
మైసూరు: తమ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కీలకపాత్ర పోషించి, అడవిదొంగ వీరప్పన్ చేతిలో 29 ఏళ్ల కిందట హతమైన ఆంధ్రాకు చెందిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిని కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని అడవి బిడ్డలు నేటికీ ఆరాధిస్తున్నారు. వీరప్పన్ జన్మస్థలంలో ఆ అధికారి విగ్రహాన్ని ఏర్పాటుచేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రాజమండ్రికి చెందిన పందిళ్లపల్లి శ్రీనివాస్ కర్ణాటకలో డిప్యూటీ ఫారెస్ట్ కన్సర్వేటర్‌గా ఉంటూ వీరప్పన్‌ను పట్టుకునే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలో చామరాజనగర జిల్లాలోని గిరిజన గ్రామాలకు విద్యుత్, తాగునీరు, రోడ్ల నిర్మాణం, పక్కా ఇళ్ల మంజూరు వంటివి చేపట్టడంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. వీరప్పన్ స్వగ్రామం గోపినాథంలో శ్రీనివాస్ సొంత డబ్బుతో మారియమ్మ ఆలయాన్ని నిర్మించారు.
ఈ నేపథ్యంలో 1991, నవంబరు 10వ తేదీన తన స్వగ్రామం గోపినాథంలో లొంగిపోతానని శ్రీనివాస్‌కు వీరప్పన్ సమాచారం పంపించాడు. అయితే, వీరప్పన్ పథకం ప్రకారం గోపినాథం గ్రామంలోకి శ్రీనివాస్ రాగానే కాల్చి చంపాడు. శ్రీనివాస్ అందించిన సేవలను గోపినాథం, సమీప గ్రామాల అడవిబిడ్డలు నేటికీ మరిచిపోలేదు.
శ్రీనివాస్ మరణించిన గోపినాథం గ్రామంలోని మారియమ్మ ఆలయం పక్కన ఆయన కాంస్య విగ్రహాన్ని గ్రామస్తులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొని శ్రీనివాస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.
(చదవండి: తల నరికేసే ఊరిలో రెండు దేశాల బోర్డర్)
Comments
Please login to add a commentAdd a comment