ఎంఎల్ నేతలపై టీడీపీ కౌన్సిలర్ల రౌర్జన్యం
-
కౌన్సిల్ హాల్ నుంచి బయటకు తోసేసిన వైనం
-
పోలీసుల అదుపులో సీపీఐ(ఎంఎల్) నాయకులు
-
సమస్యలు తెలుపుకోవడమే వారి నేరమా
పిడుగురాళ్ళ : ఏళ్ల తరబడి తమ అధీనంలో ఉన్న స్థలంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు, నాయకులు కలిసి మత ఘర్షణలు సృష్టించేందుకు ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం దారుణమని సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకుడు ఉల్లిగడ్ల నాగేశ్వరరావు అన్నారు. లెనిన్‌నగర్‌లోని సీపీఐ(ఎంఎల్) కార్యాలయంలో ఆధ్యాత్మిక నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానం చేయడానికి సిద్ధం చేస్తున్నట్టు తెలిసి, దానిని వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎంఎల్) నాయకులు బుధవారం నినాదాలు చేసుకుంటూ కౌన్సిల్ హాల్‌లోకి ప్రవేశించారు. ఈ సమయంలో అధికార పార్టీ కౌన్సిలర్లు ఒక్కసారిగా సీపీఐ(ఎంఎల్) జిల్లా నాయకుడు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకుడు భాస్కరరావు, రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నీలాద్రి రాంబాబు, కె.శ్రీనివాసరావులతో పాటు వారి వెంట వచ్చిన కాలనీ వాసులను కౌన్సిల్ హాల్ నుంచి బయటకు నెట్టివేశారు. ఈ సందర్భంగా ఉల్లిగడ్డల నాగేశ్వరరావు మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయం కోసం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకొని పార్టీ కార్యాలయం, గ్రంథాలయం, హాస్పటల్ నిర్మాణం కోసం ఉంచిన స్థలంలో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించేందుకు యల్లారావు శంకుస్థాపన చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయం కౌన్సిల్ హాల్లో ప్రస్తావించినందుకు అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు నాయకులు సీపీఐ(ఎంఎల్) నాయకులపై దురుసుగా ప్రవర్తించి చెయ్యి చేసుకున్నారు. అనంతరం టీడీపీ నేత యల్లారావు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఎస్‌ఐ జగదీష్, ఏఎస్‌ఐ భాషా మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి సీపీఐ(ఎంఎల్) నాయకులు ఉల్లిగడ్డల నాగేశ్వరరావు, నీలాద్రి రాంబాబు, బి.భాస్కర్‌రావు, కె. శ్రీనివాసరావులతోపాటు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.