తిరగబడ్డ తెలు‘గోడు’ | tdp leader muthyala rajaabbai Inmates in kakinada over cm chandrababu | Sakshi
Sakshi News home page

తిరగబడ్డ తెలు‘గోడు’

Published Tue, May 17 2016 9:19 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

తిరగబడ్డ తెలు‘గోడు’ - Sakshi

తిరగబడ్డ తెలు‘గోడు’

 పెద్దాపురంలో తిరుగుబాటు జెండా
  మాటతప్పిన ‘బాబు’పై రాజబ్బాయి ఫైర్
  ఇంటిలోనే ఆమరణదీక్ష


కాకినాడ: ‘ఏరుదాటాక తెప్ప తగలేసే.. సామెతను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాగా వంటపట్టించుకుంటున్నారు. అవసరం ఉన్నంత వరకు వాడుకుని ఆనక కరివేపాకులా తీసి పడేయడంలో ఆయనకు మించిన నాయకుడు లేడంటున్నారు. ఈ మాట ఏ ప్రతిపక్షాలో అంటే రాజకీయం చేయడం కోసమని జనం అనుకుంటారు. కానీ ఆ పార్టీ కోసం కోట్లు తగలేసుకుని జండా మోసిన నాయకులే అంటే జనం నిజమని నమ్మక తప్పదు. ఇప్పుడా విషయం జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో కనిపిస్తోంది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో దగాపడ్డ తెలుగు తమ్ముడు తిరుగుబాటు జెండా ఎగరేయడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది. ఆ నియోజకవర్గంలో ఒకప్పుడు ముఖ్యనేతగా చలామణీ అయిన ముత్యాల రాజబ్బాయి పెద్దాపురం మండలం ఆర్‌బీ పట్నం గ్రామం లో తన ఇంటి వద్దనే సోమవారం చంద్రబాబు ఇచ్చిన  హామీ నెరవేర్చనందుకు నిరసనగా దీక్షకు ఉపక్రమించారు. రాజబ్బాయి గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి టిక్కెట్టు ఆశించారు.  పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ జెండాను భుజాన వేసుకుని తిరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ నియోజకవర్గంలో పార్టీ తరఫున పోటీచేసే నాయకులకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచారు.  చంద్రబాబు సహా జిల్లా ముఖ్యనేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు వంటి వారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందని రాజబ్బాయిని నమ్మించారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కోట్లు తగలేసినా, చంద్రబాబు పాద యాత్ర చేస్తున్నప్పుడు అంతటా వెంటే ఉన్నా చివరకు పెద్దాపురం టిక్కెట్టు దక్కలేదు. స్థానికేతరుడైన చినరాజప్పను పెద్దాపురం నుంచి పోటీపెడుతున్నాం, కలిసి పనిచేసి సర్కార్ వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తామని నమ్మించారని రాజబ్బాయి ఆవేదన చెందబుతున్నారు. చంద్రబాబు సిఎం అయ్యారు. మాట ఇచ్చిన చినరాజప్ప, యనమల ఉపముఖ్యమంత్రి, మంత్రులై పోయారు. అది జరిగి రెండేళ్లు దాటిపోయింది అయినా రాజబ్బాయికి  పార్టీలో న్యాయం జరగలేదు. కానీ పార్టీ వీడిపోయిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు తిరిగి  సైకిల్ ఎక్కి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని రాజబ్బాయి వర్గం మండిపడుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పుడు పోటీ నుంచి విరమించుకుంటే ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా బ్యానర్‌లు, పోస్టర్‌లకే పరిమితమయ్యే నాయకులకు వత్తాసు పలుకుతున్నారని రాజబ్బాయి వర్గీయులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. చివరకు అందరినీ ఒకేలా చూడాల్సిన రాజప్ప కూడా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న తమ లాంటి వారిని కరివేపాకుల్లా తీసిపడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రాజబ్బాయి ఆమరణదీక్షకు దిగడం చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరిని స్పష్టం చేస్తోందని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆయనకు ఏదో మొక్కుబడిగా మార్కెట్‌కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి చేతులు దులుపేసుకున్నారు. ఇప్పుడేమో కనీసం ఆ పదవికి కూడా గౌరవం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం లేదని రాజబ్బాయి వర్గం రాజప్పపై నిప్పులు చెరుగుతోంది. బాబు హామీ ఇచ్చే వరకు ఆమరణ దీక్ష విడిచిపెట్టేది లేదని రాజబ్బాయి చెబుతున్నారు. జిల్లాకు బుధవారం చంద్రబాబు వస్తున్నారని తెలిసే రాజబ్బాయి ఇటువంటి బెదిరింపులకు దిగుతున్నారని, ఈ విషయంలో పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని నేతలు చెబుతున్నారు. కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు, పదవులు లభించడం లేదని పెద్దాపురంలో అయితే బయటపడ్డప్పటికీ జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో చాపకిందనీరులా ఉందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement