
మాటే శాసనం
► మేం చెప్పినట్లే... అధికారులు వినాలి
► కలెక్టర్, ఎస్పీ మొదలు అధికారులందరూ మా కనుసన్నల్లో నడవాలి
► ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జులకు కోట్లాది రూపాయల పనులివ్వాలి
► మంత్రి నారాయణను టీడీపీ నేతల డిమాండ్
► అన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చిన మంత్రి
► అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తానన్ననారాయణ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘మా నియోజకవర్గంలో మేమే రాజులం. ఎమ్మెల్యే అయినా, నియోజకవర్గ ఇన్‌చార్జి అయినా మేం చెప్పినట్లే నడవాలి.. మాకు తెలియకుండా మా నియోజకవర్గంలో ఏ చిన్న పనీ చేయడానికి వీల్లేదు. అధికారులు మేం చెప్పినట్లే వినాలి, బదిలీలు మేం చెప్పినట్లే జరగాలి, నీరు–చెట్టుతో పాటు వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల పనులు ఇవ్వాలి. అలా అయితేనే మేం పని చేస్తాం, వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీతో పోటీ పడాలంటే మేం చెప్పిందల్లా చేయాలంటూ’ జిల్లాలోని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు మంత్రి నారాయణకు స్పష్టం చేశారు.
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్, కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. సమావేశానికి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి శిద్దా రాఘవరావు హాజరుకాలేదు. తొలుత ఆయా నియోజకవర్గ పార్టీ పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు, మెజార్టీపై మంత్రి ఆరా తీశారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనేందుకు గట్టిగా పనిచేయాలని మంత్రి చెప్పారు.
దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు మంత్రి ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. ఎస్పీ త్రివిక్రమవర్మ తాము చెప్పినట్లు వినడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా డీఎస్పీల మొదలు ఎస్సైల స్థాయి వరకు తాము చెప్పినట్లు వినే పోలీస్ అధికారులనే నియమించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు తమ మాటే వినేలా ఆదేశించాలని వారు కోరారు. బదిలీలు తాము చెప్పినట్లే చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అన్ని నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయల పనులు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా చెక్‌డ్యామ్‌లు, నీరు–చెట్టు పనులు, లింక్‌రోడ్లు, పెద్ద ఎత్తున మంజూరు చేయాలని కోరారు. కార్యకర్తలకు పనులివ్వకపోతే ఎన్నికల్లో పని చేసే పరిస్థితి లేదని వారు తేల్చి చెప్పారు. తమ వర్గీయులకు పింఛన్లు పెద్ద ఎత్తున మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాడని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఇటీవల గిద్దలూరుకు చెందిన నలుగురు అధికార పార్టీ కౌన్సిలర్లను ప్రతిపక్ష పార్టీలో మాజీ ఎమ్మెల్యే సహకరించాడని ముత్తుముల అన్నా రాంబాబుపై మొదటి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో తాము విచారించి వివరాలు తెలుసుకుంటామని మంత్రి సమాధానమిచ్చారు. తాగునీటి సరఫరాకు మరిన్ని నిధులు కేటాయించాలని నేతలు కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకు మొక్కుబడిగా నిధులివ్వడంతో పాటు పనులు నత్తనడకన సాగుతుండటంపై ప్రతిపక్ష పార్టీతో పాటు స్వపక్షం వారే విమర్శిస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. కాబోయే రెండేళ్లలో తాము చెప్పినట్లు అధికారులు పనులు చేయకపోతే పార్టీ మనుగడ సాగించటం కష్టమని నేతలు మంత్రికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులతో పాటు జిల్లా అధికారులందరినీ ఒకే వేదికపైకి తెచ్చి తొలుత సమావేశం నిర్వహించాలని వారు కోరారు. సమస్యలను ముఖ్యమంత్రికి తెలపడంతో పాటు త్వరలోనే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.