- 9న జరిగే ‘నిరుద్యోగ పోరు’కు తరలిరావాలి
- మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విజ్ఞప్తి
నిరుద్యోగులను దగా చేసిన సర్కార్
Published Fri, Jan 6 2017 10:07 PM | Last Updated on Sat, Sep 29 2018 6:14 PM
కాకినాడ :
నిరుద్యోగ యువతను తెలుగుదేశం సర్కార్ పూర్తిగా దగా చేసిందని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యాన, ఈ నెల 9న కలెక్టరేట్ వద్ద జరిగే నిరుద్యోగ పోరులో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ పోరును విజయవంతం చేసే అంశంపై స్థానిక డి–కన్వెన్ష¯ŒS హాలులో పార్టీ కాకినాడ నగరాధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్, విద్యార్థి, యువజన విభాగాలకు చెందిన నాయకులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగాలిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఇచ్చిన మాట నమ్మిన యువత తెలుగుదేశం పార్టీని గెలిపించిందన్నారు. ఎన్నికలయ్యాక ఆ ఊసే లేదని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గడచిన 32 నెలల కాలానికి ఒక్కో నిరుద్యోగికి రూ.64 వేల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంతబాబు ఆధ్వర్యాన ఈ నెల 9న కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పాల్గొంటారన్నారు. నగరంలోని విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వం కళ్లు తెరిపించేలా ఉద్యమించాలని చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మత్సా గంగాధర్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు కత్తిపూడి శ్రీను, నాగదేవర కార్తీక్, మత్సా లోకేష్‌వర్మ, యువజన, విద్యార్థి విభాగాల నగర అధ్యక్షులు కిషోర్, రోకళ్ళ సత్యనాయణ, మాజీ కార్పొరేటర్ మేడిశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement