మాచర్ల: పార్టీలో విబేధాలు ఉన్న మాట వాస్తవమేనని, మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీదేవి కుటుంబానికి న్యాయం చేస్తామని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన ఆదివారం పట్టణంలోని 15వ వార్డులో ఉన్న చైర్‌పర్సన్ శ్రీదేవి ఇంటికి విచ్ఛేసి శ్రీదేవిని, భర్త మల్లిఖార్జునరావు తండ్రి బ్రహ్మయ్య, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
'నా భర్త చనిపోయే వరకు ఇబ్బందులు పెట్టారు'
Published Mon, Jul 25 2016 7:17 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
'నా కుటుంబాన్ని రాజకీయాలలోకి దించి నా భర్త చనిపోయే వరకు ఇబ్బందులు పెట్టారు. నా భవిష్యత్తేమిటో తేల్చండి.. అప్పుల పాలై అండదండలు లేక అల్లాడిపోయే విధంగా మా కుటుంబాన్ని పార్టీ నాయకులే రోడ్డుపాల్జేశారు. న్యాయం చేయాలి' అంటూ పరామర్శకు వచ్చిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ముందు శ్రీదేవి బోరున విలపించారు.
'మా కుటుంబానికి రాజకీయాలు తెలియవు, మీరు తప్పితే ఎవరూ గెలవరని చెప్పి మమ్మల్ని రంగంలోకి దింపి ప్రతిరోజూ వేధించి నా భర్త మానసిక ఒత్తిడికి గురై మృతిచెందేలా చేశారు. అప్పులపాలైన మేము ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులలో, ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నాం' శ్రీదేవి, బ్రహ్మయ్య ఆయన కుమారుడు సుబ్బారావు తెలిపారు. రెండేళ్లుగా పార్టీ నాయకులు ఏ విధంగా వేధించి ఎటువంటి అనారోగ్యం లేని మల్లిఖార్జునరావు మృతిచెందే వరకు బాధించిన విషయాన్ని కన్నీటితో యరపతినేనికి వివరించారు.
దీనికి స్పందించిన యరపతినేని మాట్లాడుతూ రాజకీయాలలో ఆటుపోట్లుంటాయి, మానసిక ఒత్తిడితో మల్లిఖార్జునరావు మృతిచెందడం దురదృష్టకరం అన్నారు. కుటుంబానికి న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాం. వ్యక్తిగతంగా తీవ్రంగా నష్టపోయిన చైర్‌పర్సన్ కుటుంబానికి న్యాయం చేసేందుకు నా వంతుగా కృషి చేస్తాను. అధిష్టానంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చైర్‌పర్సన్ కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మాజీ ఎమ్మెల్యే కుర్రి పున్నారెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చలమారెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ యాగంటి మల్లిఖార్జునరావు, నాయకులు రంగా సత్యం, మాజీ ఎంపీపీ సానికొమ్ము పుల్లారెడ్డి, నాయకులు పలువురు పాల్గొన్నారు.
Advertisement
Advertisement