టీడీపీ కౌన్సిలర్ల దౌర్జన్యం
– కౌన్సిల్‌మీట్‌లో ఇరువర్గాల మధ్య తోపులాట
– పింఛన్ల మంజూరులో వివక్షపై ప్రతిపక్ష కౌన్సిలర్ల నిరసన
గుంతకల్లు టౌన్ : గుంతకల్లులో మంగళవారం మున్సిపల్ చైర్‌పర్సన్ కోడెల అపర్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం రణరంగమైంది. అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కాకుండా జన్మభూమి కమిటీలు సూచించిన వారికే పింఛన్లు మంజూరు చేయడం పట్ల నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై పలువురు టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించారు. సమావేశంలో కౌన్సిలర్ల సమస్యలేవి వినకుండా అజెండాను చదవమని చైర్‌పర్సన్ ఆదేశించారు. ఫ్లోర్‌లీడర్ ఫ్లయింగ్‌మాబు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అహ్మద్‌బాషా, గోపి, పోలేపల్లి మధు, రంగన్న, నగేష్, కెవి.నాగరత్న, ఏపీ.శ్రీవిద్య, బీటీ.లక్ష్మిదేవి, మస్తానమ్మలు లేచి పింఛన్ల మంజూరులో జన్మభూమి కమిటీల పెత్తనమేంటని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు.
అంతలోనే వైస్‌చైర్మన్ శ్రీనాథ్‌గౌడ్ అజెండాలోని అంశాలన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ చైర్‌పర్సన్ పోడియంను ప్రతిపక్ష కౌన్సిలర్లు చుట్టుముట్టారు. దీంతో టీడీపీ కౌన్సిలర్లు ప్రతిపక్ష కౌన్సిలర్లను పక్కకు నెట్టేసి బయటకెళ్లేందుకు యత్నించారు. తమకు సమాధానం చెప్పేంతవరకు బయటకెళ్లొదని కౌన్సిల్‌హాల్ ఎంట్రెన్స్‌లో నిల్చున్న ప్రతిపక్ష కౌన్సిలర్లపై దురుసుగా ప్రవర్తించి ఈడ్చేశారు. మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణతో పాటు ఇతర అధికారులంతా ప్రేక్షకపాత్రను పోషించారు. చివరకు అజెండాలోని అంశాలపై కూడా చర్చించకుండానే ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నట్లు ప్రకటించడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
అందరికీ సమానంగా మంజూరు చేశాం : మొత్తం 1,250 మందికి గానూ 700 పింఛన్లు మంజూరయ్యాయని, అన్నివార్డులకు సమానంగా పింఛన్లు మంజూరు చేశామని చైర్‌పర్సన్ కోడెల అపర్ణ, వైస్‌చైర్మన్ శ్రీనాథ్‌గౌడ్‌లు తెలిపారు. సీపీ చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ పార్టీ కౌన్సిలర్లు దౌర్జన్యంగా ప్రవర్తించలేదని, అనవసరమైన ఆరోపణలు చేయడం మాని, పట్టణాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.