పేదల బతుకులపై.. పచ్చ మేడలు | TDP Leaders hulchul in ongole | Sakshi
Sakshi News home page

పేదల బతుకులపై.. పచ్చ మేడలు

Published Wed, Jun 15 2016 8:37 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

TDP Leaders hulchul in ongole

  • టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కు
  • బండ్లమిట్టలో దుకాణాల కూల్చివేత
  • 30 ఏళ్లుగా అక్కడే ఉంటున్న పేదలు
  • టీడీపీ కార్యాలయం కోసమా..? బోటు షికారు వ్యాపారం కోసమా..?
  • అప్పట్లో పట్టాలిచ్చిన కరణం  
  • బలరాంను దోషిగా చూపేందుకు దామచర్ల వ్యూహం
  • అధికార పార్టీ నేతల దుకాణాలు, ఇళ్ల జోలికి వెళ్లని అధికారులు
  • మైనారిటీల బతుకులు ఛిద్రం చేయడంపై సర్వత్రా విమర్శలు
  •  
     సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కయ్యారు. స్వలాభాపేక్షతో దారుణానికి ఒడిగట్టారు. 30 ఏళ్లుగా నగరంలోని బండ్లమిట్ట ప్రాంతంలో ఇళ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకొని బతుకుసాగదీస్తున్న పేదల ఇళ్లపై వారి కన్ను పడింది. నగరం నడిబొడ్డున విలువైన స్థలం, దాన్ని చేజిక్కించుకుంటే కోట్లు వచ్చి పడినట్లే.

    అంతే..! అధికారులను అడ్డుపెట్టి పేద ముస్లింల చిరు దుకాణాలను మంగళవారం కూల్చివేశారు. అక్కడున్న మసీదును కూల్చటానికి కూడా వెనుకాడలేదు. స్థానికులు గొడవకు దిగకుండా పోలీసులను అడ్డుపెట్టారు. వారు కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా... అటు కార్పొరేషన్ అధికారులు, ఇటు పోలీసులు చలించలేదు. అన్నీ పీకి వారి బతుకులను రోడ్డున పడవేశారు. బండ్లమిట్ట కూల్చివేత వెనుక పచ్చ నేతల స్వలాభాపేక్ష కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
     
      స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకు నగరం నడిబొడ్డున ఉన్న ఊరచెరువును ఆధునీకరించి బోటింగ్, పార్కింగ్ ఏర్పాటు చేయాలని కార్పోరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. బోటింగ్ పార్కింగ్ మెయింటెనెన్స్ బాధ్యతను దామచర్ల తమ అనుచరులకు ఇప్పించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం ఉంది. చెరువు ఈశాన్యంలో ప్రధాన గేటు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడ గత 30 ఏళ్ల నుంచి ఉన్న దుకాణాలను తొలగించాలని నిర్ణయించారు. అది వివాదం కాకుండా ఉండేందుకు ఆక్రమణలు, నకిలీ పట్టాలు అంటూ అధికారులతో ప్రచారం చేయించారు. చివరకు మంగళవారం పేదల ఇళ్లు, దుకాణాలను కూలగొట్టారు.
     
      ఆక్రమిత స్థలంలో టీడీపీ కార్యాలయం నిర్మించి సొంత లాభం వ్యవహారాన్ని కప్పి పుచ్చుకునేందుకు, అధిష్టానం మద్ధతు పొందేందుకు అధికార పార్టీ స్థానిక ముఖ్యనేత వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఆక్రమిత స్థలాన్ని టీడీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  
     
      గతంలో కరణం బలరామకృష్ణమూర్తి ఎంపీగా ఉన్నప్పుడు పేద ముస్లింలు, మిగిలిన వర్గాలకు అప్పటి మున్సిపాలిటీ స్థలాన్ని పట్టాలుగా ఇచ్చినట్లు సమాచారం. ఆ స్థలాల్లోనే పేదలు అధిక శాతం దుకాణాలు ఏర్పాటు చేసుకొని బ్రతుకు సాగదీస్తుండగా కొందరు చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం అటు కరణం... ఇటు ఎమ్మెల్యే దామచర్ల వర్గాల మధ్య విభేదాలున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో కరణం పేదలకిచ్చిన స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని తన అధిపత్యాన్ని చాటుకునేందుకు దామచర్ల వర్గం ప్రయత్నిస్తోందని, అందులో భాగంగానే కార్పోరేషన్ అధికారులను అడ్డుపెట్టి స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
     
      మరో వైపు ప్రస్తుతం కూలగొట్టిన దుకాణాలన్నీ 90 శాతంపైగా ముస్లిం పేదలవే. మిగిలిన వారు కాపులున్నారు. ముస్లింలు వైఎస్సార్ సీపీకి మద్ధతు పలికారన్న అక్కాసుతో పాటు తాజాగా కాపులు ముద్రగడకు మద్ధతు పలుకుతున్నారన్న అక్కసుతోనే అధికార పార్టీ నేతలు దుకాణాలను కూలగొట్టేందుకు సాహసించినట్లు తెలుస్తోంది.
     
      అధికార పార్టీ 14/1లో గతంలో పదుల ఎకరాల్లో విలువైన కార్పొరేషన్ స్థలం ఉంది. ఇప్పటికే ఆ స్థలంలో 90 శాతాన్ని ఆక్రమించి ఇళ్ల కట్టుకున్నారు. బండ్లమిట్ట ప్రాంతంలోనూ ఆక్రమిత స్థలాల్లో పెద్ద ఎత్తున దుకాణాలను నిర్మించారు. మంగళవారం అధికారులు అధికార పార్టీ నేతల ఇళ్లు, దుకాణాల జోలికి వెళ్లకుండా పేదలు నిర్మించుకున్న దుకాణాలను మాత్రమే కూల్చివేయటం గమనార్హం.
     
      నగరంలో పెద్ద ఎత్తున ఆక్రమణలు, అక్రమ కట్టడాలున్నాయి. అధికార పార్టీ నేతల అండతో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అద్దంకి బస్టాండ్ సమీపంలో ఓ కాంప్లెక్స్ అక్రమంగా నిర్మిస్తున్నా... అధికార పార్టీ ముఖ్య నేత, కార్పోరేషన్ అధికారులు లక్షల్లో ముడుపులు తీసుకొని పట్టించుకోలేదు. గుంటూరు రోడ్డులో భూ బదలాయింపు లేకుండానే అధికార పార్టీ నేత అండతో ఓ భారీ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించినా.. అధికారులు ముడుపులు తీసుకొని మిన్నకుండిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో అక్రమ కట్టడాలు కొకోల్లలు. అయినా అధికారులు వారి జోలికి వెళ్లలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement