‘తెలుగు తమ్ముడి’ హల్‌చల్
నిబంధనలు మీరి కారుతో చొరబడిన చోటా నేత
కానిస్టేబుల్ అడ్డుచెప్పినా బేఖాతర్
కొల్లిపర(గుంటూరు): అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు నిబంధనలు పాటించాల్సిన అవసరం లేనట్టుంది. అధికారులు నిబంధనలను గుర్తు చేస్తే వాటిని తుంగలో తొక్కేయడమే కాకుండా దురుసుగా ప్రవర్తిస్తుండడం రివాజుగా మారింది. ఇందుకు మండలంలోని వల్లభాపురం దక్షిణ ఘాట్ వద్ద ఆదివారం జరిగిన ఉదంతమే ఉదాహరణ. ఘాట్‌ల వద్దకు పుష్కరాల ప్రారంభం సందర్భంలో తొలి రెండు రోజులు వాహనాలను అధికారులు అనుమతించలేదు. కరకట్ట మీదనే వాహనాలు నిలిపి వేసి నడుచుకుంటూ ఘాట్‌ల వద్దకు వెళ్లాల్సి ఉంది. పుష్కరాలకు భక్తుల తాకిడి అంతంత మాత్రంగానే ఉండడంతో అధికార పక్ష నేతల ఒత్తిడితో రెండు రోజుల అనంతరం ఆంక్షలను సడలించారు.
ఘాట్‌ల సమీపం వరకు వాహనాలను అనుమతించారు. ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో వాహనాల రాకపోకలపై ఘాట్‌ల వద్ద పోలీసులు ఆంక్షలను విధించారు. సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మండలానికే చెందిన ఓ ప్రజాప్రతినిధికి చెందిన వాహనంలో ఆయన అనుయాయులు వల్లభాపురం ఘాట్‌లోనికి వెళ్లేందుకు రాగా, విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ వాహనాలు వెళ్లేందుకు వీలులేదని చెప్పాడు. అయినా కారులో ఉన్న వారు వినకుండా వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. కారు అద్దాన్ని చేతితో కొట్టి నిలిపివేసేందుకు కానిస్టేబుల్ ప్రయత్నించగా, కారుకు వెనుక ఉన్న అద్దం పగిలింది. కానిస్టేబుల్ చేతికి రక్తగాయమైంది. కారులోని వారు దిగి పోలీసులతో ఘర్షణ పడ్డారు.
రూ. 10 వేలు డిమాండ్..
అద్దం పగిలినందుకు గాను నాయకులు తమకు రూ. 10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఘాట్ బందోబస్తు ఇన్‌చార్జి అయిన సీఐ బెల్లం శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులోని వారికి సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో పోలీసులు రూ. 10 వేలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. చివరకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. డబ్బులు వద్దని, కానిస్టేబుల్‌తో క్షమాపణ చెప్పించాలని సూచించారు. అప్పటికే ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో గాయానికి కట్టుకట్టించుకుంటున్న కానిస్టేబుల్‌ను పిలిపించి, తమ అనుయాయులకు క్షమాపణ చెప్పించడం కొసమెరుపు.