Sri Durga Temple
-
అమ్మ సన్నిధిలో అగచాట్లు
విజయవాడ : కష్టాలు తీర్చమ్మా.. కనకదుర్గమ్మా.. అంటూ వచ్చే భక్తులకు అమ్మ సన్నిధిలోనూ కష్టాలు తప్పట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వర్షంలో తడిసి ముద్దయినా కొద్దిసేపు సేదతీరే అవకాశం లేకపోగా, ఎంతసేపైనా నిలబడే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు తడిసి ముద్దవుతున్నారు. ఆలయ ప్రాంగణంలోనే కాదు కనీసం ఆ పరిసరాల్లో కూడా అధికారులు ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయలేదు. చేసేదేమీలేక అమ్మపైనే భారం వేసి వర్షంలోనే తడుస్తూ క్యూలైన్‌కు చేరుకుంటున్నారు. కొండ కిందా ఇదే పరిస్థితి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తొలుత కనకదుర్గానగర్‌లో బస్సుల కోసం వేచి చూస్తూ వర్షంలో తడుస్తున్నారు. ఓం టర్నింగ్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్‌లోని క్యూలైన్‌కు చేరాలన్నా ఎలాంటి షెడ్డూ లేదు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు రాజగోపురం నుంచి బయటకు రావాలన్నా వర్షంలో తడుస్తూ రావాల్సిందే. అధికారులూ.. స్పందించండి రానున్నది వర్షాకాలం కావడంతో ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి తగు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇప్పుడే స్పందించకుంటే కృష్ణా పుష్కరాలు, దసరా ఉత్సవాల సమయంలో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. -
ఇద్దరికి ముగ్గురయ్యారు..!
ఇంద్రకీలాద్రిపై పట్టు కోసం దేశం నేతల యత్నాలు ఈవో మింగుడు పడకపోతే సాగనంపాలనే ఆలోచన తమకు అనుకూలంగా ఉన్న వారిని తెచ్చుకోవాలని ప్లాన్ విజయవాడ : అది పవ్రితమైన ప్రదేశం. అక్కడకు వెళ్లితే శక్తి మేర కానుకలు సమర్పిస్తామేగానీ వేరే ఆలోచనంటూ ఉండదు. ఇదంతా సాధారణ భక్తుల దృష్టిలో ఇంద్రకీలాద్రి పైనా, దుర్గగుడి పైన ఉన్న నమ్మకం. కానీ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మాత్రం దేవాలయం డబ్బులు సంపాదించి పెట్టే ప్రధాన వనరు.. తమ అనుచర గణానికి పునరావాస కేంద్రం..ఇప్పటి వరకు ఇద్దరు ప్రజాప్రతినిధులు దుర్గగుడిపై పట్టుకోసం ప్రయత్నిస్తుండగా... తాజాగా ఈ ఇద్దరు ముగ్గురయ్యారని ఇంద్రకీలాద్రిపై గుసగుసలు వినిపిస్తున్నాయి. పూల పాన్పు కాదు..ముళ్ల కిరీటమే! ప్రస్తుతం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. గతంలో ఈవోగా పని చేసిన ఆజాద్ పాలకవర్గానికే మింగుడు పడలేదు. అటువంటి ఆజాద్‌ను పర్మినెంట్‌గా ఉంచుతారా? లేక పక్షం రోజుల్లో సాగనంపి తమకు అనుకూలంగా ఉండే మరో అధికారిని తెచ్చుకుంటారా? అనేది సందేహం. గత ఈవో సీహెచ్ నర్సింగరావు లీవు ముగిసి తిరిగి విధుల్లో చేరినప్పటికీ ఆయనను రానీయకుండా దేవస్థానంలో కొంత మంది సిబ్బందిని ఉసిగొల్పుతున్నారు. మరో వైపు దేవాదాయ శాఖలో తమకు అనుకూలంగా ఎవరు ఉంటారనే అంశంపైన ఈ నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నేతల డిమాండ్లు నెరవేర్చాలంటే వచ్చే ఈవోకు తలబొప్పి కట్టడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నారుు. బీజేపీ నేతలు ఆగ్రహం ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు సూచించిన వ్యక్తిని పూర్తి కాలం ఈవోగా నియమించొద్దని బీజేపీకి చెందిన సీనియర్ నేతలు దేవాదాయశాఖ మంత్రి పీ మాణిక్యాలరావును కోరినట్లు సమాచారం. వీరితో తమ పార్టీకిగానీ, కార్యకర్తలకుగానీ ఒరిగేదేమీ లేదని, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలిసింది. పెరిగిన పోటీ అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులకు రెండు మూడు దశాబ్దాలుగా కొండపై దుకాణాలు ఉండటమే కాకుండా కాంట్రాక్టర్లతోనూ సంబంధాలు ఉన్నాయి. హాకర్స్ నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల వరకు ఈయనతో నిత్యం సంబంధాలు నడుపుతూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై చిరు వ్యాపారిగా జీవనం ప్రారంభించి ప్రస్తుతం టీడీపీ అర్బన్‌లో కీలక స్థాయిలోకి వెళ్లారు. గత ఈవో సీహెచ్ నర్సింగరావు పూర్తిగా మిండుగు పడకపోవడంతో అంతర్గత సమావేశాల్లో ఆయనను మార్చాలంటూ మంత్రులపై ఒత్తిడి తెచ్చారు. ఇక మరో ప్రజాప్రతినిధి అధికార పార్టీ వాణి జాతీయ స్థాయిలో వినిపించగల నేత. ఈయనా దేవస్థానంపై చాలా ఆశలే పెట్టుకున్నారు. గత ఈవోకు కొల్లేటి చాంతాడంత డిమాండ్లు లిస్టు ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని పాత ఈవో నెరవేర్చినట్లు ఇంద్రకీలాద్రి వర్గాల సమాచారం. అయినా సంతృప్తి చెందని ఈ ప్రజాప్రతినిధి గత ఈవో సీహెచ్ నర్సింగరావు సెలవుపై వెళ్లినప్పటికీ సస్పెండ్ చేయాలంటూ ఆ శాఖ మంత్రి వద్ద డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఈవోకు ఈ ఇద్దరి నేతల నుంచే సెగ తగులుతూ ఉండేది.. ఇప్పుడు మరో ప్రజాప్రతినిధి వీరికి తోడయ్యారు. నిన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్న ఈ నేత తరుచుగా ఈవోను తనకు సహకరించాలని కోరేవారట. అయితే ఈవో చూసీచూడనట్లు వ్యవహరించే వారు. ఇప్పుడు ఈయన అధికార పార్టీ కండువా కప్పుకోవడంతో తన కోర్కెలు చిట్టా విప్పే అవకాశముంది. -
దసరా ఉత్సవాలకు సేవా కమిటీ ఏర్పాటు ఉసూరుమన్న తెలుగు తమ్ముళ్లు
ఉత్సవ కమిటీపై టీడీపీ నేతల ఆశలు సేవా కమిటీని నియమిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ 36 మందితో జంబో కమిటీ ఏర్పాటు సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఉత్సవ కమిటీ వేస్తుందనే తెలుగు తమ్ముళ్ల ఆశ నిరాశగా మారింది. ఈ ఏడాది ఉత్సవ కమిటీ అవసరం లేదని టీడీపీకి చెందిన భక్తుల సేవల్ని మాత్రమే వినియోగించుకోవాలంటూ ప్రభుత్వం చేసిన సూచనతో బుధవారం దేవాదాయశాఖ ఉపకమిషనర్ ఎం.ఎల్. నాగమణి 36 మంది సభ్యులలో జాబితాను విడుదల చేశారు. గురువారం ఆ ఉత్తర్వులు దేవస్థానానికి చేరాయి. ఉత్తర్వులు ప్రకారం సభ్యులు దసరా ఉత్సవాలు తొలిరోజు నుంచి చివర రోజు (ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3)వరకు మాత్రమే భక్తులకు సేవలందిస్తారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట గతంలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీల్లో పనిచేసి ఎన్నికల ముందు టీడీపీలోకి వచ్చిన వారికి అవకాశం కల్పించారని పలువురు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. సినీ నటుడు హరికృష్ణతో అత్యంత సన్నిహితంగా ఉన్నవారికి, గొడవల్లో తలదూర్చేవారికి అవకాశం కల్పించినట్లు విమర్శిస్తున్నారు. పార్టీలో తొలి నుంచి జెండా మోసిన వారికి కాకుండా అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమాలు సిఫార్సులు చేసిన వారికే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. కేవలం తొమ్మిది రోజుల కోసం ఉండే కమిటీ కాడంతో నేతలు కూడా పట్టుబట్టలేదని సమాచారం. అప్పటికప్పుడు చేసే దేమిటీ ? దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులలో సభ్యుల్ని సేవలను ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు వినియోగించుకోవాలో పేర్కొన్నారు. ఉత్సవాల ప్రారంభం రోజున వచ్చి అప్పటికప్పుడు భక్తులకు తాము ఎలా సేవలందిస్తామని కమిటీలో నియమితులైన వారు అంటున్నారు. సేవా కమిటీలో సభ్యులు వీరే సేవా కమిటీలో బడేటి ధర్మారావు, ఇమ్మిడిశెట్టి శ్రీనివాసరావు, ఎన్.సి.భాను సింగ్, గంటా కృష్ణమోహన్, పి.భానుప్రకాష్, టి. శ్రీనివాసులు, బొబ్బా వాసుదేవ చౌదరి, సుంకర కృష్ణ, సీహెచ్ రామ్మోహన్, పోలవరపు శశికళ, అనుముల వి.వి.లక్ష్మణరావు, శీరంశెట్టి పూర్ణచంద్రరావు, సారేపల్లి రాధాకృష్ణ, గంటిగన్పు వెంకటేశ్వర్లు, నారిండి వెంకటరావు, సోమారామ్, గెహలోత్, సాదరబోయిన ఏడుకొండలు, నాగోతి నరసింహారావు, రావూరి సత్యనారాయణ, వెలగపూడి శంకరబాబు, కూనపరెడ్డి శ్రీనివాస్, చిగురుపాటి కుమారస్వామి, మేకల నాగేశ్వరరావు, చింతా శ్రీనివాసరావు, పడాల కన్నా, అవిర్నేని కరుణకుమార్, యలమంచిలి వెంకట నరసింహారావు, సగ్గుర్తి రమేష్, అరేపల్లి సోమేశ్వరరావు, చలసాని రమణారావు, గుమ్మడి కృష్ణారావు, కొడాలి సాయిబాబా, అన్నాబత్తుని శ్రీదేవి, మోర్ల సుబ్బారావు, పెద్ది రామారావు నియమితులయ్యారు.