పెద్దల పేకాట అడ్డా | tdp leaders gambling in masineni grand hotel | Sakshi
Sakshi News home page

పెద్దల పేకాట అడ్డా

Published Sun, Sep 3 2017 9:57 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

పెద్దల పేకాట అడ్డా - Sakshi

పెద్దల పేకాట అడ్డా

– ప్రతి రోజూ రూ.లక్షల్లో ఆట
– పెద్దల ఆటకు ‘రిక్రియేషన్‌’ ముసుగు
– ఓటమి పాలై.. అప్పుల పాలై.. చివరకు ఆత్మహత్య పాలై..


అనంతపురంలోని ప్రముఖ త్రీస్టార్‌ హోటల్‌ ‘మాసినేని గ్రాండ్‌’లో శనివారం ఒకేసారి 48 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్‌ చేసి, వారి నుంచి రూ5.63 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఎస్పీ అశోక్‌కుమార్‌కు ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. పెద్దల పేకాట అడ్డాలపైనా ఎస్పీ దృష్టి సారించాలని అదే జనం కోరుతున్నారు.

కదిరి: కదిరి పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో కమ్యూనిటీ రిక్రియేషన్‌ సెంటర్‌ (సీఆర్సీ) అని గోడపై పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది. కానీ లోనికెళ్లి చూస్తే రిక్రియేషన్‌ ఏమాత్రం కన్పించదు. ఇది ఎంతోమంది పేద్దోళ్లకు పేకాట అడ్డా. వాస్తవంగా ఇక్కడ క్యారమ్స్, టేబుల్‌ టెన్నిస్, చెస్‌ లాంటి ఆటలు మాత్రమే ఆడుకునేందుకు రిజిస్ట్రేషన్‌ (నంబర్‌ 28/1967) చేసుకున్నారు. మొదట్లో నిబంధనల ప్రకారమే నడిచింది. తర్వాత పేకాటకే పెద్ద పీట వేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఆటకూ ఒక్కొక్కరు రూ.2 వేలు చొప్పున ఆడుతున్నారు. అంటే అక్కడ రోజూ రూ.లక్షల్లో ఆట జరుగుతోంది. ఇక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయిన ఎన్నో కుటుంబాలు ఇప్పటికే బజారున పడ్డాయి. కొందరైతే ఎవరికీ చెప్పుకోలేక అప్పుల పాలై.. ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. ఇంకొన్ని కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి.

గానా..బజానా కూడా:
ఇక్కడ అప్పుడప్పుడు వివిధ ప్రాంతాల నుంచి యువతులను పిలిపించి గానా బజానా కూడా పెడుతుంటారు. దీన్ని చూసి గతంలో పట్టణ ఎస్‌ఐ దివాకర్‌రెడ్డి ఉత్సాహం ఆపుకోలేక స్టెప్పులు కూడా వేశారు. అది తెలిసి అప్పటి ఎస్పీ  ఆయనపై సస్పెన్షన్‌ వేటు కూడా వేశారు. ఈ సీఆర్సీని ఆనుకునే అమ్మాయిల హాస్టల్‌ ఉంది. అవేమీ పట్టించుకోకుండా క్లబ్‌లో బార్‌ను తలపించేలా మందు కొడుతూ ‘మందబాబులం మేము మందుబాబులం’అంటూ చిందులేస్తుంటారు. ‘మందుబాబుల గోల భరించలేక పోతున్నాం బాబోయ్‌’ అంటూ అమ్మాయిలు పలుమార్లు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు.

ఆత్మహత్యలు మచ్చుకు కొన్ని..
అప్పులు చేసి తీసుకొచ్చిన డబ్బంతా సీఆర్సీలో పేకాటలో పోగొట్టుకొని పట్టణానికి చెందిన వెంకటేష్, మరోవ్యక్తి రాజారెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం కదిరి ప్రాంత వాసులందరికీ తెలుసు. ఎల్‌ఐసీ ఉద్యోగి రామాంజులురెడ్డి సీఆర్‌సీలో లక్షలాది రూపాయలు నష్టపోయాడు. ఇక బజారున పడడం ఖాయమని ‘మహాప్రభో ఆ క్లబ్‌ను మూయించండి. లేదంటే మేమే ఎక్కడికైనా వెళ్లిపోతాము’ అంటూ ఆయన భార్య అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తే కొద్దిరోజులు మాత్రం మూసివేశారు. ఆ తర్వాత మళ్లీ తలుపులు తెరుచుకున్నాయి. ఇక చేసేదిలేక ఆ కుటుంబం హైదరాబాద్‌కు మకాం మార్చేసింది.

గొడవలు ఎన్నో..
సీఆర్‌సీలో మద్యం తాగి పేకాట ఆడుతూ సభ్యుల మధ్య గొడవలు జరిగిన ఘటనలు కోకొల్లలు. ఇలాంటి వాటిపై పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఒకప్పుడు రిక్రియేషన్‌ సెంటర్‌లో (సీఆర్సీ)లో ప్రొఫెషనల్స్, అఫిషియల్స్, సమాజంలో ప్రత్యేక గౌరవం ఉన్న వ్యక్తులకు మాత్రమే సభ్యత్వం ఇచ్చేవారు. కానీ ఇప్పుడలాంటిదేమీ లేదు. రూ.10 వేలు చెల్లిస్తే సభ్యత్వం ఇచ్చేస్తున్నారని కొందరు సభ్యులే చెబుతున్నారు.

ఖాతాపై ఆరా తీస్తే సరి
క్లబ్‌ నిర్వహణ పేరుతో ప్రతి ఆటకు కొంత డబ్బు పక్కన బెడుతుంటారు. ఆట ముగియగానే అక్కడ ప్రత్యేకంగా నియమించిన బాయ్స్‌ ఆ డబ్బును కలెక్ట్‌ చేసి క్లబ్‌ కోశాధికారి (ట్రెజరర్‌)కి అందజేస్తారు. ఆ డబ్బును ఆయన పట్టణంలోని వివిధ బ్యాంకుల్లో క్లబ్‌ పేరుమీద ఉన్న ఖాతాల్లో జమ చేస్తుంటారు. ఇలా ఏడాదికి రూ.5 లక్షలకు పైగా క్లబ్‌ ఖాతాలో జమ అవుతోందంటే అక్కడ ఏ మేరకు ఆట జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చు. ఈ డబ్బుతో ప్రతి సంవత్సరం క్లబ్‌ సభ్యులందరూ 5 రోజులు పాటు గోవా లాంటి విహార యాత్రలకు వెళ్తొస్తారు. పత్రికల్లోనూ, టీవీల్లోనూ సీఆర్సీ క్లబ్‌కు వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఉండేందుకు మీడియా ప్రతినిధులను సైతం ఇందులో గౌరవసభ్యులుగా చేర్చారు. ఆ హోదాలో వారిని కూడా ప్రతి సంవత్సరం ఉచితంగా ఈ విహార యాత్రకు తీసుకెళ్తారు.

ఎస్పీ మాటలు బేఖాతరు
ఇక్కడ పేకాట పెద్ద మొత్తంలో జరుగుతోందన్న విషయం ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్పీ రాజశేఖరబాబు దృష్టికి పాత్రికేయులు కొందరు తీసుకెళ్తే ‘వెంటనే ఆ క్లబ్‌లో సీసీ కెమెరాలు అమర్చి అక్కడ ఏం జరుగుతోందో వాటిని పట్టణ పోలీస్‌ స్టేషన్‌నుంచి పరిశీలించండి’ అని కదిరి పోలీసులను ఆదేశించారు. కానీ ఇప్పటిదాకా ఆచరణకు నోచుకోలేదు. మరి ప్రస్తుత ఎస్పీ అశోక్‌కుమార్‌ ఏం చేస్తారో చూడాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement