అరుదైన, విలువైన కాశ్మీరీ వైట్ గ్రానైట్ ఉన్న బోడికొండ
గ్రానైట్‌కోసం గ్రూపు రాజకీయాలు
విడదీసి పాలించు రీతిలో వ్యూహం
అమాయక గిరిజనుల్ని విడదీసిన వైనం
తవ్వకాలు కావాలంటూ తెరపైకి మరో గ్రూపు
గ్రానైట్ తరలింపే ధ్యేయంగా కుట్ర
పరోక్షంగా సహకరిస్తున్న పాలకపక్ష నేతలు
పార్వతీపురం: ఏమైతేనేం... పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపారు. విలువైన ఖనిజాన్ని కొల్లగొట్టేందుకు కుట్ర రాజకీయాలకు తెర తీశారు. అన్యోన్యంగా ఉంటున్న గిరిజనుల్లో గ్రూపులు రాజేశారు. ఇప్పటివరకూ బోడికొండ తవ్వకాలపై మన్యంలో సంఘటితంగా పోరాటం చేస్తుంటే... కుటిలనీతితో వారి మధ్య విభజించు... పాలించు.. అనే పాశ్చాత్య వ్యూహం అమలు చేశారు. ఏం చేశారో... ఎలా లొంగదీసుకున్నారోగానీ... కొందరు గిరిజనుల్ని రెచ్చగొట్టి తవ్వకాలకు సమ్మతి తెలియజేస్తున్నట్టు పోలీసులకు వినతిపత్రాన్ని అందించేలా చేశారు. పాలకపక్ష నేతలు ఎంతటికైనా తెగిస్తామని మరోసారి రుజువు చేశారు. పచ్చని చెట్లతో... అలరారే ఆ కొండపై ప్రశాంత జీవనం గడుపుతున్న గిరిజనుల్లో ఇప్పుడు పచ్చని రాజకీయాలు చిచ్చుపెడుతున్నాయి. ఇక్కడ లభించే విలువైన ‘కాశ్మీరీ వైట్ గ్రానైట్’ను వదులుకోలేక అటు కంపెనీ, ఇటు పాలకపక్ష నేతలు తమదైన శైలిలో కుట్ర రాజకీయాలకు తెరలేపారు. దశాబ్దాల నుంచి ఐక్యంగా జీవిస్తున్న అమాయక గిరిజనుల్ని విడదీసేందుకు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే మండలంలోని బోడికొండ బాధిత సంగందొరవలస, టేకులోవ గ్రామాలకు చెందిన గిరిజనులు కొందరు తమకు బోడికొండపై గ్రానైట్ తవ్వకాలు సమ్మతమేనని తెలియజేశారు. తమకు కూలి పనులు దొరకుతాయని, గెడ్డకు, పొలాలకు ఎటువంటి హాని తలపెట్టరని, రక్షిత మంచినీరిస్తారని, పొరపాటు చేస్తే ఏడాది లోగా వెళ్లిపోతామని తమకు బాండు పేపర్లపై కంపెనీ రాసిచ్చిందని చెప్తూ... దాదాపు 70 మంది గిరిజనులు పోలీసులను మంగళవారం కలసి వినతిపత్రాన్ని అందజేశారు. పోలీసులను కలవమని ఎవరు చెప్పారని విలేకరులు ప్రశ్నిస్తే... కంపెనీకి చెందిన మహేష్ కలవమని చెప్పినట్లు గిరిజనులు తెలిపారు.
గిరిజనుల మధ్య గ్రూపులు
ఆది నుంచి గిరిజనులంతా ఐక్యంగా తవ్వకాలను అడ్డుకుంటూ వస్తున్నారు. కొన్ని ప్రజా సంఘాల నేతత్వంలో బోడికొండ పరిరక్షణ కమిటీగా ఏర్పడి పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తవ్వకాలు కూడా జరిపేందుకు కంపెనీ సాహసించలేకపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు రంగంలోకి దిగారు. వారి మధ్య విభజించు... పాలించు అనే ట్రిక్‌ను ప్రయోగించారు. ఎలాగైనా తవ్వకాలు జరుపుకునేలా వారిని ప్రోత్సహించి వారిచేతనే వినతులు ఇప్పించడంలో కతకత్యులయ్యారు.
టీడీపీ నేతల హస్తం
బోడికొండలో అరుదైన ‘కాశ్మీరీ వైట్ గ్రానైట్’ ఉన్నట్లు తెలుసుకున్న రాష్ట్రంలోని పెద్ద పెద్ద 18 గ్రానైట్ కంపెనీలు కొండను తవ్వేందుకు దరఖాస్తు చేశాయి. సుమారు 135 హెక్టార్లను తమకు కేటాయించాలని కోరాయి. 8 దరఖాస్తులు చేసుకున్న పొకర్నా కంపెనీకి తొలుత 10 హెక్టార్లకు గత జూన్ 2న ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. బోడికొండపై దాదాపు 350 హెక్టార్ల వరకు గ్రానైట్ తవ్వకాలకు అనుమతులివ్వొచ్చని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి రికమెంట్ చేసినట్లు సమాచారం. ఈ తతంగం కొనసాగించడంలో టీడీపీ పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి తదితరులు ప్రజాభిప్రాయసేకరణలో తాము వ్యతిరేకమంటూ తేల్చి చెప్పినా.. అనుమతులిచ్చినట్లు సమాచారం.
అత్యంత విలువైన గ్రానైట్
అరుదైన కాశ్మీరీ వైట్ గ్రానైట్ ఒక హెక్టార్‌లో 4 నుంచి 5 క్యూబిక్ మీటర్ల రాయి ఉంటుందని ఇంజినీరింగ్ అధికారుల అంచనా. 10 క్యూబిక్ మీటర్ల ముడి రాయి రూ.9లక్షల వరకు ధర పలుకుతుందని బోగట్టా. అదే రాయి పూర్తిగా సాన బట్టాక మార్కెట్‌లో రూ.18లక్షల వరకు ఉంటుందంటున్నారు. భారీ లాభాలు తెచ్చిపెట్టే ఈ గ్రానైట్ కొండను ఎలాగైనా కాజేయాలన్నది కాంట్రాక్టర్ల ఎత్తుగడ.
బాంబుల మోత తప్పదేమో...?
ఇప్పటి వరకు గిరిజనులు ప్రజా సంఘాల మద్దతుతో గ్రానైట్ తవ్వకాలను వ్యతిరేకించారు. ఇంతలో రాజకీయ ప్రవేశంతో అక్కడి గిరిజనులను విడదీసి తమవైపు తిప్పుకుని తవ్వకాలకు సమ్మతి తెలిపేలా తర్ఫీదునిచ్చారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇక్కడ శాంతిభద్రతల సమస్య ఎదురయ్యేలా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే కంపెనీ ఎన్ని ఎత్తులేసినా అడ్డుకొని తీరుతామని బోడికొండ పరిరక్షణ కమిటీ నాయకులు మాత్రం తెగేసి చెబుతున్నారు.