అడిగే వారెవరు?.. అడ్డంగా తోడేద్దాం!
- రామగిరి మండలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
- మంత్రి సునీత ఇలాకా కావడంతో చర్యలకు సాహసించని అధికారులు
- పెన్నా నది నుంచి రోజూ వెయ్యి ట్రాక్టర్ల ఇసుక తరలింపు
- అడుగంటిపోయిన భూగర్భజలాలు
- ఎండిపోయిన బోరుబావులు
రామగిరి : రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత మండలంలోనే ఇసుక దందా సాగుతోంది. పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి యథేచ్ఛగా తరలిస్తున్నారు. గాలిమరల పనులకు, కర్ణాటకకు రవాణా చేస్తూ భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. అసలే అధికార పార్టీ వారు, ఆపై మంత్రి ఇలాకా కావడంతో అక్రమార్కులపై చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారు.
రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పేరూరు గ్రామ సమీపంలో పెన్నానది ఉంది. మండల పరిధిలో పేరూరు డ్యాం నుంచి ఐదు కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతం విస్తరించింది. ఇక్కడ ఇసుక బాగా లభ్యమవుతోంది. దీన్ని అధికార పార్టీ వారు మంచి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్లలోకి లోడ్ చేస్తూ రవాణా సాగిస్తున్నారు. ఇలా రోజూ వెయ్యి ట్రాక్టర్ల దాకా ఇసుక తరలిపోతోంది. రాష్ట్రంలో ఇసుక రవాణాపై నిషేధం ఉన్న సమయంలోనూ ఇక్కడి నుంచి వేలాది ట్రాక్టర్లు తరలించారు. మండలంలో వివిధ కంపెనీల గాలిమరలను భారీసంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.
వీటికి తోడు అనధికారిక సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటికి పెద్దఎత్తున ఇసుక అవసరమవుతోంది. అంతేగాకుండా పగటిపూట జేసీబీల సాయంతో ట్రాక్టర్లలో తరలించిన ఇసుకను ఒకచోట డంప్ చేసి.. రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, పావగడతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. తద్వారా భారీమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి సొంత మండలం కావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ‘పెద్దవారితో సమస్య ఎందుకులే’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. ఈ ఇసుక దందాకు సంబంధించి రామగిరి పోలీస్‌స్టేషన్‌లో అధికార పార్టీ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ సీఐ పేరూరు ఇసుక దందావైపు పోలీస్ సిబ్బంది ఎవరూ వెళ్లరాదని హుకుం సైతం జారీ చేశారు. పేరూరులోని పోలీస్ ఔట్‌పోస్ట్‌ను సైతం ఆయనే మూసివేయించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.
పొలాలన్నీ బీడే
ఇసుక దందా నేపథ్యంలో పేరూరు, పేరూరు డ్యాం, ఏడుగుర్రాలపల్లి, దుబ్బార్లపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ గ్రామాల్లో గతంలో 1,500 బోరుబావులు ఉండేవి. అప్పట్లో 300 అడుగుల లోతులోనే నీరు సమృద్ధిగా లభ్యమయ్యేది. ప్రస్తుతం చాలా వరకు ఎండిపోయాయి. 200 బోరుబావుల్లో మాత్రం అరకొర నీరు వస్తోంది. కొత్తగా 750 అడుగులు తవ్వినా.. నీటి చెమ్మ తగలకపోవడంతో బోర్లు వేయడానికి రైతులు సాహసించలేకపోతున్నారు. దీంతో నాలుగేళ్లుగా పెన్నానది పరివాహక ప్రాంతంలో పంట పొలాలు బీడుగా మారాయి.
పంచాయతీకి పైసా రాలేదు
ఇసుక తరలింపు భారీఎత్తున సాగుతున్నా.. దీనిద్వారా పేరూరు పంచాయతీకి ఎటువంటి ఆదాయమూ సమకూరడంలేదు. పెన్నా నది పరివాహక ప్రాంతంలోని పేరూరు గ్రామ శ్మశానవాటికలో సమాధులను సైతం పెకిలించి ఇసుక తోడుకెళ్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గతంలో పేరూరు గ్రామంలో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. దీన్ని కూడా రెండేళ్లుగా మూసేశారు. పేరూరు గ్రామంలో నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్లు తిరుగుతుండటంతో ఎప్పుడు, ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.