తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
జిల్లాలో కనీవినీ ఎరుగని రీతిలో ఇసుక దందా, భూకబ్జాలు
సిఫార్సులతో టెండర్లు దక్కించుకుంటున్న అక్రమార్కులు
నిలువరించలేని నిస్సహాయ స్థితిలో పోలీసులు, యంత్రాంగం
టీడీపీ నేతల దురాగతాలను నిలువరించలేని దుస్థితిలో అధికార యంత్రాంగం కూరుకుపోతోంది.. పెచ్చరిల్లుతున్నభూ దందాలు, సివిల్ సెటిల్‌మెంట్లు, ఇసుక రీచ్ అక్రమాలతో అధికారుల తలలు బొప్పికడుతున్నాయి..ప్రభుత్వ శాఖలు నిర్వహించే టెండర్లలోనూ తెలుగు తమ్ముళ్లు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో అధికారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఎవరికీ చెప్పుకోలేక.. బయటపెట్టలేక మల్లాగుల్లాలు పడుతున్నారు. కొంతమంది ఇక్కడి నుంచి బదిలీ చేయించుకోవాలనే నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అన్యాయానికి, దోపిడీకి గురైన బాధితులు టీడీపీ నేతల అక్రమాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, వారికి సహకారం అందించిన అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లే శిరోభారంగా ఉంటే.. మరోవైపు కోర్టుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పరిస్థితులు దాపురించాయని అధికారులు వాపోతున్నారు.
గుంటూరు/ విజయవాడ: జిల్లాలోని తెనాలి, పొన్నూరు, సత్తెనపల్లి, గురజాల, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నేతలు భూ దందాలు, సివిల్ సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు బాహాటంగా వినపడుతున్నాయి. రాత్రికి రాత్రి పంట పొలాలు, స్థలాలు కబ్జా చేయడం, అడ్డువచ్చిన వారిపై దౌర్జన్యం చేయడం వంటి సంఘటనలు తరుచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన బాధితులు తమకు జరిగిన నష్టాన్ని జిల్లా యంత్రాంగానికి వివరించినా, ఫలితం ఉండటం లేదు. వెంటనే విచారణ జరిపిస్తామని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీలు ఇస్తున్నారే తప్ప ఆచరణలో మాత్రంచూపడం లేదు. దీంతో అధికారులకు ఫిర్యాదు చేయడం కంటే న్యాయస్థానాలను ఆశ్రయించడమే మేలనే అభిప్రాయానికి బాధితులు వస్తున్నారు.
ఆగడాలు.. అరాచకాలివీ..
ముసునురు మండలంలో తమ్మిలేరులో ఇసుకను అక్రమంగా తరలించడానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో ప్రయాత్నించగా స్థానిక తహశీల్దార్ వనజాక్షి సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. అయితే ఎమ్మెల్యే, అతని అనుచరులు తహశీల్దార్‌పై దాడిచేశారు. ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి విలేకరిపై కూడా దాడి జరిగింది. కైకలూరు అటపాక పక్షుల కేంద్రం నుంచి పశ్చిమ గోదావరి కోమటిలంక వరకు ఉన్న కోల్లేరు చెరువు గట్టుపై చింతమనేని రబ్బిస్‌తో చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీ శాఖాధికారులపై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. వార్తను కవర్ చేయడానికి వెళ్లిన విలేకరులను బెదిరించారు. పొన్నూరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని కొన్ని గ్రామాల ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించలేదు.
సత్తెనపల్లి నియోజకవర్గం దూళిపాళ్లలోని 17 ఎకరాల వ్యవసాయ భూమి దురాక్రమణలో టీడీపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు బాహాటంగా వినపడటమే కాకుండా కోళ్ల ఫారాలను కూల్చివేసి శాంతి భద్రతలకు భంగం కలిగించే రీతిలో వ్యవహరించినా, పోలీస్ యంత్రాంగం ప్రేక్షకపాత్రే వహించింది.. ఈ ఘటనకు ఐదారు గంటల ముందు వైఎస్సార్‌కాంగ్రెస్ నేతలు మర్రి రాజశేఖర్, అంబటి రాంబాబు, అన్నాబత్తుని శివకుమార్ అక్కడి పరిస్థితులను వివరించి, శాంతి భద్రతలు కాపాడాలని రూరల్ ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే కోళ్ల ఫారాల కూల్చివేతను నిలువరించే అవకాశం ఉండేది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ నేతలు నియమించిన ప్రైవేటు సైన్యం ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు సృష్టించారు. ఘటన జరిగి రెండు రోజులు కావొస్తున్నా నిందితులను ఇంత వరకు గుర్తించలేకపోయింది.
గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించినా అక్రమ మైనింగ్ కొనసాగుతూనే ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోవడంతో కొందరు వ్యాపారులు అక్కడి క్వారీలను వదిలేసి ఇతర ప్రాంతాల్లో వ్యాపారం చేసుకుంటున్నారు.
‘కలం’పైనా దాడి..
చిలకలూరిపేట నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను పత్రికాముఖంగా బయటపెడుతున్నాడనే అక్కసుతో అక్కడి ‘సాక్షి’ విలేకరి మానుకొండ సురేంద్రపై వారం రోజుల క్రితం కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. దాడి వెనుక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి తేనే వెంకాయమ్మ ఉన్నారని సదరు విలేకరి యడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి, ఆయన సతీమణి పేర్లను తీసివేస్తేనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామంటూ అక్కడి పోలీసులు మంత్రికి మద్దతు పలకడం కొసమెరుపు. జర్నలిస్టు సంఘాలు విలేకరికి మద్దతుగా నిలవడంతో ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లను నమోదు చేశారు. రాజధాని నేపథ్యంలో గుంటూరు రూరల్ పరిధిలోని నివేశన స్థలాలకు డిమాండ్ ఏర్పడటంతో పలువురు టీడీపీ నేతలు స్థలాల అక్రమణలు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం పరిపాటిగా మారింది. బాధితులు వీరిపై ఫిర్యాదు చేసినా, సివిల్ కేసుల విషయంలో మా జోక్యం ఉండదని, న్యాయస్ధానాన్ని ఆశ్రయించాలనే చిన్నపాటి సలహా ఇచ్చి అక్రమణదారులకు మద్దతుగా నిలుస్తున్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల టెండర్లనూ టీడీపీ నేతలే దక్కించుకుంటున్నారు. రూ.10 లక్షల విలువ చేసే పనులను నామినేషన్‌పై ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడంతో వాటిని సిఫారసులతో కార్యకర్తలు దక్కించుకుంటున్నారు. దీనితో కంట్రాక్టర్లకు పనులు లభించక ఇబ్బందులు పడుతున్నారు.