ఇద్దరికి ముగ్గురయ్యారు..!
ఇంద్రకీలాద్రిపై పట్టు కోసం దేశం నేతల యత్నాలు
ఈవో మింగుడు పడకపోతే సాగనంపాలనే ఆలోచన
తమకు అనుకూలంగా ఉన్న వారిని తెచ్చుకోవాలని ప్లాన్
విజయవాడ : అది పవ్రితమైన ప్రదేశం. అక్కడకు వెళ్లితే శక్తి మేర కానుకలు సమర్పిస్తామేగానీ వేరే ఆలోచనంటూ ఉండదు. ఇదంతా సాధారణ భక్తుల దృష్టిలో ఇంద్రకీలాద్రి పైనా, దుర్గగుడి పైన ఉన్న నమ్మకం. కానీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రం దేవాలయం డబ్బులు సంపాదించి పెట్టే ప్రధాన వనరు.. తమ అనుచర గణానికి పునరావాస కేంద్రం..ఇప్పటి వరకు ఇద్దరు ప్రజాప్రతినిధులు దుర్గగుడిపై పట్టుకోసం ప్రయత్నిస్తుండగా... తాజాగా ఈ ఇద్దరు ముగ్గురయ్యారని ఇంద్రకీలాద్రిపై గుసగుసలు వినిపిస్తున్నాయి.
పూల పాన్పు కాదు..ముళ్ల కిరీటమే!
ప్రస్తుతం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. గతంలో ఈవోగా పని చేసిన ఆజాద్ పాలకవర్గానికే మింగుడు పడలేదు. అటువంటి ఆజాద్‌ను పర్మినెంట్‌గా ఉంచుతారా? లేక పక్షం రోజుల్లో సాగనంపి తమకు అనుకూలంగా ఉండే మరో అధికారిని తెచ్చుకుంటారా? అనేది సందేహం.
గత ఈవో సీహెచ్ నర్సింగరావు లీవు ముగిసి తిరిగి విధుల్లో చేరినప్పటికీ ఆయనను రానీయకుండా దేవస్థానంలో కొంత మంది సిబ్బందిని ఉసిగొల్పుతున్నారు. మరో వైపు దేవాదాయ శాఖలో తమకు అనుకూలంగా ఎవరు ఉంటారనే అంశంపైన ఈ నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నేతల డిమాండ్లు నెరవేర్చాలంటే వచ్చే ఈవోకు తలబొప్పి కట్టడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నారుు.
బీజేపీ నేతలు ఆగ్రహం
ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు సూచించిన వ్యక్తిని పూర్తి కాలం ఈవోగా నియమించొద్దని బీజేపీకి చెందిన సీనియర్ నేతలు దేవాదాయశాఖ మంత్రి పీ మాణిక్యాలరావును కోరినట్లు సమాచారం. వీరితో తమ పార్టీకిగానీ, కార్యకర్తలకుగానీ ఒరిగేదేమీ లేదని, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలిసింది.
పెరిగిన పోటీ
అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు రెండు మూడు దశాబ్దాలుగా కొండపై దుకాణాలు ఉండటమే కాకుండా కాంట్రాక్టర్లతోనూ సంబంధాలు ఉన్నాయి. హాకర్స్ నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వరకు ఈయనతో నిత్యం సంబంధాలు నడుపుతూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై చిరు వ్యాపారిగా జీవనం ప్రారంభించి ప్రస్తుతం టీడీపీ అర్బన్‌లో కీలక స్థాయిలోకి వెళ్లారు. గత ఈవో సీహెచ్ నర్సింగరావు పూర్తిగా మిండుగు పడకపోవడంతో అంతర్గత సమావేశాల్లో ఆయనను మార్చాలంటూ మంత్రులపై ఒత్తిడి తెచ్చారు.
ఇక మరో ప్రజాప్రతినిధి అధికార పార్టీ వాణి జాతీయ స్థాయిలో వినిపించగల నేత. ఈయనా దేవస్థానంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. గత ఈవోకు కొల్లేటి చాంతాడంత డిమాండ్లు లిస్టు ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని పాత ఈవో నెరవేర్చినట్లు ఇంద్రకీలాద్రి వర్గాల సమాచారం. అయినా సంతృప్తి చెందని ఈ ప్రజాప్రతినిధి గత ఈవో సీహెచ్ నర్సింగరావు సెలవుపై వెళ్లినప్పటికీ సస్పెండ్ చేయాలంటూ ఆ శాఖ మంత్రి వద్ద డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు ఈవోకు ఈ ఇద్దరి నేతల నుంచే సెగ తగులుతూ ఉండేది.. ఇప్పుడు మరో ప్రజాప్రతినిధి వీరికి తోడయ్యారు. నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న ఈ నేత తరుచుగా ఈవోను తనకు సహకరించాలని కోరేవారట. అయితే ఈవో చూసీచూడనట్లు వ్యవహరించే వారు. ఇప్పుడు ఈయన అధికార పార్టీ కండువా కప్పుకోవడంతో తన కోర్కెలు చిట్టా విప్పే అవకాశముంది.