మిత్రుల మధ్య నోట్ల ఫైట్
మిత్రుల మధ్య నోట్ల ఫైట్
Published Tue, Nov 22 2016 11:35 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
విమర్శలు వద్దంటున్న జిల్లా టీడీపీ అధ్యక్షురాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ మధ్య ఇప్పటికే నెలకొన్న విభేదాలకు పెద్దనోట్ల రద్దు రగడ ఆజ్యం పోసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రతిచోట పెద్దనోట్ల అంశాన్ని ప్రస్తావించడంపై మిత్రపక్షమైన బీజేపీ గుర్రుగా ఉంది. మిత్రపక్షంగా ఉంటూ విమర్శలు చేయడం ఎంతవరకూ సమంజసమని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పెద్ద నోట్ల వల్ల ఉపయోగం లేదని, చిన్న నోట్లు ఇప్పట్లో అందుబాటులోకి రావని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడాన్ని తప్పు పడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే.. తాను లేఖ రాయడం వల్లే ప్రధాని స్పందించి ఈ పని చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించిన విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తున్నారు.
ఆ తరువాత నోట్ల రద్దు కారణంగా తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడూ లేనంత అసహనంతో ఉన్నానని, ప్రజల కష్టాలు చూసి రాత్రిళ్లు నిద్ర కూడా పట్టడం లేదని సీఎం వ్యాఖ్యానించడంపై బీజేపీ నేతలు ఆగ్రహం చేస్తున్నారు. ప్రధాని మోదీని అభాసు పాలుచేసే విధంగా చంద్రబాబు, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతున్నప్పుడు వారికి అసహనం ఎందుకు రాలేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా శాఖ అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ వేర్వేరు సమావేశాల్లో టీడీపీ వారిని నిందించారు. రెండు నాల్కల మాటలు మాట్లాడటం చంద్రబాబుకే సాధ్యమని ఎద్దేవా చేశారు. మిత్రపక్షంగా ఉంటూ.. కేంద్రం నుంచి నిధులు పొందుతూ బీజేపీకి మద్దతివ్వాల్సిన బాబు చేస్తున్న విమర్శలను చూస్తుంటే.. ఇటువంటి అవకాశవాద రాజకీయం ఆయనకే చెల్లిందనే విషయం రూఢీ అవుతోందని నిప్పులు చెరిగారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య విభేదాలు ఇప్పటికే రచ్చకెక్కాయి.
జిల్లాలో రెండు పార్టీల మధ్య విబేధాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. తాజాగా పెద్ద నోట్ల రద్దు వివాదంతో ఒకరిపై మరొకరు నేరుగా విమర్శలు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ నెల 26న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తాడేపల్లిగూడెం రానున్న నేపథ్యంలో జిల్లాలోని బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడిపై స్వరం పెంచడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నాయకుల తీరుపై తెలుగుదేశం పార్టీ కూడా స్పందించింది. బీజేపీ నాయకులఽ వ్యాఖ్యలు మిత్రపక్షాల మధ్య విభేదాలు పెంచేలా ఉన్నాయని, చంద్రబాబును విమర్శించడం తగదని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ధ్వజమెత్తారు.
ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని బీజేపీపై విమర్శలు చేయిస్తున్నాడంటూ ఆ పార్టీ మండిపడుతున్నారు. టీడీపీ చర్యలు చూస్తుంటే బీజేపీకి నిదానంగా దూరం జరిగేలా కనిపిస్తున్నాయని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 26న అమిత్‌షా దృష్టికి తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహార శైలిని తీసుకువెళ్లేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
Advertisement