ఆసుపత్రి ఎదుట డివైడర్ మూసివేసిన దృశ్యం.. (రౌండ్‌లో) డివైడర్ మధ్యలో దారి (ఫైల్)
♦ పిడుగురాళ్లలో బార్ నిర్వహణకు గాను పన్నాగం
♦ ఎదురుగా ఆసుపత్రి ఉంటే అనుమతులు రావని
♦ డివైడర్ మధ్య దారి మూసేసిన టీడీపీ నాయకులు
పిడుగురాళ్ల టౌన్ : బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటు విషయంలో అధికార పార్టీ రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు. పిడుగురాళ్లలో ఏభై పడకల ఆసుపత్రి ఎదురు బార్ ఏర్పాటు చేసేందుకు అడ్డంకిగా మారిందని అధికార పార్టీకి దగ్గరి వ్యక్తులు ఏకంగా డివైడర్ మధ్య దారినే మూసివేయడం విశేషం. రాకపోకలకు బంద్ అయిన తర్వాత దూరం చూపి అనుమతులు పొందుదామని పన్నాగం పన్ని సోమవారం రాత్రి దారి మూసేశారు. నిబంధనలు మారిన తర్వాత జాతీయ, రాష్ట్రీయ రహదారుల పక్కన ఉండకూడదనే నియమం రావడంతోనే ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయం సమాచారం.
రాత్రికి రాత్రే దారి మూసివేత..
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సెంట్రల్ డివైడర్ మధ్యలో ఉన్న దారిని రాత్రికి రాత్రే మూతపడింది. పదేళ్ల క్రితం ఈ దారి నిర్మించగా పాదచారులకు, రోగులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ఈ ప్రాంతంలో వైద్యశాలలు, స్కానింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు ఎక్కువ. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే రోడ్డులో ఏభై పడకల ఆరోగ్యశ్రీ ఆసుపత్రి ఉంది. అలాంటి మార్గాన్ని మూసివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వైద్యశాల ఎదుట బార్ ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం, వంద అడుగుల దూరం చూపేందుకు గాను బార్ నిర్వాహకులు ఈ పని చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం ఇచ్చారు.