‘కొండంత అరాచకం | tdp leaders dominates in penukonda | Sakshi
Sakshi News home page

‘కొండంత అరాచకం

Published Wed, Sep 14 2016 11:24 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

‘కొండంత అరాచకం - Sakshi

‘కొండంత అరాచకం

►  పెనుకొండలో శ్రుతి మించిన ‘అధికార’ పార్టీ నేతల ఆగడాలు
►  వారికే వత్తాసు పలుకుతున్న పోలీసులు
►  వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు

పెనుకొండలో అరాచక రాజకీయం రాజ్యమేలుతోంది. ‘అధికారం’ ఉందనే అహంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఖాకీలను ఉసిగొల్పుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తూ.. అవస్థలకు గురి చేస్తున్నారు. న్యాయాన్యాయాలను చూడాల్సిన పోలీసులు కూడా ‘పచ్చ’ నేతలకు ‘జీ హుజూర్‌’ అంటుండడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.

పెనుకొండ : పెనుకొండలో అధికార పార్టీ నేతల ఆగడాలు అధికమయ్యాయి. పచ్చనేతలు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్లుగా మారింది. ముఖ్యంగా చిన్న విషయాలకు కూడా రాజకీయరంగు పులిమి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులే లక్ష్యంగా వారు అరాచకం కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో కుట్ర కేసులు రోజురోజుకూ అధికమవుతున్నాయి. చిన్న విషయాలను సైతం టీడీపీ ముఖ్య నేతలు పెద్దదిగా చేసి బెదిరింపులకు దిగడం మాట వినకపోతే పోలీసులపై ఒత్తిడి పెంచి కేసులు నమోదు చేయించడం రివాజుగా మారిపోయిందనే విమర్శలు నెలకొన్నాయి. ప్రశాంతంగా ఉన్న పెనుకొండ ప్రాంతంలో అక్రమ కేసుల తతంగం చర్చనీయాంశంగా మారింది.   
     

సోమందేపల్లి మండలం కొనతట్టుపల్లికి చెందిన నరేంద్రరెడ్డిపై టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే పలువురు ముఖ్య టీడీపి నాయకులు పోలీసులపై ఒత్తిడి పెంచి అక్రమ కేసు నమోదు చేయించారని విమర్శలు ఉన్నాయి. డ్వాక్రా సంఘం విషయమై జరిగిన వివాదం చిన్నదే అయినా దానికి రాజకీయరంగు పులిమి కేసు నమోదు చేయించారన్న విమర్శలు ఉన్నాయి. అలాగే  సోమందేపల్లి మండలం చల్లాపల్లికి చెందిన సత్యనారాయణరెడ్డి, అంజినరెడ్డిపై బలమైన  కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఇక అదే మండలం పోలేపల్లిలో వైఎసార్‌ సీపీ సానుభూతిపరులు  ఓబుళనరసింహులు, నరశింహప్ప, రామకష్ణ, చక్కిరప్పపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ  కేసులు నమోదు చేశారు. ఈ కేసుల వెనుక అధికార పార్టీ ప్రజా ప్రతినిధి ముఖ్య భూమిక పోషించినట్లు విమర్శలున్నాయి.


అలాగే పెనుకొండ మండలం శెట్టిపల్లి సర్పంచ్‌ చలపతిపై టీyీ పీ ముఖ్య నాయకుడు పోలీసుల ద్వారా తీవ్ర ఒత్తిడి పెట్టి ఇబ్బంది కలిగించినట్లు వైఎసార్‌ సీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురైనట్లు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.  ఇక ఐదు రోజుల క్రితం పరిగి మండలం పైడేటి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య స్వల్ప  ఘర్షణ జరగ్గా పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చిన ప్రముఖ ప్రజా ప్రతినిధి వైఎస్సార్‌ సీపీ శ్రేణులకు  భారీగా కౌన్సిలింగ్‌ ఇవ్వాలని పట్టుబట్టడమే కాక రమణ అనే నాయకుడికి లాఠీ పంచ్‌ చూపాలని, కౌన్సిలింగ్‌ ఇచ్చిన విధానం వెంటనే తనకు వాట్సాప్‌ ద్వారా పంపాలని హిందూపురం పోలీస్‌ అధికారిని కోరినట్లు వైఎసార్‌ సీపీ శ్రేణులు  పేర్కొంటున్నారు. రాజకీయ ఒత్తిడితో టీడీపి శ్రేణులకు మాత్రం చిన్న కేసుతో సరిపెట్టుకున్న పోలీసులు వైఎస్సార్‌ సీపీ శ్రేణులను పూర్తీ స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పైడేటి ఘర్షణలో పలువురు వైఎసార్‌ సీపీ శ్రేణుల్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు టీడీపీ శ్రేణులపై మాత్రం ఏ చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.  

అక్రమ కేసులు ఆపకపోతే ప్రైవేట్‌ కేసులు తప్పవు : మాలగుండ్ల శంకరనారాయణ, వైఎస్సార్‌ సీపీ, జిల్లా అధ్యక్షుడు   
వైఎసార్‌ సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఎమ్మెల్యే బీకే.పార్థసారథి, మరి కొందరు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. పరిగి మండలం మండలం పైడేటిలో ఐదురోజుల క్రితం వినాయక చవితి సందర్భంగా జరిగిన ఘర్షణలో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ నేపథ్యంలో శంకరనారాయణ బుధవారం సబ్‌జైల్లో పార్టీ శ్రేణుల్ని కలిసి వారితో చర్చించారు. రమణ, చిరంజీవి తదితరులందరికీ పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని భయపడవద్దని అన్నారు. ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని వారికి అభయమిచ్చారు. 


అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ‘ పెనుకొండ నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొందని ప్రజలు భావిస్తున్న తరుణంలో ఇలాంటి కుట్ర కేసులు ఏ మేరకు న్యాయం. రాజకీయం కోసం అమాయకులను బలి చేయడం సమంజసం కాదు. ఇలాంటి చర్యలను ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీశ్రేణులు  ఆపకపోతే న్యాయ పోరాటానికి పార్టీ తరపున సిద్ధమవుతాం.

అవసరమైతే ప్రైవేట్‌ కేసుల ద్వారా ఎదుర్కోవడానికి వెనుకాడబోమ’ని అన్నారు. ఆయన వెంట పార్టీ మండల కన్వీనర్‌ శ్రీకాంతరెడ్డి, సర్పంచ్‌ సుధాకరరెడ్డి, ఎంపీటీ సీ రామ్మోహన్‌రెడ్డి, రాష్ట్ర లీగల్‌ సెల్‌ కార్యదర్శి భాస్కరరెడ్డి, మాజీ మార్కెట్‌యార్డ్‌ చైర్మన్‌ నాగలూరుబాబు, వైశాలి జయశంకరరెడ్డి, కొండలరాయుడు, పరిగి మండల నాయకులు, పైడేటి గ్రామస్తులు ఉన్నారు. కాగా..  రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులను కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ కేటీ.శ్రీధర్, డీసీసీ ఉపాధ్యక్షుడు గుట్టూరు చినవెంకటరాముడు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement