సాక్షి ప్రతినిధి, కాకినాడ : రాజకీయాలు ఎన్నికల వరకే ... అధికారం చేపట్టాక అభివృద్ధి మంత్రం వైపు అడుగులేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పలికిన ప్రవచనాలు అటకెక్కుతున్నాయి. రాజకీయ ఉగ్రవాదం పై నుంచి కిందిస్థారుు వరకు అహంకారం తలకెక్కి తెగ రెచ్చిపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడి అండతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరిగా ఆదివారం వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతకుమారిపై దాడి చేసినట్టుగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. సర్పంచి, ఎంపీటీసీల స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరి హక్కులనైనా తెలుగు తమ్ముళ్లు కాలరాచేస్తున్నారు.
అధికారులు కూడా అధికార పార్టీ వందిమాగదులకు భయపడి తలాడించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. రంపచోడవరం నుంచి తొలిసారి ఎమ్మెల్యే గా ఎంపికైన వంతల రాజేశ్వరిని టీడీపీ నేతలు అడుగడుగునా అవమానిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేకు ఉన్న అధికారాలను, హక్కులను సైతం అడ్డగోలుగా అడ్డుకుంటున్నారు. అధికారదర్పంతో తెలుగు తమ్ముళ్లు నియోజకవర్గఅభివృద్ధి కార్యక్రమాల్లో సైతం ఎమ్మెల్యే విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. గడచిన రెండున్నరేళ్లుగా ఇదే తీరుతో ఎమ్మెల్యే విధులకు అడ్డుతగులుతున్నారు.కంటతడపెట్టి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
గతేడాది జనవరి 14న బోగీ పండుగ రోజున అడ్డతీగల మండలం పాపంపేట చౌకధరల దుకాణం వద్ద ఎమ్మెల్యేను అవమానించారు. చౌకధరల దుకాణం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కళ్లెదుటే టీడీపీ జెడ్పీటీసీ అడారి కృష్ణవేణి, కుమారుడు, మండల టీడీపీ అధ్యక్షుడు అడారి నాగబాబు సంక్రాంతి కానుకులను పంపిణీ చేసేశారు. తనను పిలిచి పంపిణీ చేయడమేమిటని ప్రశ్నించినందుకు పరుష పదజాలంతో దూషించి దౌర్జన్యానికి దిగారు. కంటతడిపెట్టిన ఎమ్మెల్యే అడ్డతీగల పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు. తనకు జరిగిన అవమానానికి చేసిన ఫిర్యాదు మాటేమోకాని తిరిగి ఆమెపై అధికారమదంతో తిరిగి తప్పుడు ఫిర్యాదుతో ఎమ్మెల్యే కేసును నీరుగార్చేశారు.
రంపచోడవరంలో ఇటీవల యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో సోలార్ లాంతర్ల పంపిణీ సందర్భంగా సమస్యలను ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళ్తుండగా జన్మభూమి కమిటీ సభ్యులు అన్యాయంగా ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. తాజాగా రంజాన్‌తోఫాలో పీవోకు ఎమ్మెల్యే అడ్డతీగల అంశాన్ని వివరిస్తుండగా టీడీపీ ఇన్‌చార్జి శీతంశెట్టి వెంకటేశ్వరరావు అడ్డగోలుగా అడ్డుపడ్డాడు. పార్టీ పేరెత్తవొద్దంటూ విరుచుకుపడ్డారు.
తునిలోనూ కుతకుతలే...
తునిలో కూడా దాదాపు ఇదే పరిస్థితులున్నాయి. ప్రజా వ్యతిరేకతతో ఓటమి పాలైనా అధికార దందా తగ్గడం లేదు. దొడ్డిదారిన అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాను ఇబ్బందుల పాల్జేస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో తొండంగి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో విశిష్ట అతిధిగా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతోపాటు టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు హాజరయ్యారు. అధికారపార్టీ ఎంపీటీసీలను ఆ పార్టీ నేతలు హాజరుకానీయకుండా అడ్డుకుని సమావేశాన్ని వాయిదా వేయించేశారు.
ఎమ్మెల్యే సమక్షంలో సమావేశం జరగకూడదనే దుర్బుద్ధిని ప్రదర్శించారు. తుని నియోజకవర్గంలో అధికారికంగా జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే రాజాకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం, ఒక వేళ ఆహ్వానం పంపినా ఆఖరి నిమిషంలోనే అందించడం...ఇలా మంత్రి యనమల అండదండలతో చెలరేగిపోతున్నారు.
గదుల కేటాయింపుల్లోనూ గదమాయింపులే..
తుని రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీపీ పల్లేటి నీరజకు ఆనుకుని జెడ్పీటీసీకి మరో గది కేటాయించడంలోనూ తమ కుత్సిత మనస్తత్వాన్ని చాటుకున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి జెడ్పీటీసీకి అనుకూలమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ఎంపీపీ అన్న ఏకైక కారణంతో జిల్లాలో ఎక్కడా లేని విధంగా టీడీపీ జడ్పీటీసీకి సీటు కేటాయించడంపై వైసీపీ ఎంపీటీసీ సభ్యులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తపేట, వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావులున్న రామచంద్రపురం, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లోనూ ఇవే పరిస్థితులున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి ఇలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు పెత్తనం చెలాయిస్తూ చెలరేగిపోతున్నారు. ఫలితంగా జిల్లాలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది.
ఇక్కడా... కండకావరమే
Published Tue, Jul 5 2016 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement