో కొన్ని గంటల పాటు కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పెళ్లికి నిరాకరించిన యువతి తల్లిదండ్రులు
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ముచ్చర్లపల్లికి చెందిన దామోదర్‌రెడ్డి, నిర్మల దంపతులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మన్నెగూడలో ఉంటున్నారు. దామోదర్‌రెడ్డి మిలటరీ విశ్రాంత ఉద్యోగి. వీరి కుమార్తె (24) వైద్య విద్యార్థిని. మొయినాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీడీఎస్ (ఐదో సంవత్సరం) హౌస్ సర్జన్ చేస్తోంది. కరోనా సమయంలో ఆమె బొంగ్లూర్ సమీపంలోని షెటిల్ కోర్టుకు వెళ్లేది. ఇక్కడికి సమీపంలోనే ‘మిస్టర్ టీ’స్టాల్ నిర్వహించే నల్లగొండ జిల్లా ముషంపల్లికి చెందిన కొడుదుల నవీన్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అప్పట్లో ఆమెను పెళ్లి చేసుకునేందుకు నవీన్‌రెడ్డి ఇద్దరు మధ్యవర్తులతో రాయబారం పంపగా.. యువతి తల్లిదండ్రులు నిరాకరించారు.
పెళ్లిచూపులు ఏర్పాటు చేశారని తెలిసి..
యువతికి శుక్రవారం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న నవీన్‌రెడ్డి.. దుండగులను తీసుకొని మన్నెగూడలో యువతి ఉండే సంపద హోమ్స్‌కు వచ్చాడు. అంతా కలిసి ఇంట్లో చొరబడి విధ్వంసం సృష్టించారు. కర్రలు, ఇనుపరాడ్లతో కిటికీలు, అద్దాలను పగులగొట్టారు. సామగ్రి, ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన యువతి తండ్రి దామోదర్‌రెడ్డిని, మేనమామను చితకబాదారు. తల్లి నిర్మలను మెడ పట్టుకొని కిందపడేశారు. సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని ధ్వంసం చేసి డీవీఆర్‌ను వెంట తీసుకెళ్లారు. యువతిని కొడుతూ కాళ్లు, చేతులు పట్టుకొని కార్లో పడేసి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావు, ఆదిభట్ల సీఐ నరేందర్ సంపద హోమ్స్‌కు చేరుకున్నారు.
నా బిడ్డను కాపాడండి.. దండం పెడ్తా
యువతి తల్లిదండ్రులు దామోదర్‌రెడ్డి, నిర్మలతో మాట్లాడారు. ఈ సందర్భంగా యువతి తల్లి ‘సార్.. నా బిడ్డను కాపాడండి.. మీకు దండం పెడ్తా’అంటూ జాయింట్ సీపీ కాళ్లమీద పడి ప్రాధేయపడ్డారు. ఆందోళన చెందవద్దని, మీ బిడ్డను క్షేమంగా తీసుకొస్తామంటూ ఆయన ఓదార్చారు. ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి తల్లితో ఫోన్‌లో మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధైర్యంగా ఉండాలని, సీపీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
నవీన్‌రెడ్డి గోదాం కూల్చివేత.. ఫర్నిచర్‌కు నిప్పు
మరోవైపు ఒక్కసారిగా వంద మంది ఇంటిపై దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడటంతో యువతి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు ఆగ్రహానికి గురయ్యారు. యువతి ఇంటిముందే నవీన్‌రెడ్డి ఏర్పాటు చేసుకున్న గోదాం, స్థావరం, గదులను జేసీబీతో కూల్చివేశారు. అందులోని ఫర్నిచర్‌కు నిప్పుపెట్టారు.
యువతి ఫోన్‌కాల్‌తో లొకేషన్ ట్రాక్ చేసి..
యువతిని కిడ్నాప్ చేసిన నవీన్‌రెడ్డి కారులో నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ వైపు పరారయ్యాడు. జిల్లా సరిహద్దులు దాటి వెళ్తుండగానే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం, గాలింపుతో భయాందోళనకు గురైన కిడ్నాపర్లు.. హాలియా వద్ద యువతిని వదిలేసి వెళ్లినట్లు సమాచారం. దీంతో యువతి ‘క్షేమంగా ఉన్నా డాడీ..’అని ఫోన్ చేయడంతో సెల్ టవర్ ఆధారంగా పోలీసులు యువతి ఉన్న స్థలాన్ని గుర్తించి హాలియా పోలీసులను అలర్ట్ చేశారు. పోలీసులు యువతిని రక్షించి తండ్రి దామోదర్ రెడ్డి, షీటీం డీసీపీ సలీమాకు అప్పగించారు. ఈ కేసులో 8 మంది నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి సహా మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అడిషనల్ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ప్రణాళిక ప్రకారమే యువతిని కిడ్నాప్ చేశారని ఆయన చెప్పారు. అపహరణ అనంతరం యువతిని బాగా కొట్టారని, ఆమెకు గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఆమె తీవ్రమైన ఒత్తిడిలో ఉందని, మాట్లాడే పరిస్థితుల్లో లేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment