ఆలయాల్లోనూ ‘అధికార’ పెత్తనం
- ఎమ్మెల్యే అండతో చెలరేగిపోతున్న కాశీవిశ్వేశ్వర ఆలయ కమిటీ సభ్యులు
- నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల తొలగింపు
- పోరు భరించలేకపోతున్న ఈవో
అనంతపురం న్యూటౌన్ : ఆలయాల నిర్వహణలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుంటున్నారు. వీరి కారణంగా ఉద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అనంతపురం మొదటిరోడ్డులోని శ్రీ కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడం వివాదాస్పదమవుతోంది. ఆరు నెలల కిందట ఈ ఆలయ కమిటీని నియమించారు. అభివృద్ధి కోసమంటూ వచ్చిన కమిటీ సభ్యులు అందుకు భిన్నంగా ఉద్యోగులపై పెత్తనం చేస్తున్నారు. ఇక్కడ పదేళ్ల నుంచి పనిచేస్తున్న ప్రధాన అర్చకులు ఇంద్రగంటి ప్రసాదశర్మ, కాంట్రాక్టు ఉద్యోగి (క్లర్కు) సురేష్‌లను తొలగించడం, ఈవోతోనూ ఘర్షణకు దిగడం వివాదాస్పదమైంది. కమిటీ సభ్యులు పెత్తనం చేస్తున్నారంటూ ఆలయ సిబ్బంది మొదట్నుంచీ వాపోతోంది.
‘ఇక నీవు వెళ్లిపోవచ్చు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వేరే వాళ్లను నీ స్థానంలో పంపార’ంటూ తనకు షాక్ ఇచ్చారని క్లర్కు సురేష్ వాపోయారు. దీంతో ఆయన వారం క్రితం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. పంతానికి పోతున్న కమిటీ సభ్యులు కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ప్రధాన అర్చకులు ఇంద్రగంటి ప్రసాదశర్మ , క్లర్కు సురేష్‌లను అసభ్య ప్రవర్తన, అవినీతి ఆరోపణల వల్ల ఎమ్మెల్యే అనుమతితోనే తీసేశామని, మళ్లీ విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) నాగేంద్రరావును అడిగితే కమిటీ సభ్యులు మహా అయితే రెండేళ్లుంటారని, కోర్టు ఆదేశాలను ఖాతరు చేయకపోతే తన ఉద్యోగానికే ప్రమాదం వస్తుందని అంటున్నారు. దీంతో ఆయన కమిటీ తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే అండ చూసుకుని కమిటీ సభ్యులు ససేమిరా అన్నారు. ఈ విషయాన్ని ఈవో కర్నూలులోని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తాను కమిటీ పోరు భరించలేకపోతున్నానని, బదిలీ చేయాలని లేదంటూ దీర్ఘకాలిక సెలవులో వెళ్లడానికి అనుమతించాలని కోరారు.
ఆలయ చైర్మన్ మెతకవైఖరి
వాస్తవానికి ఆలయ కమిటీ చైర్మన్ నేతృత్వంలో నడుస్తుంది. కానీ ఇక్కడ చైర్మన్‌గా ఉన్న సంధ్యామూర్తి ఆలయ కమిటీ సభ్యుల ప్రవర్తనను వ్యతిరేకిస్తున్నప్పటికీ వారిని గాడిలో మాత్రం పెట్టలేకపోతున్నారు. సిబ్బంది తొలగింపును వ్యతిరేకిస్తూ తాను సంతకం పెట్టనని మొరాయించిన ఆమె.. అలాగని బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎమ్మెల్యే తనను చైర్మన్‌గా ఉండాలంటున్నారన్న నెపంతో కొనసాగుతున్నారు. ఆమె మెతకవైఖరి కారణంగా కమిటీ సభ్యులు మరింత రెచ్చిపోతున్నారు. ఇది ఆలయ నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఆలయ నిర్వహణలో రాజకీయాలను చొప్పించడంపై భక్తులు మండిపడుతున్నారు.