– మీరు కుట్టించిన దుస్తులు ఎలా ఇస్తారో చూస్తా?
– అధికారులపై ధర్మవరం నియోజకవర్గ అధికార పార్టీ ముఖ్య నేత ఒత్తిడి
– గతేడాది ముదిగుబ్బ మండల విద్యార్థులకు అందని యూనిఫాం
– నేటికీ జిల్లా కేంద్రంలో మూలుగుతున్న యూనిఫాం
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘నా నియోజకవర్గంలో నేను చెప్పిన వాళ్లకు కాకుండా ఎవరికో కుట్టు పని ఇస్తానంటే నేనెలా ఒప్పుకుంటా. మీ ఇష్టానుసారమా? మీరు కుట్టించి పంపిస్తే మావాళ్లు తీసుకోవాలా? ఎలా ఇస్తారో చూస్తా’ ఇదీ ధర్మవరం నియోజకవర్గ ముఖ్యనేత.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంకు సంబం«ధించి అధికారులపై చేసిన ఒత్తిడి. ఫలితంగా 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు యూనిఫాం పంపిణీ చేసినా ముదిగుబ్బ మండలానికి ఆగిపోయింది. అధికారులు స్వయంగా సదరు నేతను కలిసి ప్రాథేయపడినా దుస్తులు తీసుకునేందుకు ససేమిరా అన్నట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకే ముదిగుబ్బ ఎంఈఓ.. జిల్లా కేంద్రం నుంచి వచ్చిన దుస్తులను తీసుకోకుండా వెనక్కు పంపారు. మండలంలో దాదాపు 80 స్కూళ్లలోని 6,900 మంది విద్యార్థులకు గానూ కేవలం ఏడు స్కూళ్లకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేశారు. తక్కిన విద్యార్థులు ఏడాదిగా యూనిఫాం కోసం ఎదురు చూస్తున్నారు.
తనవారికి ‘కుట్టు’ బాధ్యతలివ్వలేదనే...
ప్రతిసారి సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలోనే యూనిఫాం కుట్టు బాధ్యతలు అప్పగించేవారు. అయితే గతేడాది రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు ఆప్కో అధికారులే క్లాత్ సరఫరాతో పాటు కుట్టించి దుస్తులు సరఫరా చేశారు. అయితే ధర్మవరం నేత.. తన అనుచరులకు కుట్టు బాధ్యతలివ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. తమ చేతుల్లో లేదని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కోవారే చూస్తున్నారని విన్నవించారు. అయినా ఆయన వినలేదు.
దుస్తులు తీసుకోకుండా వెనక్కు : కుట్టించిన దుస్తులను జిల్లా కేంద్రం నుంచి ముదిగుబ్బకు తీసుకెళ్తే అక్కడి ఎంఈఓ తీసుకునేందుకు ఒప్పుకోలేదు. తాను దుస్తుల్ని తీసుకోలేనని సదరు ప్రజాప్రతినిధిని కలవాలంటూ సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో అధికారులు వెళ్లి నేతను కలిసినా...తనవారికి కాకుండా ఎవరికో కుట్టు పనులిస్తే ఎలా ఒప్పుకుంటానని గట్టిగా చెప్పారు. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దుస్తులు తీసుకోరని స్పష్టం చేశారు. దీంతో అధికారులు ఆయన్ను ఒప్పించలేక వెనుతిరిగారు. ఏది ఏమైనా ఆయన నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ఏడాదిపాటు యూనిఫాం లేకుండా పోయింది. మరి ఈసారి కూడా ఎలా చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరం.
మళ్లీ మాట్లాడతా..
దీనిపై ఆప్కో మేనేజర్ గురుప్రసాద్‌ను వివరణ కోరగా ముదిగుబ్బ మండలానికి సంబంధించి యూనిఫాం ఇంకా సరఫరా చేయలేదని అక్కడ ‘ప్రత్యేక సమస్య’ నెలకొందంటూ దాట వేశారు. తక్కిన విషయాలను మళ్లీ మాట్లాడతానంటూ చెప్పుకొచ్చారు. ఎస్‌ఎస్‌ఏ అధికారులను వివరణ కోరగా ‘‘ముదిగుబ్బ మండలానికి సంబంధించిన దుస్తులు తీసుకోకుండా ఎంఈఓకు వెనక్కు పంపారు. ఓ నేతను కలవాలని చెప్పారు. ఆయనేమో ఒప్పుకోలేదు. దుస్తులు వెనక్కు తీసుకొచ్చాం. ఆ దుస్తులకు సంబంధించిన డబ్బులు కూడా అప్కోకు చెల్లించలేదు.’ అన్నారు.
నేను చెప్పినా కుట్టు పని ఇవ్వరా !
Published Sat, Jun 24 2017 11:34 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement