తమ్ముళ్లదే ‘మనీ-సెక్స్’ రాకెట్! | TDP leaders Illigal activities | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లదే ‘మనీ-సెక్స్’ రాకెట్!

Published Sun, Dec 13 2015 9:21 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

తమ్ముళ్లదే ‘మనీ-సెక్స్’ రాకెట్! - Sakshi

తమ్ముళ్లదే ‘మనీ-సెక్స్’ రాకెట్!

పోలీసుల సోదాలలో పలు ఆధారాలు లభ్యం
♦ డీఈ కారు కూడా స్వాధీనం
అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నేతృత్వం
♦ కేసును నీరుగార్చేందుకు ముమ్మర యత్నాలు
♦ పోలీసులపై కేంద్ర మంత్రి ఒత్తిళ్లు
♦ తెరపైకి కొత్త కేసులు, ఆరోపణలు
♦ అప్పులు మాఫీ చేస్తామంటున్న అధికారపార్టీ నేతలు
 
 సాక్షి ప్రతినిధి, విజయవాడ: అప్పులు ఇచ్చి మహిళలను బలవంతంగా లొంగదీసుకుని వ్యభిచార కూపంలో దించుతున్న కాల్‌మనీ (అధికవడ్డీలకు అప్పులిచ్చే) ముఠాకు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నది అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులేనని తేలింది. విజయవాడ పటమట పంటకాల్వ రోడ్డులోని నిందితుల కార్యాలయంలో పోలీసులు జరిపిన సోదాలలో ఈ మేరకు పలు ఆధారాలు లభిం చాయి. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, ఆస్తుల తాలూకు పత్రాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజనీర్ (టెక్నికల్) ఎం.సత్యానందానికి చెందిన ఓ ఖరీదైన కారును కూడా అధీనంలోకి తీసుకొన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఆయన సోదరుడు, ఒక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నారని తేలింది. ఈ కేసులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ డీఈ  సత్యానందం, ఎమ్మెల్యేతో కలిసి విదేశీ యాత్రలో ఉన్న వెని గళ్ల శ్రీకాంత్ మరికొందరు పరారీలో ఉన్నారు.

 కేంద్రమంత్రి ఒత్తిళ్లు... కొత్త ఫిర్యాదులు
 మరోవైపు కాల్‌మనీ కేసులో నిందితులను కాపాడేందుకు పై స్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న అధికార పార్టీ నేత ఒకరు, కొందరు ఎన్‌జీవో నేతలు పోలీసులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. మహిళలపై లైంగిక వేధింపుల అంశాన్ని మరుగున పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అధికారపార్టీకి చెందిన ముఖ్యనేతల పేర్లు తెరపైకి రాకుండా, చర్చనీయాంశం కాకుండా చేసేందుకు వీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం నాడు వల్లూరి సూర్య రమేష్, అడపా సత్యబాబు, భీమేశ్వరరావు అనే ముగ్గురు వ్యక్తులు తాము యలమంచిలి రాము, వెనిగళ్ల శ్రీకాంత్‌ల చేతిలో మోసపోయామంటూ విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు, వారిని బలవంతంగా వ్య భిచార కూపంలోకి దించడం వంటి అంశాలను నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతలే కొందరి చేత ఇలా అదనపు కేసులు నమోదు చేయిస్తున్నారని వినిపిస్తోంది. అలాగే ఇప్పటికే పట్టుబడిన నిందితుల ఆర్థిక మూలాలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూసేందుకు కూడా అధికారపార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

 కేసుల నుంచి బైటపడేందుకు వ్యూహం...
 కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లో కీలకంగా ఉన్న యలమంచిలి రాముకు గతంలో దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఇటీవలే గిడ్డంగుల కార్పొరేషన్ పదవి పొందిన ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌కు యలమంచిలి రాము బంధువు. అలాగే కృష్ణా జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులుకు వరుసకు కుమారుడు. బంధుత్వాలను అడ్డంపెట్టుకొని కేసుల నుంచి బయటపడేందుకు వ్యూహం పన్నుతున్నారని వినిపిస్తోంది.

 సెక్స్‌రాకెట్‌ను మరుగున పరచేందుకు..
 మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించడం, వారిపై లైంగిక దాడులు జరగడం వంటి అంశాలను తప్పుదారి పట్టించేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీకృష్ణలు రంగంలోకి దిగారు. అప్పులు తీసుకున్న వారు తమను సంప్రదిస్తే పూర్తిగా రద్దుచేయిస్తామంటూ ప్రకటించారు. అసలు సమస్య కాల్‌మనీ ఒక్కటే కాదని, మహిళలను బలవంతంగా సెక్స్‌రాకెట్‌లోకి దించిన అంశం ప్రధానమని బాధితులు అంటున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రి ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కేసుల విషయంలో చెరోవిధంగా వ్యవహరిస్తుండడం అధికార పార్టీ నేతల్లో కలవరం రేపుతోంది. నిందితులను కాపాడేందుకు ఒకరు యత్నిస్తుండగా మరొకరు నిందితులకు శిక్ష పడాల్సిందేననే పట్టుదలతో ఉన్నారు. పోలీసులను బెదిరించి నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తే తాను పైస్థాయి వరకు వెళతానని ఎంపీ నాని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.  
 
 ముఠా ఆగడాలు అన్నీ ఇన్నీ కావు..
 కాల్‌మనీ ముఠా చేస్తున్న ఆగడాలు అన్నీ ఇన్నీ కావని వీరి వ్యవహారాలు తెలిసినవారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన యలమంచిలి రాము సోదరుని సంవత్సరీక కార్యక్రమం హనుమాన్‌జంక్షన్ వద్ద కాకులపాడులో నవంబరు 26న జరిగింది. ముందురోజు రాత్రి స్థానిక రైసుమిల్లులో కాల్‌మనీ ముఠాకు చెందిన పలువురు ముఖ్యులు కలుసుకున్నారని, తమ గుప్పిట్లో చిక్కుకున్న కొందరు మహిళలను ఇక్కడకు తీసుకొచ్చి తెల్లవార్లూ విందువినోదాలలో మునిగితేలారని సమాచారం. ఇందులో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పాల్గొనడంతో పోలీసులు ఆవైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదని వినిపిస్తోంది.

పటమటలో ఈ ముఠా అద్దెకు తీసుకున్న ఇంటి యజమాని శేషగిరిరావు కూడా వీరి ఆగడాల గురించి పోలీసు కమిషనర్‌కు వివరించారు. ఇటీవలే తన కుమారుడు హైదరాబాద్ నుంచి వచ్చినందున ఇల్లు తమకే అవసరమౌతున్నదని, అందువల్ల ఖాళీ చేయాల్సిందిగా వారిని కోరానని ఆయన తెలిపాడు. అయితే ఇల్లు ఖాళీ చేయమన్నందుకు తనను కొట్టారని, తలపై నాలుగుకుట్లు పడ్డాయని ఆయన వివరించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement